తుస్సుమన్న సాక్షి కవరేజి
జ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ సూపర్
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయాన్ని సాధించిన క్షణాలను ప్రపంచంలోని క్రికెట్ లవర్స్ అంతా జగజ్జేగీయమానంగా జరుపుకున్నారు. భారత్‌లో అయితే ఒకరోజు ముందే దీపావళి పండుగను చేసుకోవాల్సి వచ్చింది. క్రికెట్ అభిమానులు జ్వజ్జరిల్లిపోయారు. సోషల్ మీడియా అయితే విభిన్నమైన కామెంట్లతో దద్దరిల్లిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే కాంతారా తరహా అరుపులు దిగ్దింతాలకూ వ్యాపించాయి. రాత్రి నిద్రలో కూడా ఆ కామెంట్లూ, అరుపులూ కర్ణేంద్రియాల నుంచి చిచ్చుబుడ్ల తరహాలో వెలుగులు విరజిమ్మాయి. ఇదంతా ఏదో నా తృప్తి కోసం రాస్తున్నదే.
ఇక పత్రికల్లో కవరేజి గురించి ఒక జర్నలిస్టుగా చెప్పడం నా ఉద్దేశం. సోషల్ మీడియాలో ప్రతి వ్యక్తీ ఒక పత్రికలా తయారయ్యారు. తమ అభిప్రాయాలను వ్యక్తీకరిస్తూ దూసుకుపోతున్నారు. ఇలాంటి తరుణంలో పత్రికలు ఎంత హుషారుగా ఉండాలి? తమ సృజనకు ఎంత పదును పెట్టాలి? ఉన్నది ఉన్నట్లు ఇచ్చేస్తే నా బోటి పాఠకుడు… ముఖ్యంగా సంవత్సర చందా కట్టి మరీ తెప్పించుకునే వారు నిరాశచెందరా? ఆ నీ ఒక్కడి కాపీ ఉంటే ఎంత పోతే ఎంత అనుకుంటే ఏం చేయలేం. ఇలా అనుకునేది ఉద్యోగులే తప్ప యాజమాన్యాలు కాదు. మరి యాజమాన్యాలు ఏం చేస్తున్నాయి?
కొంతమంది చేతుల్లో అధికారాన్ని అప్పజెప్పి తమ పని తాము చూసుకుంటున్నాయి. సంస్థల్లో వారిది ఆడింది ఆట.. పాడింది పాట. వ్యక్తిగత కక్షలతో వేధింపులు…ఏడిపించడాలు… వంటి పనికిమాలిన పనులకు కొందరు అసత్య భామలు, అసత్యవంతులు కారణం అవుతూనే ఉంటారు. చెప్పుడు మాటలు వినాలా వద్దా అనేది అధికారంలో ఉన్న వ్యక్తులు నిర్ణయించుకోవాలి. దురదృష్టవశాత్తూ వారిదే పైచేయి అవడంతో కాస్త డొక్క శుద్ధి ఉన్నవారు…విషయ పరిజ్ఞానం ఉన్నవారూ మిన్నకుంటున్నారు. కథలే రిపీట్ అయిపోతున్నా యాజమాన్యాలకు పట్టడం లేదు. ఈనాడు లాంటి సంస్థలలో ఎలాంటి చర్య తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షిలాంటి పత్రికలలో ఇలాంటి చర్యలు అసలే ఉండవు. ఇన్చార్జులే రిపీట్ అవుతోంటే కథలు రిపీట్ కావా అంటూ ఆ సంస్థలోనే జోకులేసుకుంటున్నారు. నిజమే పాత నీటిని కొత్త నీరు తోసేయ్యాలి. కానీ ప్రస్తుత పత్రికా ప్రపంచంలో అది జరగడం లేదు. ఈ కారణంగా సృజన లోపిస్తోంది. ఇలా అనడానికి కారణం నిన్నటి టి 20లో పాక్ – భారత్ మ్యాచ్‌ని ప్రెజెంట్ చేసిన విధానం. ఆంగ్ల పత్రికలకు తమకంటూ ఒక గిరి ఉంది. దాన్ని ఎప్పుడూ దాటవు. కానీ శీర్షికలతో పాఠకుల మనసును కొల్లగొడతాయి. తెలుగు పత్రికలకూ ఆ అవకాశం ఉన్నప్పటికీ 2010 తరవాత ఆ శక్తి వాటికీ సన్నగిల్లిపోయింది. వారు కూడా సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. లేదా ఏ టీవీ 9 చానెల్నో చూసేసి శీర్షికలు రాసేసుకుంటున్నారు.
