ప్రభువు మనసెరిగి ప్రవర్తించకుంటే…

Date:

ఉద్యోగుల పాలిట శాపం
బ్లాక్ లిస్టులోకి నా పేరు
ఈనాడు-నేను: 19
(సుబ్రహ్మణ్యం వి. ఎస్. కూచిమంచి)

రాజమండ్రికి ఆఫీసు మారిన కొత్తలో సంగతిది. ఉదయం 10గంటలకి ఆఫీసుకు వచ్చేవాళ్ళం.. తిరిగి వెళ్ళేది రాత్రి ఒంటి గంట తరవాతే. ఇంకా ఫ్యామిలీ తీసుకురాలేదు. కారణం.. 1992 మే 25న అబ్బాయి పుట్టడం… నవంబరులో రాజమండ్రికి మార్పు. ఈ కారణంగా కొన్నాళ్ళు నేను మా నాన్నగారి వద్ద ఉన్నాను. పేపర్‌ మిల్ దగ్గర ఇల్లు. ఆఫీసులో క్యాంటిన్‌ లేదు. దగ్గరలో టీ చుక్క కూడా దొరకదు. ఏమైనా టిఫిన్‌ చేయాలన్నా నాలుగు కి.మీ. దూరంలో ఉన్న రైల్వే స్టేషన్‌కు వెళ్ళాల్సి వచ్చేది. పొద్దున్నే తిని రావడం.. మధ్యాహ్నానికి ఏదో కొంచెం టిఫిన్‌ తెచ్చుకోవడం… రాత్రి వీలుచూసుకుని ఒక్కొక్కరూ వెళ్ళి తిని వచ్చేసే వాళ్ళం. ఇంతవరకూ బాగానే నడిచింది.

మా డెస్క్‌కు శర్మ గారు ఇన్చార్జి, పార్థసారథి, నేను, ఒమ్మి రమేష్‌బాబు(కంజిర రమేష్‌), వివిఎస్‌ ప్రసాద్‌ ప్రాతినిధ్యం వహించేవారం. కొన్నాళ్ళకి వల్లూరి శివరామకృష్ణ, మాదాల సుబ్బారావు మాతో చేరారు. పదిహేను రోజులకే అనుకంటా… అనుకోని ఘటన..

ఆరోజు రాత్రి ఎనిమిదిన్నర గంటలైంది. ఆకలి దంచేస్తోంది. ఏదో ఒకటి తిని రాకపోతే నిలబడడం కూడా కష్టమనే పరిస్థితి వచ్చేసింది. నేను, మరొకరితో కలిసి, ఎవరిదో బండి తీసుకుని డెస్క్‌ ఇన్చార్జికి చెప్పి బయటకు వెళ్ళబోతుండగా ఫోన్‌ వచ్చింది. దాన్ని చూడమని రమేష్‌కు చెప్పి మేం వెళ్ళొచ్చాం. వచ్చేసరికి పరిస్థితి చాలా గంభీరంగా ఉంది. ఎడిషన్‌ ప్రారంభమైన తొలినాళ్ళే కాబట్టి మా ఎమ్‌.డి. రమేష్‌ బాబుకూడా ఆఫీసులోనే ఉన్నారు. మా డెస్కులో కూర్చుని ఉన్నారు.

చూస్తూనే కోపంగా అడిగారు..
ఎక్కడికెళ్ళారు…
భోజనానికి వెళ్ళామండి.. చెప్పే వెళ్ళామన్నాం..
పరిస్థితి గమనించుకోకుండా వెళ్ళిపోతారా… మరో ప్రశ్న
నాకు అర్థం కాలేదు… విషయం ఏమిటో తెలియడం లేదు.. ఏదో లేకపోతే ఆయనలా అరవడనుకుని..
రమేష్‌ రాస్తున్న ఐటమ్‌ని చూశా…
కోనసీమలో పడవ మునక… 12మంది గల్లంతు..
ఇదీ వార్త…
ఓహో అర్థమైంది.. అందుకేనా అనుకున్నా…
వెంటనే ఆ వార్తను నేను అందుకుని గబగబా పూర్తిచేశా.. ఎలాగూ అది మెయిన్‌ పేజీలో పెట్టే వార్తే..
మెయిన్‌కు ఇంకా టైముంది..
ఎందుకంటే ముందు మినీ ప్రచురిస్తారు.. తరవాత మెయిన్‌ రెండింటికీ మధ్య కనీసం గంటన్నర వ్యత్యాసం ఉంటుంది.
ఇన్చార్జి దాన్ని చూసి ఓకే. … చేసేశారు…
ఎమ్‌.డి. దీనికెందుకు కోపగించుకున్నాడని విచారిస్తే తేలిందేమిటంటే…
ఆయనకు ఒక ఉద్యోగి అంటే.. సదభిప్రాయం లేదు..
అతనితో నేను వెళ్ళడం కూడా కిట్టలేదు..

