చిత్రం వెనుక కథ ఆసక్తికరం
మే 2 సృష్టికర్త లియోనార్డ్ డా విన్సీ వర్ధంతి
(గణేశ్వరరావు)
మే 2 ప్రముఖ చిత్రకారుడు లీయనార్డో డె వించీ వర్థంతి. కనుక అతని చిత్రం మోనాలిసా గురించి, పాడిన పాటే పాడొచ్చు.
కొన్నిశతాబ్దాల నుంచి ఆమె గమ్మత్తైన చిరు నవ్వు ..కాలాతీతమైన ఆమె ఆకర్షణ గురించి అధ్యయనం జరుగుతూనే వుంది. నిజానికి అందరినీ కలవరపరుస్తున్నది ఆమె చిత్రం కానే కాదు, ఆ చిత్రం వెనుక ఉన్న కథ!
చిత్రకళా రంగాన్ని అది ఒక కుదుపు కుదుపినప్పటికీ , దాని పరిణామం 30 x 21″, బరువు 8 కిలోలే.
మోనా లిసా అంటే అర్థం ‘నా లేడీ లీస ‘ అని. ధనవంతుడైన ఆమె భర్త ఆమె బొమ్మ గీయమని పురమాయించాడు.
మొట్ట మొదటి సారి 1815 లో దీని ప్రదర్శించినప్పుడే, ఆమె నిర్మలమైన కళ్ళని చూసి వీక్షకులు సమ్మోహితులయ్యారు, ఎందరో ఆమె ప్రేమలో ఎందరో పడ్డారు. ఆమె చిత్రం వున్న గది మెట్ల పైన కొందరు పూల గుత్తులు పెట్టేవారు, మరి కొందరు కవితలు రాసి అక్కడ వదిలి వెళ్ళేవారు, ఇంకొందరు ప్రేమ లేఖలను ఉంచేవారు. ప్రదర్శన శాల లో అనేక చిత్రాలున్నా, మోనా లిసా చిత్రానికి అత్యధికంగా ప్రేమ లేఖలు వచ్చేవి. వీళ్ళ బాధ పడలేక నిర్వాహకులు, ప్రత్యేకంగా ఒక పోస్ట్ బాక్స్ ను లీస చిత్రం కోసం కేటాయించారు.
1852లో అయితే లుక్ మాస్పెరో అన్న చిత్రకారుడు తన నాలుగవ అంతస్థు హోటల్ గదిలోనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ‘ఆమె నవ్వుని అర్థం చేసుకోడానికి శతవిధాల ప్రయత్నించి, ఓడిపోయాను, అందుకే ఆత్మ హత్య చేసుకుంటున్నాను’ అని రాసి మరీ పోయాడు. 1910 లో ఆమె చిత్రాన్ని చూస్తూ, తనను తను షూట్ చేసుకోబోయాడు మరొక పిచ్చిప్రేమికుడు!.
ఫ్రాన్స్ నియంత నెపోలియన్ తన పడక గదిలో ఆ చిత్రాన్ని పెట్టుకొని గంటలు గంటలు గడిపేవాడు, ఆ చిత్రం మీద పెంచుకున్న వ్యామోహంతోనే, లీస వారసురాలు, ఇటలీకి చెందిన టరీస ను పెళ్ళాడాడు..
బొమ్మను జాగ్రత్తగా గమనిస్తే, కొన్ని లోపాలు మన దృష్టికి వస్తాయి. మోనా లిసా కు కనుబొమ్మలు ఉన్నాయా? అప్పట్లో అవి లేకుండా ఉంచుకోడం ఒక ఫాషన్ అని కొందరు అన్నారు. పదేళ్ళ క్రితం దీన్ని డిజిటల్ స్కాన్ చేస్తే, వించీ కనుబొమ్మలు, దట్టమైన కను రెప్పలను బోల్డ్ స్ట్రోక్స్ లో చిత్రించాడని, అయితే కాలక్రమాన .. చిత్రాన్ని పదే పదే పునరుద్ధరించే ప్రక్రియలో .. అవి మసకబారాయన్న నిజం బైట పడింది.
