విశ్వగురుకు 82 ఏళ్ళు
సైంటిఫిక్ గురు సందేశాలు ఆచరణీయమన్న వక్తలు
పేదలకు వస్త్రదానం చేసిన నిర్వాహకులు
విశ్వస్ఫూర్తి కుటుంబ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్, మే 1: సైంటిఫిక్ సెయింట్, విశ్వగురు శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి 82వ జన్మదినాన్ని స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించింది. అమీర్ పేటలోని కమ్మ సంఘం ఫంక్షన్ హాల్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. వేలాదిగా స్ఫూర్తి కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ డా. కసిరెడ్డి వెంకట్ రెడ్డి, అతిధులుగా ఓలేటి పార్వతీశం, శ్రీమతి డా. పురాణపండ వైజయంతి, డా. గంగిశెట్టి లక్ష్మి నారాయణ ఇందులో పాల్గొన్నారు.
సందేశాన్ని చదివిన ఓలేటి
శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి అనుగ్రహించిన దివ్య సందేశాన్ని ఓలేటి పార్వతీశం చదివి వినిపించారు. శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య సందేశంలో ప్రకృతిలో జన్మదినాన్ని జరుపుకునేది ఒక మనిషి మాత్రమేననీ, ఆ స్థాయి, మేధస్సు కలిగినది మనిషికి మాత్రమేనని తెలిపారు. ప్రతి మనిషి తన ఆయుష్షు తెలియక పోయినా గత సమయాన్ని, సంవత్సరాన్ని విశ్లేషించుకుని తన లోని లోపాన్ని గుర్తించి మారే దిశగా ప్రయత్నిస్తే మనిషి మనీషిగా మారే శక్తి సామర్థ్యాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి అని అప్పుడే జ్ఞాన జీవిగా జన్మ సాఫల్యతను సాగించవచ్చు నని తెలియజేసారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరు ఈ విశ్లేషణలో తనను తానుగా మార్చుకునే దిశగా ప్రయత్నించినప్పుడే సమాజం మారుతుంది అని అది నేటి అత్యవసర స్థితి అని తెలియజేశారు. ఎవరికైనా తన పుట్టిన రోజే ఉగాదిగా కావాలన్నారు.
విశ్వవ్యాప్తంగా విశ్వస్ఫూర్తి జన్మదిన వేడుకలు
శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి జన్మదిన కార్యక్రమాలు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని వివిధ పట్టణాలలోని కాకుండా అమెరికాలోని అట్లాంటా, కాలిఫోర్నియాలలో నిర్వహించినట్లు ట్రస్ట్ సభ్యులు తెలియజేసారు. ఈ సందర్బంగా వివిధ పట్టణాలలో తెలంగాణ లోని అనేక సామజిక కార్యక్రమాలు చేపట్టినట్టు తెలియజేసారు. అమీర్ పేట లో సుమారు 2500 మందికి మజ్జిగ పంపిణి కార్యక్రమం అలాగే పేదవారికి ఉచిత వస్త్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు ఇప్పటి జనరేషన్ కు శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి విరచిత గ్రంథాలు జీవితానికి దిక్సూచులవంటివి అని స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ సభ్యులు క్రమశిక్షణతో, వాలంటీర్స్ సమాజ కృషికి చేస్తున్న సేవలను, కార్యక్రమాలను కొనియాడారు. భవిష్యత్ సమాజానికి స్ఫూర్తి కుటుంబం ఒక నావికుడు బాధ్యతను స్వీకరించాలని అభినందనలు తెలియజేసారు. ఈ సందర్బంగా స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ సభ్యత్వ కార్యక్రమాన్ని ఆరంభించారు.