ఆకర్షిస్తున్న టీడీపీ కార్యకర్త రవిశంకర్
(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)
తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్ష పదవి ఖాళీ అవ్వగానే ముందుగా తెరపైకి వచ్చే పేరు సీఎం రవిశంకర్. గడిచిన మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం కార్యకర్త అయినా ఆయన కొంతకాలంగా ఆ పదవికోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అధికారంలో ఉండే ముఖ్యమంత్రి కరుణతో పాటూ జగద్రక్షకుని కృపాకటాక్షాల కోసం అర్ధిస్తూనే ఉన్నారు. ఇంతవరకూ రవిశంకర్ పై ఇద్దరికీ కరుణ కలగలేదు. అయినా ఆయన ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇప్పుడూ తన ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. కానీ కొంత కొత్తదనంగా. తనను టీటీడీ అధ్యక్షునిగా నియమించాలని కోరుతూ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహజరు సమర్పించారు. ఇందులో పెద్ద విశేషం ఏముంది? ఎవరైనా సమర్పించవచ్చనే కదా మీ అనుమానం. దీన్ని అంగీకరిస్తాం. ఆ మహాజరును చూస్తే మీరు కూడా ఒప్పుకుని తీరతారు. ఇందుకు రవిశంకర్ ఒక వినూత్న విధానాన్ని అవలంబించారు.
సంస్కృతంలో ఆయన తన లేఖను ప్రారంభించారు. ఓం భువన చంద్ర లోకేశా దేవాంశో నమోస్తుతే అంటూ రవిశంకర్ తొలి వాక్యాన్ని రాశారు. ఇందులో చంద్ర బాబు సతీమణి భువనేశ్వరి, ఆయన కుమారుడు లోకేష్, మనవడు దేవాన్ష్ పేర్లు వచ్చేలా చూశారు. ఇది చూసి వారు ప్రసన్నులై తన కోరికను మన్నిస్తారనేది రవిశంకర్ ఆశ కావచ్చు. మూడు దశాబ్దాలుగా తెలుగు దేశం కార్యకర్తగా ఉన్న ఆయన వివిధ రూపాల్లో తన వినతిని చంద్ర బాబుకు పంపారు. టెక్స్టైల్, ఫార్మాస్యూటికల్ వ్యాపారాలు చేసే రవిశంకర్, తనకు శ్రీవారి పాద సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని అర్థిస్తున్నారు. ఎప్పుడు టీటీడీ చైర్మన్ పోస్ట్ ఖాళీ అయినా ఆయన తన ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు.
ఈసారి టీటీడీ చైర్మన్ పదవిని ప్రజా ప్రతినిధులకు ఇచ్చే ఉద్దేశం లేదని చంద్ర బాబు ప్రకటించారు. ఇదే అంశాన్ని మురళీమోహన్ వంటి ఆయన సన్నిహితులు కూడా ధ్రువపరిచారు. తనకు చైర్మన్ పదవి ఇవ్వాలని అడిగినప్పుడు ఎవరికిపడితే వారికి ఇవ్వడం కుదరదని చంద్రబాబు కుండబద్దలు కొట్టారని డెక్కన్ క్రానికల్ ఒక కథనంలో పేర్కొంది. ఈ క్రమంలో తనకు ఈసారైనా ఆ పదవి దక్కుతుందనే ఆశలో ఆయన ఉన్నారు.