(సురేష్ కుమార్ ఎలిశెట్టి, 9948546286)
నిరంతర ప్రేమమూర్తి..
సేవకు ఆయనే స్ఫూర్తి..
నమ్మి కొలిచే వారికి దేవుడు..
అలా చూడలేని వారికి నిజమైన మానవుడు..
దైవం మానుష రూపేణా..
సకల దేవతా రూపాలసద్గుణా..
సాయీ..
నీ రాకతో
ఈ భూమి చరితార్థం..
నీ మార్గ అనుసరణ
మానవ జన్మకు పరమార్థం..
నీ వాక్కు..నీ దృక్కు..
మార్చును బ్రతుకు..
నీ పదం..నీ పాదం..నీ పథం..
చేర్చును మము పరమపదం..
నీ బోధ తీర్చును బాధ..
యుగానికో అవతారం
ఒక్కో యుగంలో భగవంతుని ఒక్కో అవతారం..
అలా కొనసాగేను దేవుని ఉనికి ఈ భువిపై నిరంతరం..
మరి ఈ యుగాన ఎక్కడ
ఆ రూపం..
ఈ ప్రశ్నకు షిర్డీ
ఒక జవాబు..
ఆ మహనీయుని దివ్యసమాధి
అనంతరం ఆధ్యాత్మిక జగతికి
నువ్వేగా నవాబు..
వైద్యో నారాయణో హరీ
నీ సేవ ఓ త్రోవ..
ఆ క్షణానికి
వైద్యో నారాయణో హరి..
మరుక్షణాన రోగం మటుమాయం చేసే
ధన్వంతరి..
నీ పేరిట సాగే విద్యాయజ్ఞం
అనితరసాధ్యం..
సరస్వతికి నువ్వు సమర్పించిన నైవేద్యం..నీకు మాత్రమే చెందే అనుభవేకవేద్యం..
ప్రతి విద్యాలయం ఓ దేవాలయం..
చదువుల తల్లి నిజ ఆలయం
అసలు నువ్వే ఈ జగమున నడిచిన విశ్వవిద్యాలయం..
సీమ దాహం తీర్చిన జలయజ్జం
నీ పనుపున సాగిన జలయజ్ఞం
తీర్చింది సీమ దాహం..
మానవులకు సాధ్యపడని
ఆ మహత్కార్యం
పటాపంచలు చేసింది
నువ్వు దేవుడివి
కావనే సందేహం..
అలా విశ్వమే అయింది
నీకు దాసోహం…
పరమాత్మకు విలాసం
నీ లీలలు..అవలీలలు..
కొందరు కాదన్నా..
నువ్వు దేవుడివే కావన్నా
ఆగేవాడివా నువ్వేమన్నా..
నీ గమనంలో నాదం..
నీ స్వరంలో వేదం..
నీ నవ్వులో చిద్విలాసం..
నీ ప్రశాంతనిలయం
పరమాత్మకు విలాసం..
నీ నవ్వు మాతోనే…
నువ్వు లేకున్నా..
నీ నవ్వు మాతోనే..
నీ రూపు మాలోనే..
చిత్రంగా కదిలే నీ చేయి
చూపును మాకు త్రోవ..
పుట్టపర్తిలోని నీ సమాధి
వేయి యుగాలకైనా
ఆధ్యాత్మికతకు పునాది..
వస్తావు..నువ్వు లేచి వస్తావు…
అప్పుడే ఈ విశ్వమున
మరో దివ్య యుగానికి ఆది..
అదే నీ భక్తులకు పరమావధి..!
(సాయి జయంతి సందర్భంగా భక్తితో)