ఒక సారి ఈ చిత్రాన్ని దేశ విదేశాలలో ప్రదర్శించాలని అధికారులు అనుకొని, ఆ చిత్రానికున్న అపారమైన విలువ దృష్ట్యా, 100 మిలియన్ల డాలర్ల కి బీమా చేద్దామనుకున్నారు. కాని చెయ్య లేకపోయారు, ఎందుకంటే దాని కోసం కట్టాల్సిన ప్రీమియం కన్నా, దాని భద్రతకయే ఖర్చు తక్కువ కనుక. అంత అమూల్యమైన చిత్రం మరి.
అయినా మోనా లీస ఒక బందీ .. ఆదర్శమైన వాతావరణంలో.. బులెట్ ప్రూఫ్ గ్లాస్ లో.. మానవమాత్రుడు ఎవరూ దొంగిలించడానికి కాని, పాడు చేయడానికి కాని వీలు కాని గదిలో. ఎందుకంటే 195 6 లో ఒక పిచ్చివాడు రాయి విసిరి మోనా లీస భుజానికి ‘గాయం ‘ చేసాడు. అంతకు ముందు మరో వెర్రివాడు ఏసిడ్ పోసి బొమ్మ క్రింద భాగాన్ని పాడు చేసాడు. ఇప్పుడు చిత్రానికి బులెట్ ప్రూఫ్ తొడుగుంది. ఆ మధ్య ఒక రష్యన్ యాత్రికుడు, తనకు ఫ్రాన్స్ పౌరసత్వం దొరక లేదన్న, కోపంతో కాఫీ మగ్గు బొమ్మ పై విసిరి కొట్టాడు, బొమ్మకి ఏం కాలేదు, మగ్గు మాత్రం పగిలింది, మన వాడు కొన్నాళ్ళు జైలు ఊచలు లెక్క పెట్టాడు! అన్నట్టు ఒకే ఒక సారి 19 11 లో ఈ చిత్రం దొంగిలించబడింది. (రెండేళ్ళ తర్వాత దొరికింది.) ఈ లోగా కొన్ని వేల మంది ఖాళీ గోడను చూస్తూ కన్నీరు విడిచారు, పూల గుత్తులతో ఆ ప్రాంతాన్ని నింపారు. పోలీసులు సుప్రసిద్ధ చిత్రకారుడు పికాసో ని అనుమానించారు, ప్రశ్నించారు కూడా. నిజానికి దొంగతనం చేసింది ఒక ఇటలీ జాతీయవాది, ఆ చిత్రాన్ని వేసింది తమ దేశ నివాసి వించీ కనుక, అది ఇటలీలోనే ఉండాలన్న మొండిపట్టుతో. దాన్ని ఇటలీలోని ఒక ఆర్ట్ డీలర్ కి అమ్మబోతూ వాడు పట్టుబడ్డాడు. అయితేనేం, వాడి కోరిక కొంత తీరింది, మోనా లీస కొంత కాలం స్వదేశంలో ఉంది కదా!. ఈ లోగా మార్కీస్ అన్న వాడు మోనా లిసా నకిలీ చిత్రాలు ‘ ఇదీ అసలు చిత్రం ‘ అని కొనే వాళ్ళని నమ్మిస్తూ డబ్బు చేసుకున్నాడు.
మోనా లీస చాలా కాలం పాటు ఫాషన్ ట్రెండ్ సృష్టించింది, ఉన్నత తరగతి స్త్రీలు తమ మొహాలకి లేత పసుపు రంగు పౌడర్ పూసుకునే వారు, మోనా మొహానికున్న బంగారు రంగుకు దీటుగా ఆ పని చేసే వారు, ముఖ కండరాలను బింగించి పట్టి ఆమె మొహంలోని కనీ కనిపించని చిరునవ్వుని అనుకరించేవారు. పారిస్ కాబరే డాన్సర్ లు కొందరు అదే మేక్ అప్ లో కనిపిస్తారు.
మోనా లీస మొహం మీద చిరునవ్వు తాండవిస్తూ వుంటుంది. అది ఒక చోట స్థిరంగా వున్నట్టు కనిపించదు. ఒక హార్వర్డ్ శాస్త్రవేత్త దానికి కారణం మనమే అంటాడు, అంతా మనం చూసే దృష్టి కోణంలో ఉందట! మనం స్పందించే తీరులో ఉందట! అవునా?