ఆలోచింపచేసిన డాక్టర్ లక్ష్మి ప్రసంగం
హైదరాబాద్, జనవరి 04 : రామ్ దేవ్ రావు హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ కమలాకర్ ప్రసంగానికి ప్రేక్షకులు సెల్యూట్ చేశారు. తన చదువు నుంచి ఉద్యోగం… ఆ తరవాత అంశంపై ఆయన చేసిన ప్రసంగం స్ఫూర్తిమంతంగా సాగింది. ఉద్యోగ బాధ్యతలను నిర్వహించడంలో రాజీ పడని తత్త్వం, కేటాయించిన విధులను పొల్లుపోకుండా నిర్వహించడం… చేతనైనంత సాయపడడం… ఈ మూడు అంశాలూ ఆయన ప్రసంగంలో ఉన్నాయి. నాస్తికునిగా మారిన తనను కొన్ని ఘటనలు దేవుడున్నాడని నమ్మేలా చేశాయని డాక్టర్ కమలాకర్ చెప్పారు.

రాజౌరి-పూంచ్ సెక్టర్లో ఒక సైనికుడికి కడుపునొప్పి వచ్చినప్పుడు, తనకు ఎదురైన సంకట స్థితినీ, దానిని అధిగమించిన తీరునూ వివరించినప్పుడు ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేశారు.

ఆర్మీ డాక్టరుగా చేరమని చెప్పిన సలహాను పెడచెవిన పెట్టినప్పటికీ, చివరకు తాను ఆర్మీలో చేరాల్సి వచ్చిందని చెప్పారు డాక్టర్ కమలాకర్.
మేనేజింగ్ అవర్ మైండ్ (మనసును అదుపు చేసుకోవడం) ఎలా అనే అంశంపై అమీన్ పూర్ లోని అపర్ణ లేక్ బ్రీజ్ గేటెడ్ కమ్యూనిటీలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ కమలాకర్ మాట్లాడారు. అరుదైన ఫోటోలను కూర్చి రూపొందించిన వీడియోను ప్రదర్శిస్తూ ప్రసంగాన్ని కొనసాగించారు. ఆయన ప్రసంగంలో సత్య సాయి హాస్పిటల్ సందర్శనతో పాటు, మెడిటేషన్ అంశంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారి తదితర సంస్థలను ప్రస్తావించారు.

అక్కడ ఎదురైనా అనుభవాలను తెలియజేశారు. పఠాన్ కోట్ లో ఉన్న సమయంలో తన భార్య శ్రీమతి లక్ష్మి బ్రహ్మకుమారి కార్యక్రమాలకు హాజరవుతానంటే తాను తీసుకుని వెళ్ళేవాడిననీ, ఒకరోజు నిర్వాహకులు తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించారని చెప్పారు. ఆ సమయంలో తమ మధ్య సాగిన సంభాషణ తన వైఖరిని మార్చిందన్నారు డాక్టర్ కమలాకర్. మంత్ర పఠనం అనే అభ్యాసం మనలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని చెప్పారు.

అనంతరం, డాక్టర్ కమలాకర్ భార్య శ్రీమతి లక్ష్మి మెడిటేషన్ గురించి ప్రసంగించారు. రేకి గ్రాండ్ మాస్టర్ కూడా అయిన ఆమె ఒక యూనివర్సిటీ నుంచి మూడు పీజీలు చేసిన ఏకైక మహిళ. మనసుకు-గుండెకు అవినాభావ సంబంధం ఉందని ఆమె చెప్పారు. మనసుకు నచ్చిన అంశాన్ని – హృదయానికి కలిగే భావననూ బేరీజు వేసుకుంటే ఎవరైనా సవ్యమైన దిశలో ప్రయాణం చేయగలుగుతారని ఆమె చెప్పారు. రేకి గ్రాండ్ మాస్టర్ గా తన అనుభవాలను వివరించారు. అనంతరం ఆమె, కొద్దిసేపు ప్రేక్షకులతో మెడిటేషన్ చేయించారు.

ఎయిర్ ఫోర్స్ లో పదవీ విరమణ చేసిన ఒక ఉద్యోగి డాక్టర్ కమలాకర్ ఉద్యోగ అనుభవాలను వివరించిన తీరును ప్రశంసించారు. వేదికపై ఆయనకు సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇస్రో మాజీ శాస్త్రవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత గాంధీ హాజరయ్యారు.

డాక్టర్ లక్ష్మి రచించిన రిలేషన్ షిప్స్- ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్ పుస్తకాన్ని, ఒక మొక్కను ప్రేక్షకులకు బహుకరించారు.
శ్రీమతి క్రాంతి లక్ష్మి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
(డాక్టర్ కమలాకర్, డాక్టర్ లక్ష్మి పూర్తి ప్రసంగం త్వరలో వీడియో రూపంలో అందిస్తాము)

