రిజర్వాయర్లలో నీటి నిల్వలుండేలా చర్యలు
యుద్ధప్రాతిపదికన కార్యాచరణకు కె.సి.ఆర్. ఆదేశాలు
సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్, జులై 02 : వర్షాభావ పరిస్థితుల కారణంగా దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి రానీయకుండా కాళేశ్వరం సహా, గోదావరి, కృష్ణా నదుల మీదున్న ప్రాజెక్టుల నుంచి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ, రిజర్వాయర్లలో నీటి నిల్వలుండేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్షపాతం, ప్రాణహిత తదితర నదుల్లో ప్రవహిస్తున్న నీటి లభ్యత, రాష్ట్రంలోని రిజర్వాయర్లలోని నీటి నిల్వలు, ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుత్ డిమాండు తదితర పరిస్థితుల పై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డా. బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తాగునీరు, సాగునీటికి లోటు రానీయకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని నీటి లభ్యతా వివరాలను సీఎం కేసీఆర్ కు ఆయా శాఖల ఉన్నతాధికారులు వివరించారు.
తాగునీటికి ప్రాధాన్యత
రాష్ట్రంలో తాగునీటికి ప్రాధాన్యతనిచ్చి గోదావరి, కృష్ణా నదుల పరిధిలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని, ఈ దిశగా ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ సమన్వయంతో పనిచేయాలని, చుక్క చుక్క ఒడిసిపట్టి, ప్రజలకు నీటిని అందించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. అదే సందర్భంలో ప్రాణహిత ద్వారా చేరుకుంటున్న జలాలను ఎప్పికప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోస్తూ, మిడ్ మానేర్ ను నింపాలని అన్నారు. అక్కడి నుంచి లోయర్ మానేర్ డ్యాంకు సగం నీళ్ళను, పునరుజ్జీవన వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి సగం నీళ్ళను ఎత్తిపోయాలన్నారు. తద్వారా అటు కాళేశ్వరం చివరి ఆయకట్టు సూర్యపేట దాకా, ఇటు ఎస్సారెస్పీ ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయకార్ రావు, జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, జాజుల సురేందర్, సీఎస్ శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్ బి ఎండి దాన కిషోర్, వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్ రావు, ట్రాన్స్ కో అండ్ జెన్ కో సీఎండి ప్రభాకర్ రావు, టిఎస్ ఎస్పీడిసిఎల్ సీఎండి రఘుమారెడ్డి, టిఎస్ ఎన్పీడిసిఎల్ సీఎండి గోపాల్ రావు, ఎత్తిపోతల పథకాల సలహాదారు కె. పెంటారెడ్డి, ఇరిగేషన్ శాఖ ఈఎన్సీలు మురళీధర్, హరి రామ్, వెంకటేశ్వర్లు, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, గోదావరి, కృష్ణా నదుల ప్రాజెక్టుల ఈఎన్సీలు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కంటింజెన్సీ ప్లాన్ సిద్ధం కావాలి
అదే సందర్భంలో ఇప్పటికే కురిసిన వానలకు పత్తి, తదితర విత్తనాలు వేసిన ప్రాంతాల్లో, వర్షాభావ పరిస్థితుల్లో మొలకలెత్తకుండా ఎండిపోయిన నేపథ్యంలో తిరిగి రైతులు విత్తుకునే పరిస్థితులున్నాయని, అటువంటి పరిస్థితుల్లో విత్తనాలు, ఎరువులు తిరిగి అందించగలిగే విధంగా “కంటిన్ జెన్సీ ప్లాన్” సిద్ధం చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రతి రోజు మినట్ టు మినట్ రిపోర్టును సీఎం కార్యాలయానికి ప్రతి రోజు ఉదయాన్నే అందజేయాలని, ఇరిగేషన్ శాఖ, వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్ శాఖల నుంచి వ్యవసాయం, తాగునీరు, సాగునీరు పంపిణీకి సంబంధించి వస్తున్న రిపోర్టులను అనుసరించి సీఎం కార్యాలయం సంబంధిత ప్రాంతాల మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ, అప్రమత్తం చేస్తుందనీ, తద్వారా ఎటువంటి సమస్య తలెత్తకుండా సమన్వయం చేస్తామని సీఎం తెలిపారు.
