ప్రజా రవాణా వ్యవస్థ మెరుగునకు నిర్ణయం
వివిధ విభాగాల పటిష్టతే థ్యేయం
అదనంగా ఉద్యోగ నియామకాలు
అవసరమైన నిధులు మంజూరు
తెలంగాణ క్యాబినెట్ సమావేశ నిర్ణయాలు
హైదరాబాద్, డిసెంబర్ 10: రాష్ట్రంలో వ్యవసాయం తో పాటు పలు రంగాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న అభివృద్ధికి అనుగుణంగా రోడ్లు భవనాల శాఖలో పని విస్తృతి పెరుగుతున్నదని, అందుకు అనుగుణంగా శాఖలోని పలు విభాగాలను పటిష్టం చేయాలని, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీసుకున్న పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
రోడ్లు భవనాల శాఖలో అధికార వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన అదనపు ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, అవసరమైన మేరకు నూతన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆదేశించింది. అందుకోసం అదనపు నిధులను కూడా మంజూరు చేసింది. ఇందులో భాగంగా రోడ్లు భవనాల శాఖ చేసిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతే కాకుండా అత్యవసర సమయాల్లో అధికారులు స్వీయ నిర్ణయంతో ప్రజావసరాలకు అనుగుణంగా పనులు చేపట్టేందుకు కేబినెట్ అవకాశమిచ్చింది.
క్యాబినెట్ సమావేశ నిర్ణయాలు ఇలా ఉన్నాయి….
రోడ్లు భవనాల శాఖ లో పెరిగిన పనికి అనుగుణంగా శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బి శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది. ఇందులో… కొత్తగా 3 చీఫ్ ఇంజనీర్ పోస్టులు., 12 సూపరిండెంట్ ఇంజనీర్ పోస్టులు., 13 ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు., 102 డి.ఈ.ఈ పోస్టులు., 163 అసిస్టెంట్ ఈ.ఈ పోస్టులు., 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులతో పాటు పలు టెక్నికల్ , నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టాలని రోడ్లు భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది. దాంతో పాటు సత్వరమే పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.
పెరిగిన నూతన ఉద్యోగాలతో పాటు, ఆర్ అండ్ బీ శాఖలో పరిపాలన బాధ్యతల వికేంద్రీకరణకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల నిర్మాణం, మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బి శాఖ లోని.., రోడ్లు, భవనాలు, ఎలక్ట్రికల్, జాతీయ రహదారుల విభాగాల్లో… 3 చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలను., 10 సర్కిల్ కార్యాలయాలను., 13 డివిజన్ కార్యాలయాలను., 79 సబ్ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి శాఖను కేబినెట్ ఆదేశించింది.
అదే సందర్భంలో… రోడ్లు భవనాల శాఖను మరింత పటిష్ట పరిచేందుకు ప్రజావసరాల దృష్ట్యా పనులు చేపట్టేందుకు ఈ ఆర్థిక సంవత్సరానికి అదనంగా నిధులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా.. కాలానుగుణంగా చేపట్టే రోడ్ల మరమ్మతు ( పీరియాడిక్ రెన్యువల్స్) ల కోసం, కూ. 1865 కోట్లను మంజూరు చేసింది. వానలు, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా రోడ్లు తెగిపోవడం, కొట్టుకుపోవడం వంటి సందర్భాల్లో ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగు పరిచే దిశగా తక్షణమే పనులు చేపట్టేందుకు గాను.. రూ. 635 కోట్ల నిధులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
విపత్తుల సమయంలో డీఈఈ స్థాయి వరకూ స్వతంత్ర నిర్ణయాలు
వానలు వరదలు తదితర ప్రకృతి విపత్తుల సందర్భంలో, ప్రజావసరాలకు అనుగుణంగా, అసౌకర్యాన్ని తొలగించి యుద్దప్రాతిపదికన పనులు చేపట్టేందుకు., వీలుగా కింది స్థాయి డి.ఈ.ఈ నుంచి పై స్థాయి సి.ఈ వరకు స్వతంత్ర నిర్ణయాధికారానికి కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా… విచక్షణతో కూడిన స్వీయ నిర్ణయాలను తీసుకుని పనులు చేపట్టేందుకు డి.ఈ.ఈ కి వొక్క పనికి రూ. 2 లక్షలు (సంవత్సరానికి 25 లక్షలు)., ఈ.ఈ కి 25 లక్షల వరకు (ఏడాదికి 1.5 కోట్లు)., ఎస్. ఈ పరిధిలో 50 లక్షలు (సంవత్సరానికి 2 కోట్లు) ., సీ.ఈ పరిధిలో రూ. 1 కోటి వరకు (సంవత్సరానికి 3 కోట్ల వరకు) పనులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అత్యవసర సమయాల్లో ఈ పనులను అవసరమైతే నామినేషన్ పద్దతుల్లో చేపట్టేందుకు అధికారాలను కల్పించింది. ఇందుకోసం..ఏడాదికి రూ. 129 కోట్లు ఆర్ అండ్ బీ శాఖ ఖర్చు చేసేందుకు కేబినెట్ అవకాశం కల్పించింది.
ఇదే పద్దతిని అనుసరిస్తూ.. భవనాల విభాగంలో కూడా అత్యవసర సమయాల్లో రిపేర్లు తదితర ప్రజావసరాల కోసం ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించింది. అత్యవసర పనులు చేపట్టేందుకు పరిమిత నిధులతో స్వీయ నిర్ణయాధికారాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు తగ్గట్టుగా నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది.