ఇలా కాస్త ఆలోచించి చూడండి!

0
152

ప్రధాన న్యాయమూర్తిపై దాడి లేవనెత్తుతున్న ప్రశ్నలు

(కల్లూరి భాస్కరం)
భారత ప్రధాన న్యాయమూర్తి బి. ఆర్. గవాయ్ విష్ణుమూర్తిపై చేసిన వ్యాఖ్య, దానికి ప్రతిస్పందనగా న్యాయస్థానంలోనే ఆయనపై బూటుతో దాడి చేయబోవడం- ఈ రెండు ఘటనలను ఎలా చూడాలన్నది ఓ చిక్కుప్రశ్నగా మారినట్టు అనిపిస్తోంది. ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా ఎదురవుతూ ఉంటాయి.
రెండింటినీ కలిపి, తాసులో వేసి, సమానంగా తూచాలా; లేక విడివిడిగానూ, తరతమ భేదాలతోనూ చూడాలా?!

నాకైతే న్యాయమూర్తిపై బూటుతో దాడి చేయబోవడమే ఆక్షేపణీయంగానూ, అత్యంతప్రమాదకరఘటనగానూ కనిపించింది, దానిపైనే స్పందించాను. అప్పుడు నేను కేవలం న్యాయాన్ని, న్యాయవ్యవస్థ ప్రతిపత్తిని మాత్రమే దృష్టిలో పెట్టుకున్నాను. న్యాయమూ, న్యాయవ్యవస్థా అనేవి రాజకీయపాక్షికతలు, మతవిశ్వాసాలు, భావజాలాల తేడాలకు అతీతంగా యావత్ప్రజల మనుగడతో, యోగక్షేమాలతో, శాంతిభద్రతలతో కూడిన జీవనంతో నేరుగా ముడిపడినవి. ఏ వైపునుంచి తమకు అన్యాయం జరిగినా న్యాయం చేస్తాయన్న భరోసాను ఇచ్చేవి, ఇవ్వవలసినవీ. అవి రాజ్యం కన్నా కూడా ఉన్నతమైనవి, రాజ్యంలో న్యాయం లోపించినప్పుడు దానిని శాసించి న్యాయం జరిపించవలసినవి.

అటువంటి న్యాయంపైనా, న్యాయవ్యవస్థపైనా దాడి జరిగినప్పుడు, కేవలం ఆ ఒక్కదానినే ఎత్తిచూపుతూ నిర్ద్వంద్వంగా ఖండించకపోతే, అది అలాంటి మరికొన్ని ఘటనలకు దారి తీస్తే, అంతిమంగా న్యాయానికీ, న్యాయవ్యవస్థకీ ఉన్న ప్రతిపత్తి పలుచనైపోతే, న్యాయవ్యవస్థను కూడా రోజువారీ రాజకీయవివాదాల స్థాయికి తీసుకొస్తే వాటితో నేరుగా ముడిపడిన ప్రజల అస్తిత్వం ఎంత అల్లకల్లోలిత మవుతుంది, వాటిపై వాళ్ళు పెట్టుకున్న నమ్మకం ఏమైపోతుంది, శాంతిభద్రతలు ఏమైపోతాయనేవి ఇక్కడ వేసుకోవలసిన ప్రశ్నలవుతాయి. ఆ విధంగా ఈ దాడి కేవలం న్యాయమూర్తిపైనా, తద్వారా న్యాయవ్యవస్థపైనా దాడి మాత్రమే కాబోదు; న్యాయవ్యవస్థతో ముడిపడిన ప్రజల అస్తిత్వంపైనా, భరోసాపైనా దాడి అవుతుంది.

ప్రస్తుత ఘటనలో దానికి మూలకారణమైన న్యాయమూర్తి వ్యాఖ్యతో దానిని కలిపి బేరీజు వేసినప్పుడు, ఆ మేరకు దాని తీవ్రత పలుచనవుతుంది. అది న్యాయవ్యవస్థతో ముడిపడిన ప్రయోజనాలకు సంబంధించిన దృష్టికోణాన్ని పలచన చేయడమే అవుతుంది.

ఇప్పుడు జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్య విషయానికి వద్దాం. ప్రజల మనోభావాలను గాయపరచే అవకాశమున్న అలాంటి వ్యాఖ్య ఆయన చేసి ఉండకూడదు. దానిపై అభ్యంతరం వ్యక్తం చేయడం తప్పు కాదు. అయితే అది ఏ రూపంలో జరగాలనేది ప్రశ్న. అందుకు శాంతియుతమార్గాలు అనేకం ఉన్నాయి. న్యాయమూర్తుల విషయమలా ఉంచి అధికారంలో ఉన్నవాళ్ళు, రాజకీయనాయకులు, ఇతర రంగాలవారు- ఎవరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా శాంతియుత మార్గంలోనే వ్యతిరేకత తెలపడం మనం అనుసరిస్తున్న ప్రజాస్వామిక రాజ్యాంగ విహితమైన విధివిధానం. హింసాత్మక వైఖరులకు అసలు చోటే లేదు. బూటుతో దాడి చేయడం హింసాత్మకవైఖరే అవుతుంది. దానిని బేషరతుగా ఖండించకపోతే, ఖండించడంలో ఏమైనా శషభిషలకు లోనైతే, అది మరిన్ని హింసారూపాలకు తలుపులు తెరవడమే అవుతుంది. అదీ, ఇందులో ఉన్న ప్రమాదం.