అప్పటినుంచి నన్ను ఆయన తన బ్లాక్‌ లిస్టులో పెట్టేసుకున్నాడు..
సంస్థలో ఎన్నో మంచి లక్షణాలున్నాయి..కానీ… తమ పై అధికారులు ఎవరిపైనైతే ఎక్కువ ఆగ్రహం వెళ్ళగక్కుతుంటారో..
ఆ వ్యక్తి వైపు కన్నెత్తి చూడరు సహచరులు… అదో తీరు అక్కడ..
నాకివేమీ పట్టవు…మనం చేస్తున్న పని చూడాలి కానీ.. నేనెవరితో మాట్లాడాను.. బయటికెడితే ఏంచేస్తున్నాను అనేవి ఎవరికైనా అనవసరమనేది నా నిశ్చితాభిప్రాయం.. మొదటి రోజు నుంచి ఆ మహా సంస్థ నుంచి నిష్క్రమించే వరకూ నాది ఇదే తీరు..
పని విషయంలో ఏమాత్రం లోటు చేయలేదనే నేను అనుకుంటున్నాను…కాదు అనుకున్నాను… ఒళ్ళు దాచుకోకుండా పనిచేశాను. అందరితో పాటు..కొందరిలా చాడీలూ, పితూరీలు చెప్పలేదు నా స్వలాభం కోసం.. పనే దైవమనుకున్నాను.

రామోజీరావుగారు ఎప్పుడూ చెప్పే మాట ఒకటుంది..
పాఠకులే దేవుళ్ళు…
చూడండి ఎంత అర్థముందో అందులో…

పాఠకులే లేకపోతే.. పేపరు ఎక్కడిది.. ఎవరు కొంటారు..
అలా కొన్నవారిని బట్టే కదా ప్రకటనలు వచ్చేవి…
మనం రాసిన వార్తల్ని బట్టే కదా… పేపరుకు పేరు వచ్చేది..
స్కైల్యాబ్‌ పతనం సంఘటనైనా… మొన్నటి నేపాల్‌ భూకంపం ఘటనైనా…
ఇరాక్‌ యుద్ధమైనా… కలతలతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినా…
సంస్థలో సంపాదక బృందం పని వాటిని చక్కగా తీర్చి దిద్దడమే…
ఆపై తప్పొప్పుల్ని బేరీజు వేసుకుని మళ్ళీ జరగకుండా చూసుకోవడమే…
అలా చేశారు కాబట్టే…. కొందరు సైంధవులు ఉన్నా.. సంస్థ అప్రతిహతంగా ఎదుగుతూ వచ్చింది…

బాగా సీరియస్‌ అయిపోయింది కదూ…. అందుకే…
ఓ చిన్న చెణుకు…
మా మావగారు ఉషశ్రీ గారిది… ఇది నిజంగా జరిగింది..
రేడియో ధర్మసందేహాలలో ఆయన భారత ప్రవచనం తియ్యగా సాగిపోతోంది..
ఓ ఆదివారంనాడు… ప్రవచనం ముగించి బయటకొచ్చిన ఉషశ్రీ గారికి స్టేషన్‌ డైరెక్టర్‌ ఎదురుపడ్డారు..
ఏమండి ఉషశ్రీ గారు… ఇంకా ఎంతకాలం సాగుతుంది… భారతం…అని ప్రశ్నించారు..
దీనికి ఉషశ్రీ గారు నవ్వుతూ… ఆ ఇంకెంతండి అయిపోతుంది…
అభిమన్యుడికి సైంధవుడు అడ్డొచ్చాడు కదా మహా అయితే ఓ పదిరోజులు అంటూ వెళ్ళారుట…
ఆహా అలాగా…సరే…సరేనంటూ డైరెక్టర్‌గారు తన రూమ్‌లోకి వెళ్ళిపోయారు…
ఆరోజున ఉషశ్రీ గారు… పద్మవ్యూహంలో అభిమన్యుణ్ణి అడ్డుకున్న ఘట్టాన్ని చెప్పి బయటకు వచ్చారు…
అంటే ఆయన లోపాయకారీగా మీరే ఆ సైంధవుడని చెప్పారు డైరెక్టర్‌కు… పాపం అది ఆయనకు అర్థంకాలేదు..

భోజనానికి ఒక ఉద్యోగితో నేను వెళ్ళడం ఆయనకు నచ్చడం లేదని తెలిసి ఆలోచనలో పడ్డాను. అప్పటికే అందరూ అతనికి దూరంగా వ్యవహరిస్తుండడం గమనించాను కానీ… విషయం ఇదని ఊహించలేదు. ఊరుకాని ఊరొచ్చాడు.. నాతో రమ్మని మా ఇంట్లోనే ఉండొచ్చనీ నేనే ఆహ్వానించాను…. ఇప్పుడొద్దని ఎలా చెప్పను…
నా మనస్సాక్షి అంగీకరించలేదు..
అలాగే నా స్నేహాన్ని కొనసాగించాను… ఇప్పటికీ కొనసాగిస్తున్నాను…
కానీ.. నేను తప్పు చేసినప్పుడల్లా ఇలాగే మొట్టికాయలు పడుతుండేవి…

