పేదోళ్ల ఇళ్లలో పెద్దోళ్ల సౌకర్యాలు
కె.సి.ఆర్. నగరును ప్రారంభించిన సీఎం
హైదరాబాద్, జూన్ 22 : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం నాడు సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. తొలుత కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. అనంతరం కొండకల్ లో మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. తదుపరి పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ దవాఖానకు శంకుస్థాపన చేశారు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపూరం మండలం కొల్లూరులో ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ డిగ్నిటి హౌసింగ్ కాలనీ ‘కేసీఆర్ నగర్’ ను 145 ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత విశాలవంతంగా పలు అంతస్తుల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ గృహాల సముదాయాన్ని నిర్మించారు. దాదాపు 2.5 కి.మీ పరిథిలోని వీధుల్లో, ఎలక్ట్రిక్ బగ్గీలో తిరిగారు. పరిసరాలను పరిశీలించారు.
జిహెచ్ఎంసి పరిధిలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం… హైద్రాబాద్ తో పాటు రంగారెడ్డి మేడ్చెల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 111 వివిధ ప్రాంతాల్లో జిహెచ్ఎంసి నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల పురోగతి కి సంబంధించిన వివరాలను ఫొటో ఎగ్జిబిషన్ లో సీఎం కేసీఆర్ పరిశీలించారు. కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూం భవనాల నిర్మాణాల త్రీడి నమూనాను మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు సీఎంకు వివరించారు. అనంతరం కొద్దిమంది ఎంపిక చేసిన ఆరుగురు లబ్ధిదారులకు సీంఎం ఇండ్ల పట్టాలను లాంఛనంగా అందించారు.
పేదల నివాసాల్లో పెద్దోళ్ల సౌలత్ లు
స్లమ్ములు తదితర ఇరుకిరుకు గల్లీల్లో నివాసాలుంటున్న నిరుపేదలు కూడా ఇతరుల మాదిరే అన్ని సౌకర్యాలతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రయివేట్ అపార్టుమెంట్లల్లో వుండే అన్ని రకాల వసతులతో కూడిన ఇంటిలో నివాసముండాలనే లక్ష్యంతో మానవీయ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నది. అందులో భాగంగా లక్ష నివాసాలను నిర్మించేందుకు జీహెచ్ఎంసీ చేపట్టిన కార్యాచరణ పలు దశల్లో కొనసాగుతున్నది.
ఇందులో భాగంగా కొల్లూరులో రూ.1,489.29 కోట్ల ఖర్చుతో సకల హంగులతో 15,660 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం నిర్మిచింది. సిఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభమైన ఈ నివాస ప్రాంగణంలో ఆధునిక లైబ్రరీ, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, మిల్క్ బూత్స్, పెట్రోల్ బంకులు, బస్తీ దవాఖానలు, ఇంటిగ్రేటెడ్ హాస్పటల్, బ్యాంకు, ఏటిఎం, ప్లే స్కూళ్ళు, అంగన్వాడీ సెంటర్లు, ప్రైమరీ స్కూలు, హై స్కూల్, వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు, కమ్యూనిటి సెంటర్లు, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్, ప్లే గౌండ్లు, ఓపెన్ ఎయిర్ జిమ్, ఇండరో స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆంఫి థియేటర్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, బతుకమ్మ ఘాట్, చిల్డ్రన్ ప్లే గ్రౌండ్, షాపింగ్ కాంప్లక్స్, ఆయా మతాల సాంప్రదాయలకు అనుగుణంగా వైకుంఠధామాలను ఏర్పాటు వంటి పలు రకాల మౌలిక సదుపాయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.
‘కేసీఆర్ నగర్’ కాలనీలో నివాసముండే ప్రజల అవసరాలకు అనుగుణంగా 280 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రతి రోజు 78 లక్షల లీటర్ల నీటిని అందించే విధంగా వాటర్ వర్క్స్ శాఖ ఏర్పాట్లు చేసింది.