ఇక ఈ రోజు నేను ఈనాడు, సాక్షి, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలను చూశాను. ఈ మూడింటిలో సాక్షి కవరేజి చాలా పూర్‌గా ఉంది. కోహ్లినూర్ అని శీర్షిక పెట్టి ల వత్తుకు రంగు మార్చి గొప్ప శీర్షిక పెట్టామనుకుని సంతృప్తి చెందారు. వార్త కవరేజి కూడా అంతంత మాత్రం. అద్బుతం. అనిర్వచనీయం అంటూ ఎప్పటి నుంచో వాడుతున్న పదాలను కుప్పపోసి, మమ అనిపించారు.
ఈనాడు విరాట్ కోహ్లీలా విరాడ్రూపాన్ని ప్రదర్శించింది. మ్యాచ్‌లోని అన్ని విభాగాలను చక్కగా ప్రస్తావిస్తూ ఆకర్షణీయమైన మేకప్‌తో పాఠకుడికి మనోల్లాసాన్ని కలిగించింది. మరోసారి మ్యాచ్‌ను చూసిన భావనను కలుగజేసింది. నరోత్తంపురి ప్రత్యక్ష వ్యాఖ్యానంలా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు మరోసారి మ్యాచ్‌ను కళ్ళముందు సాక్షాత్కరింపజేశారు. ఛాంపియన్‌లానే కవరేజిని ఆవిష్కరింపజేశారు.
వెలుగు కూడా దీనికి సరిసమానంగా కాకపోయినా ఆకట్టుకునేలానే రాసింది.
ఆంధ్ర జ్యోతి విరాట్ పటాస్ అంటూ దీపావళి హెడింగ్ ఇచ్చినా… కవరేజీ కూడా బానే ఇచ్చారు. నమస్తే తెలంగాణ విరాట్ విశ్వరూపం హెడింగ్ ఇచ్చారు.
పేపరు రావడానికి గంటల ముందే సోషల్ మీడియాలో వెల్లువెత్తిన కథనాలను తట్టుకోవాలంటే పత్రిక ఉద్యోగులలో సృజన ఎంతో అవసరం. ఈ సృజన సాక్షిలో ఏమాత్రం కనిపించలేదు. 1992 అక్టోబరులో రాజమండ్రిలో ప్రారంభమైన ఈనాడు ఎడిషన్ నుంచి వసుంధర ప్రారంభమైంది. తదనంతరం ఆ సంస్కృతిని అన్ని పత్రికలూ అందుకున్నాయి. 2008 నుంచి వస్తున్న సాక్షి ఫీచర్ పేజీలను కొత్త పుంతలు తొక్కించింది. ఒక రకంగా సాక్షికి ఇవే ప్రాణం. రెండుమూడేళ్ళ నుంచి సాక్షికి ఆ ప్రాణం కొన ఊపిరిని అందిస్తోంది. రాజకీయ వార్తలతో కశ్మలమై పోయిన పత్రికా ప్రపంచంలో ఈదులాడే పాఠకులకు ఫీచర్సే కాస్త రిలీఫ్ అనడంలో సందేహం లేదు. అవి కూడా చచ్చుబడిపోతే ఇక చెప్పేది ఏముంటుంది. ఇది కచ్చితంగా యాజమాన్యాలకు ఉద్యోగులపై పట్టులేదని చెబుతోంది. ఇకనైనా పట్టుబిగిస్తారో లేదో చూడాల్సిందే.
ముక్తాయింపు: ఇప్పుడున్న పత్రికలలో సీనియర్లంతా ఈనాడు నుంచి వెళ్ళిన వారే. ఈనాడులో వారు చూపిన నిబద్ధత, సమర్థత మారిన పత్రికలలో ఎందుకు కనిపించదో అర్థం కాని విషయం. ఏది ఏమైనా ఏ పత్రికకైనా ప్రియదర్శిని రామ్‌లాంటి సృజన శీలి ఫీచర్స్ కు అవసరం.