ఈ ప్రమాదం జరిగిన మూడో రోజునే నాకు ఆ జ్ఞాపికను బహుకరించింది రామోజీరావుగారు…

కొన్నాళ్ళకు జోన్‌ పేజీలు ప్రారంభమయ్యాయి.. ఈనాడు మినీలో…
కాకినాడ.. రాజమండ్రి…. రెండు పేజీలు అదనం.. వాటి బాధ్యతను నాకు అప్పగించారు.. ఇన్చార్జి శర్మగారు..
ప్రతి రోజు ఆయా పేజీలకు స్థానికంగా ఉండే అంశాలతో ప్రత్యేక కథనాలను తెప్పించడం, మంచి లేఅవుట్‌తో మేకప్‌ చేయించడం, కొత్తకొత్త శీర్షికలు.. ఆసక్తికరమైన ఫొటోలు వాటికి వ్యాఖ్యలు రాయడం.. హ్యూమన్‌ ఇంటరెస్ట్‌ స్టోరీలు రప్పించడం.. ఇవన్నీ స్థానికంగా జరగాలి.. రాజమండ్రి పట్టణ పరిధిలోని వార్తలే ఆ పేజీలలో ప్రచురితమవ్వాలి… నిజంగా అదో సవాలే.. వార్తల ఎంపిక… వాటిని ఎక్కడ వాడాలి… ఏ కోణంలో ఫొటో తీయించాలి… శీర్షిక డిజైన్‌ ఎలా పెట్టాలి… ఎన్నో ఆలోచనలు… సృజనాత్మకతకు చోటుండేది. ఒక్క పేజీలోనే ఎన్నో ప్రయోగాలు…
ఈ పేజీలు ప్రారంభమైందీ రాజమండ్రి యూనిట్లోనే… ప్రతి సమావేశంలో ఆ పేజీల నిర్వాహకుడిగా రామోజీరావుగారి ప్రశంసలందుకునే వాణ్ణి… ఇవి అందరికీ చెందుతాయి… ఎందుకంటే.. అందరూ రకరకాల సూచనలు చేసేవారు… వాటిని అమలు చేసే వాణ్ణి…

ఫొటోగ్రాఫర్లు చారి, వెంకటేశ్వరరావు… ఫొటోల విషయంలో ఎంతో చురుగ్గా ఉండేవారు… బయట తిరుగుతున్నా… మన పేజీకి ఎటువంటి దృశ్యమైనా చిక్కుతుందేమోననే కోణంలోనే చూసేవాడిని.. వార్తవుతుందా అనే ఆసక్తితోనే గమనించేవాడిని..
ఇప్పుడు చెప్పుకుంటే… చిన్నతనంగా ఉంటుంది కానీ… ఇరవైఅయిదేళ్ళ కిందట ఇదే గొప్ప ఫొటో…అదే గొప్ప ఫొటో వ్యాఖ్య…
అదేమిటంటే.. ఓసారి నేను ఆఫీసుకు వస్తుండగా గమనించాను..
సీతమ్మ చెరువునుంచి జమీందారు మెట్ట దిగి వీరభద్రపురంలో వస్తుంటే కనిపించిందది..
చెట్టుపైనా చిటారుకొమ్మన ‘పన్ను వసూళ్ళ కేంద్రం’ బోర్డు కనిపించింది.
వెంటనే చారికి చెప్పాను..
అతను ఫొటో తీసుకొచ్చాడు..
ఏముంది ఇందులో అంటూ సణుక్కుంటూ ఇచ్చాడు..
అందరూ బాగుందన్నారు….
చెట్టెక్కిన పన్ను వసూళ్ళ కేంద్రం
అనే వ్యాఖ్యతో…
చిన్న కామెంట్‌ రాసి ప్రచురించాను..
మరుసటి రోజు ఆ చిత్రాన్ని మార్క్‌ చేసి,
రామోజీరావు గారు…..
గుడ్‌
అనే కామెంట్‌ రాశారు…


అలా కామెంట్‌ వచ్చిందంటే ఆ ఉద్యోగికి పండగే…
వీటి వెనుక చాలా కథ ఉంది…
ఆయన పెట్టే గుడ్‌ కామెంట్స్‌ గురించీ, నెగటివ్‌ కామెంట్స్‌ గురించి… వాటి పర్యవసానాల గురించి..
రేపు చెబుతా….

రామోజీ ఆగ్రహించిన వేళ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆరోజు డి.ఎన్. ప్రసాద్ ఏం చేశారంటే…?

ఎవరూ లేకున్నా ప్రత్యేక సంచికదీని వెనుక డి.ఎన్. ప్రసాద్ కృషిబాలయోగి మరణించి...

A Premier Rural Development Institute of India

National Institute of Rural Development and Panchayati Raj (NIRD&PR)...

Science for the common man

(Dr. N. Khaleel) Four years ago, Corona shook the world....

Watch CHAVA in a Theatre

(Dr Kamalakar Karamcheti) The Hero is captured by the villain...