తొలుత భారతీయ రాష్ట్ర సమితి అని ప్రచారం
రాజకీయాల్లో కేసీఆర్ దూకుడు
విజయ దశమి నాడు పూర్తి వివరాలు వెల్లడి
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
భారత రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కాబోతోంది. ఉద్యమ సింహంగా పేరొందిన తెలంగాణ సాధకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోంది. దీనికి సంబంధించి ఇంతవరకూ ఆ నోటా ఈ నోటా వినడమే తప్ప రూఢీగా తెలిసిన వారెవరూ లేరు. ఆదివారం నాడు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యులతో సమావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ గురించి స్వయంగా వివరించారు. చర్చించారు. పార్టీ పేరు మీద మాత్రం స్పష్టతనివ్వలేదు. పార్టీలోని కొందరు అత్యంత ప్రముఖులకు మాత్రం పార్టీ పేరు తెలిసి ఉండవచ్చు. చివరి నిముషం దాకా కూడా పేరు ఎవరికీ తెలియకుండా కేసీఆర్ జాగ్రత్త తీసుకున్నారు. కొన్ని పేర్లను పరిశీలిస్తున్నట్లు మాత్రం ప్రచారంలోకి తెచ్చారు. భారతీయ రాష్ట్ర సమితి కావచ్చని సూచన ప్రాయంగా వెల్లడించారు.
ఎప్పటి నుంచో కసరత్తు
కొత్త పార్టీకి సంబంధించి కేసీఆర్ తన కసరత్తును ఎప్పటి నుంచో ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడేందుకు కేసీఆర్ ప్రగతి భవన్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఆ సమావేశంలో కేసీఆర్ విమర్శల వర్షం కురిపించారు. కేంద్ర నిర్ణయాలను తూర్పారపట్టారు. ప్రధాన మంత్రి మోడీనీ, బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలనూ ఏకిపారేశారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజా శ్రేయస్సు పట్టడం లేదంటూ విమర్శించారు. ఈ సందర్బంలో ఆయన చేసిన ఒక వ్యాఖ్య కేసీఆర్ కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారన్న అనుమానాన్ని కలుగజేసింది. కొత్త రాజ్యాంగం అవసరమనీ, దానికోసం రిటైర్డ్ ఐఎఎస్, ఐపీఎస్, మేధావులు, శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు, ఇలా అన్ని రంగాల ప్రముఖులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, చర్చిస్తామనీ కేసీఆర్ అనడం అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. ఆ తరవాత నుంచి కేసీఆర్ తరచూ మీడియాతో సమావేశమవుతూ కేంద్రంపై విమర్శలను కుప్పిస్తూనే ఉన్నారు. ఆయన వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణం ఉందన్న వారూ లేకపోలేదు. రాజకీయం ప్రజా శ్రేయస్సు కోసమే తప్ప వారిని ఇబ్బందులు పెట్టడానికి కాదని కేసీఆర్ సుస్పష్టంగా ప్రకటించారు. రైతుల ఆందోళనకు మద్దతు పలకడమే కాకుండా.. ఆ సందర్భంగా మరణించిన రైతుల కుటుంబాలకు ఆయా రాష్ట్రాలకు వెళ్ళి మరీ సాయాన్ని అందించి వచ్చారు. గాల్వన్ ఘర్షణలో మరణించి సైనికుల కుటుంబాలకూ ఆర్థిక సాయాన్ని అందించి వచ్చారు. ఈ క్రమంలో తమిళనాడు, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, పంజాబ్, తదితర రాష్ట్రాలను సందర్శించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సత్సంబంధాలను నెలకొల్పుకున్నారు. స్టాలిన్, కుమారస్వామి, అఖిలేశ్ యాదవ్‌లతో పాటు బీకేఎస్ అధినేతతోనూ వివిధ అంశాలను చర్చించారు. ఎంతో కసరత్తు చేసి, జాతీయ పార్టీ నెలకొల్పాలనే నిర్ణయానికి వచ్చారు కేసీఆర్. ఎంత చేస్తున్నప్పటికీ గుంభనంగా వ్యవహరించారు. తాజాగా నిర్వహించిన పార్టీ సమావేశంలో జాతీయ పార్టీ నెలకొల్పుతున్న విషయాన్ని బహిర్గతం చేశారు. విజయదశమి నాడు పార్టీ పేరును ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. బహుశా పార్టీ పేరు జాతీయ రాష్ట్ర సమితి కావచ్చు. ప్రాంతీయ పార్టీ పేరు ఎలాగూ తెలంగాణ రాష్ట్ర సమితి కాబట్టి, దానికి అనుగుణంగానే పేరు ఉండాలనేది ఆయన భావన కావచ్చు. భారతీయ రాష్ట్ర సమితి అని ప్రచారం బలంగానే ఉన్నప్పటికీ చివరి నిముషంలో జాతీయ రాష్ట్ర సమితిగా ప్రకటించవచ్చు. జాతీయ స్ఫూర్తి రగిలించడానికి కొత్త పార్టీ అవసరం. కారణం ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నానాటికీ దిగజారిపోతుండడం. అంతర్గత కలహాలతో కునారిల్లిపోతుండం. ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య బలమైన ప్రతిపక్షం లేకపోవడం. ప్రాంతీయ పార్టీలను కలిపి ఉంచే శక్తి కొరవడడంతో ప్రభుత్వాలది ఆడింది ఆట… పాడింది పాటగా మారుతోంది. ఇటువంటి తరుణంలో కొత్త పార్టీ రానుండడం శుభకరం.
కొత్త పార్టీ జాతీయ రాష్ట్ర సమితి?
Date: