శశికళ-రజనీ భేటీ వెనుక బీజేపీ వ్యూహం!
జమిలి ఎన్నికలే లక్ష్యంగా పావులు
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
తమిళనాట కాలూనాలన్న వ్యూహాలకు బీజేపీ ఇంకా స్వస్తి చెప్పలేదా? అంతే కదా.. రాజకీయాలంటేనే అంత. నిరంతరం తమ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తూనే ఉంది. రెండు సీట్ల నుంచి 320 సీట్ల స్థాయికి ఎదగగలిగింది. దక్షిణాదిన ముఖ్యంగా తమిళనాట ఆ పార్టీ పప్పులు ఉడకడం లేదు. అయినా తన ప్రయత్నాలను మానడం లేదు. కేరళలో ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. అన్నా డీఎంకే సాయంతో ఎదగాలని తమిళనాట భావించింది. వెనక ఉండి నడిపించగలిగింది తప్ప, పైచేయి సాధించలేకపోయింది. రానున్న ఎన్నికల్లో అయినా తన కలను సాకారం చేసుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. శశికళా నటరాజన్ పావుగా ఇప్పుడు క్రీడ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆరోగ్యం సహకరించడం లేదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ స్థాపన నుంచి వెనకడుగు వేయడం, ఆపై ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం తెలిసిందే. ఈ అవార్డును రాజకీయాలతో ముడిపెట్టడం తప్పవుతుంది. రజనీకాంత్ నిజంగా గొప్ప నటుడే. కానీ, రెండు వెంటవెంటనే సంభవించడంతో దీన్ని రాజకీయ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. ఆ తదుపరి జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించడం, తనకు కనీస సీట్లు రావకపోవడంతో బీజేపీ కంగుతింది. ఈ క్రమంలోనే కొత్త రాజకీయానికి తెరతీసింది.
అనారోగ్యం అడ్డు పెట్టుకుని రాజకీయం
ఇటీవలి కాలంలో రజనీకాంత్ మరోసారి అనారోగ్యం బారిన పడ్డారు. అక్టోబర్ నెలలో ఆయన చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గొంతుకు సంబంధించిన నరాలకు చికిత్స తీసుకున్నారు. కెరటాయిడ్ రీ వాస్య్యులరైజేషన్ చికిత్స అందించామని ఆ ఆస్పత్రి తెలియచేసింది. ఈ క్రమంలో శశికళా నటరాజన్ మంగళవారం నాడు రజనీ ఇంటికి వెళ్ళారు. పరామర్శకు అని చెబుతున్నప్పటికీ, దీని వెనుక రాజకీయ ప్రయోజనం దాగుందని చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు. అసెంబ్లీ ఎన్నికలకు ఇద్దరూ దూరంగా ఉన్నవారే. ఇప్పుడు ఇద్దరూ కలవడమే రాజకీయ ప్రాధాన్యతకు కారణం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ డీఎంకేకు అంత మెజారిటీ వస్తుందని ఊహించలేకపోయింది. కొద్దో గొప్పో సీట్లు తగ్గుతాయనీ, తను పావులు కదపొచ్చనీ ఊహించింది. ఊహలు తలకిందులయ్యేటప్పటకీ, అప్పటికి మౌనం వహించింది. తానెలా చెబితే అలా ఆడాల్సిన పరిస్థితిలో ఉన్న శశికళతో తాజా రాజకీయాన్ని ప్రారంభించింది. రాజకీయాలనుంచి విరమించుకుంటున్నానని ప్రకటించి, ఇప్పుడు రజనీని కలవడం వెనుక ఉద్దేశం అదే అని చెప్పల్సి ఉంటుంది. 2022లో జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ ఏం చేస్తుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్న విశ్లేషకుల మెదడుకు ఇప్పుడు పెద్ద మేతే పెట్టింది. తెలుగు రాష్ల్రాలు కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న జాడలు కనిపిస్తున్నాయి. ఏపీలో ఆర్థిక లోటు, తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశాలు ఆ రాష్ట్రాలను ఇందుకు పురిగొల్పుతున్నాయంటున్నారు. కర్ణాటకలో ఎటూ బీజేపీ ప్రభుత్వమే. 5 రాష్ట్రాలు ఇప్పటికే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని రాష్ట్రాలను నయానో భయానో ఎన్నికలకు ఒప్పించడం బీజేపీకి కష్టంకాబోదు. ఏతావాతా చూస్తే.. జమిలి ఎన్నికలకు బీజేపీ తన క్రీడను స్టార్ట్ చేసినట్లే.