అధికారులపై గురుతర బాధ్యత
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ “కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతగా కష్టపడ్డారో అదే స్థాయిలో ప్రాణహిత, గోదావరి ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్టు ఎత్తిపోస్తూ రాష్ట్రంలో తాగునీటికి, సాగునీటికి ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారుల మీద ఉన్నది. ఇన్ని రోజులు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు. ఇది ఇరిగేషన్ శాఖకు టెస్టింగ్ టైం” అని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
అవసర సమయంలోనే సామర్ధ్యానికి పరీక్ష
“ ఇది మునుపటి తెలంగాణ కాదు. గతంలో లాగా ఆలోచిస్తే కుదరదు. నీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నాం. తాగునీరు, సాగునీటి అవసరాలకు సమృద్ధిగా నీరు అందుతున్నది. ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడే మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. సంక్షోభ సమయంలనే మనం పంటలు పండించి చూపించాలి. అప్పుడే మనం సిపాయిలం. అన్ని వ్యవస్థలు సమన్వయం చేసుకుంటూ, ఎవరి పని వారు సమర్థవంతంగా నిర్వహిస్తూ, మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. మీ పరిజ్ఞానాన్ని అంతా పెట్టి ప్రజల కోసం పనిచేయాలి. ఈ పరిస్థితిని సవాలుగా తీసుకోవాలి. ఈ ఒక్క సంవత్సరం అనుభవం భవిష్యత్ తెలంగాణ చరిత్రలో ఉపయోగపడుతుంది. ఎక్కడి ఈఎన్సీలు అక్కడే ఉండి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు నీరు అందించడమే లక్ష్యంగా నిరంతరం ఏకాగ్రతతో పనిచేయాలి. ఇందుకు అందరం కలిసి ప్రతిజ్ఞ తీసుకోవాలి. ” అని సీఎం స్పష్టం చేశారు.
మిషన్ భగీరథ ఈ.ఎన్.సి. కి ఆదేశం
తాగునీటి అవసరాల కోసం రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని మిషన్ భగీరథ ఈఎన్సీని సీఎం ఆదేశించారు. కాగా ఉదయ సముద్రం, కోయిల్ సాగర్ రిజర్వాయర్లలో కొంత నీటి ఎద్దడి ఉన్నదని, వాటిలో నీటి నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పంపింగ్ నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కాకుండా, ప్రభుత్వరంగ సంస్థ అయిన జెన్ కో కు ఇచ్చేలా విధివిధానాలు ఖరారు కోసం చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు.
పాలేరు రిజర్వాయర్ కు నాగార్జున సాగర్ నుంచి నీరు వచ్చే అవకాశాలు ప్రస్తుతం లేనందున, బయ్యన్నవాగు నుంచి నీటిని సందర్భానుసారం పాలేరుకు వదిలేలా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు.
“ఎగువ గోదావరి నుంచి నీరు రాకున్నా, ప్రాణహిత ద్వారా నీరు మేడిగడ్డ రిజర్వాయర్ కు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజు 1 టిఎంసి నీటిని మేడిగడ్డ నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్ళకు ఎత్తిపోసేలా మోటార్లను నిరంతరాయంగా, 24 గంటలు నడిపిస్తూనే ఉండాలి. సుందిళ్ళ నుంచి అంతే నీటిని మిడ్ మానేరు తరలించాలి. అక్కడి నుంచి సగం నీటిని లోయర్ మానేరుకు, సగం నీటిని వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలి. తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తుంగతుర్తి మీదుగా సూర్యపేటలోని చివరి ఆయకట్టు చిన సీతారాం తండా దాకా సాగునీరు అందేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలి” అని సీఎం అన్నారు.
“ఎత్తిపోతలకు సరిపోయే విద్యుత్ ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ సమన్వయం చేసుకోవాలి” అని సీఎం ఆదేశించారు.
కష్టకాలంలో నీటిని వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రజలు, రైతాంగం జాగ్రత్తలు వహించాలని, నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని అందుకు వ్యవసాయశాఖ, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ల సూచనలు, సలహాలు పాటిస్తూ పంటలు పండించుకోవాలని రైతులకు, ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్ర రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామని సీఎం పునరుద్ఘాటించారు.