మనోభావాలు గాయపడడం విషయానికి వద్దాం. బూటుతో దాడి చేయబోవడాన్నీ, న్యాయమూర్తి వ్యాఖ్యనూ కలిపి చూసి తప్పు పట్టిన మిత్రులు కానీ, కేవలం న్యాయమూర్తి వ్యాఖ్యనే తప్పుపడుతూ, పరోక్షంగా బూటు దాడిని సమర్థిస్తున్నట్టు వ్యాఖ్యానించినవారు, వ్యాఖ్యానిస్తున్నవారు కానీ ఉమ్మడిగా ఒక వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోవడం లేదు. అదేమిటంటే, భారతీయ సమాజంలో కేవలం ఒక్క అధికసంఖ్యాక మతస్థులు మాత్రమే లేరు, అల్పసంఖ్యాకులైన అన్యమతాలవారు కూడా ఉన్నారు; అలాగే, అధికసంఖ్యాక మతస్థుల్లో కూడా ఆస్తికులు మాత్రమే లేరు, అజ్ఞేయవాదులు(దేవుడు ఉన్నా, లేకున్నా మాకనవసరమని భావించేవారు), నాస్తికులు, హేతువాదులు కూడా ఉన్నారు. అధికసంఖ్యాక మతస్థులలో కూడా మతవిశ్వాసాలను, ఆస్తికత్వాన్ని వ్యక్తిగతానికి పరిమితం చేసుకోవాలనీ, రాజకీయ, పరిపాలనాక్షేత్రంలోకి వాటిని తీసుకురాకూడదని భావించేవారు ఉన్నారు. ఆవిధంగా వాళ్ళ మనోభావాలు వాళ్ళకీ ఉంటాయి, ఉన్నాయి.
ఇంకొకటి కూడా గమనించాలి. రాజకీయక్షేత్రంలో ఎన్నికల గణాంకాలనూ, చట్టసభల్లో ఆయా పక్షాల స్థానాలూ వగైరాలను దృష్టిలో పెట్టుకుని చూసినా వీరందరి సంఖ్యా, ప్రస్తుతం అధికారంలో ఉన్నవారిని ఎన్నుకున్న వోటర్ల సంఖ్యకూ, ఆ మేరకు చట్టసభలలో అధికారపక్షసభ్యుల సంఖ్యకూ మరీ అంత దూరంలో ఏమీ ఉండదు. తేడా రెండు, మూడు శాతమే ఉండవచ్చు కూడా.

అయినాసరే, ప్రభుత్వాల ప్రాధాన్యాలు కానీ, వ్యవహారశైలి కానీ ఆ సంగతిని దృష్టిలో పెట్టుకుంటున్నాయా? వాళ్ళ మనోభావాలను పట్టించుకుంటున్నట్టు ఉన్నాయా? ఉన్నాయని ఎవరైనా చెప్పగలరా? వాళ్ళ మనోభావాలను ఖాతరు చేయకపోవడానికి కారణం, కేవలం అధికారం వాళ్ళ చేతుల్లో ఉండడం ఒక్కటే కాదా? మన ప్రజాస్వామిక రాజ్యాంగ వ్యవస్థ అధిక సంఖ్యాకులు-అల్పసంఖ్యాకులు; అధికారం చేతుల్లో ఉండడం, లేకపోవడం అనే ప్రాతిపదికల మీద పనిచేసేదా? ఇక్కడి పౌరులందరికీ సమానహక్కులుంటాయన్న ప్రాతిపదిక మీద పనిచేసేది కాదా?

బూటుతో దాడి చేయబోవడమైనా, దానిని సమర్థిస్తూ న్యాయవ్యవస్థకు గురిపెడుతూ సోషల్ మీడియాలో వెల్లువెత్తే వ్యాఖ్యలైనా, ఇంకా అలాంటి ఎన్నో ధోరణులైనా కేవలం అధికారపు అండ చూసుకుని మాత్రమే. అధికారపు అండలేని వారి మనోభావాలు గడ్డిపరకలు, వాటిని పట్టించుకోనవసరం లేదు! ఇదీ జరుగుతున్నది. ఘనతవహించిన ఇంతటి ప్రజాస్వామిక రాజ్యాంగవ్యవస్థ పనితీరుకు అధికారపు అండ ఉండడం లేకపోవడం ఒక్కటే గీటురాయి అయిందన్నమాట!
న్యాయమూర్తి వ్యాఖ్యనూ, ఆయనపై బూటుతో దాడి చేయబోవడాన్నీ కలిపి చూసి తప్పు పట్టే మిత్రులకు, దయచేసి ఇలా కూడా కాస్త ఆలోచించి చూడండని చెప్పడమే నా ఉద్దేశం.


(వ్యాస రచయిత ప్రముఖ పాత్రికేయుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here