సాదా వేషధారణ…మధ్యలో భారత ప్రస్తావన
నిర్మలమ్మ బడ్జెట్ స్పీచ్ సాగిన తీరు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: స్వల్ప అనారోగ్యంగా ఉన్నప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చకచకా చదివారు. మధ్యలో ఆగుతూ నీటిని తాగుతూ, ఇబ్బంది పెడుతున్న జలుబును పక్కన పెట్టి తన సంప్రదాయాన్ని పూర్తిచేశారు. బడ్జెట్ ప్రసంగం చేస్తున్న సమయంలో మొత్తం పదిసార్లు ఆమె నీటిని తాగారు.
ముదురు కుంకుమ రంగు జాకెట్, మస్టర్డ్ మెరూన్ కలర్ బోర్డర్ చీరలో చాలా సాదాసీదా వేషధారణలో లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండోసారి పేపర్ లెస్ బడ్జెట్ చదివారు. స్వచ్చమైన ఉచ్చారణతో చాలా సూటిగా బడ్జెట్ పాఠం చదివారు. మూడు సింహాల గుర్తు ఉన్న ఎర్రటి బ్యాగులో తెచ్చిన లాప్‌టాప్ తెరచి, డిజిటల్ బడ్జెట్ చదివారు నిర్మలా సీతారామన్. గంటన్నర పాటు బడ్జెట్ ప్రసంగం సాగింది. లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన రెండవ మహిళ నిర్మలా సీతారామన్. అంతకుముందు 1969లో శ్రీమతి ఇందిరాగాంధీ ఆర్థికమంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఏ ప్రభుత్వమైనా ముందుగా వారు చేసిన సంక్షేమాలనే ప్రస్తావిస్తుంది. ఈ బడ్జెట్‌లోనూ అంతే. మోడీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. అంతేకాదు… చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించే ముఖ్యంగా ప్రస్తావించారు.
మాననీయ అధ్యక్ష్‌జీ అంటూ… ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధానంగా నాలుగు అంశాల ఆధారంగా రూపొందించినట్లు ఆమె తెలిపారు. భారతంలోని శాంతిపర్వంలో యోగక్షేమం అనే అర్థం వచ్చే శ్లోకాన్ని ఉటంకించారు.
అభివృద్దిపైనే ప్రధానంగా ఆమె బడ్జెట్ కేంద్రీకృతమైంది. ఉచితాల ప్రస్తావన లేకుండా సాగింది. ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేసే దిశలో బడ్జెట్ ఉంది. ప్రైవేటీకరణ ఆగిపోలేదు..కొనసాగుతుందనే సంకేతాలను బడ్జెట్ గట్టిగానే పంపింది. కోవిడ్ అనంతరం, ప్రత్యేక రైళ్ళు నడుపుతున్న ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా 400 వందేభారత్ రైళ్ళు నడుపుతామని వెల్లడించడం, తదుపరి ప్రైవేటు రైల్వేలపైనే అని సూచనప్రాయంగా తెలియజెపుతోంది. వ్యవసాయ రంగంలో ఆర్గానిక్ విప్లవాన్ని సృష్టించడానికి సిద్ధమవుతోంది.