హీరో అవుతానంటే చివాట్లు పెట్టారు

Date:

ఆ రోజు శ్మశానంలో నాన్న పాడిన పద్యం వింటే…
ప్రశాంతంగా ఉంటారు…. అద్వితీయంగా పాడుతారు
సింగర్ రామకృష్ణ కుమారుడు సాయికృష్ణ
(డా. పురాణపండ వైజయంతి)
శారదా నను చేరగా…
ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు…
ఎదగడానికెందుకురా తొందరా..
శివశివ శంకర భక్త వశంకర..
ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు..
ఆకాశం దించాలా నెల వంక తుంచాలా…
పాండురంగ నామం.. వినరా వినరా…
విలక్షణ గాత్రం… వైవిధ్యమైన భావం..
ఎన్నో పాటలకు తన గళంలో ప్రాణం పోశారు..


సినీ గాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నారు వి. రామకృష్ణదాసు..
‘ఒక తండ్రిగా పిల్లల ఎదుగుదలకు ఎంతో సహకరించారు‘’ అంటూ తండ్రి జ్ఞాపకాలను పంచుకున్నారు కుమారుడు సాయి కిరణ్‌. టాలీవుడ్ గాయకుడు రామకృష్ణ జయంతి నేడు. ఈ సందర్భంగా సాయి కిరణ్ తన తండ్రితో అనుబంధాన్ని వివరించారు. ఆయన మాటల్లోనే చదవవండి…


అందరికీ చేదోడు వాదోడుగా…
కళలకు పుట్టినిల్లయిన విజయనగరంలో పుట్టారు నాన్న. తండ్రి రంగసాయి, తల్లి రత్నం. పదిమంది సంతానంలో నాన్న ఇంటిపెద్ద. ఇంట్లో నాన్నను దాసు అని పిలిచేవారు. అన్నదమ్ములను జాగ్రత్తగా చూసుకోవటం, చెల్లెళ్లకు జడలు వేయటం, ఇంటి పనుల్లో సహాయం చేయటం.. ప్రయోజకుడైన పెద్ద కొడుకులా ఉండేవారట. తాతగారి కంటె నాన్నను బాగా చూసేవారట. అన్ని విషయాల్లోనూ తల్లికి సహాయంగా ఉండేవారట.


అలా మొదలైంది…
స్కూల్‌లో చదువుకునే రోజుల్లో బాగా పాడేవారట. ప్రముఖ సంగీత దర్శకులు ఆదినారాయణరావు నాన్న పాటలు విని, ‘‘సినిమాల్లో పాడొచ్చుగా’’ అన్నారట. నాన్న మాత్రం చదువు మీద శ్రద్ధ పెట్టి, బి.ఎస్‌.సి వరకు చదువుకున్నారట. ప్రభుత్వం వారి కుటుంబ నియంత్రణ ప్రకటన కోసం పాడిన పాట విన్న అక్కినేని, నాన్న గురించి సమాచారం సేకరించారట. ‘విచిత్ర బంధం’ చిత్రంలో పాడే అవకాశం వచ్చింది. ఆదినారాయణరావు సంగీత దర్శకత్వంలో ‘భక్త తుకారాం’ చిత్రంలో మంచి పాటలు పాడారు.


హుందాగా ఉండేవారు…..
నాన్నది ప్రేమ వివాహం. ఆయన మ్యూజిక్‌ షోస్‌కి వెళ్లేవారు. అప్పుడే అమ్మ జ్యోతి కూడా అదే అర్కెస్ట్రాలో పాడేవారు. వాళ్ల పెయిర్‌ బాగా హిట్‌ అయ్యింది. అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. వివాహం జరిగింది. రెండు కుటుంబాలు అంగీకరించటానికి కొంత కాలం పట్టింది. నాన్నకు నేను, చెల్లాయి లేఖ ఇద్దరం పిల్లలం. ఎప్పుడూ తిట్టడం కూడా తెలియదు. ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి గురించి చెప్పేవారు. మా చదువు విషయంలో నాన్న చాలా పర్టిక్యులర్‌గా ఉండేవారు. నేను పదో తరగతి చదువుతున్న రోజుల్లో ఒక రోజున ‘హీరో అవుతాను’ అని అనగానే, బాగా కేకలేశారు. ఒకసారి పని మీద రజనీకాంత్‌ గారి దగ్గరకు వెళితే, ఆయన నాన్నతో, ‘మీ అబ్బాయి నటుడా’ అని అడిగారు. నాన్న మౌనంగా వచ్చేశారు. ‘నేను నటుడిని అవ్వాలనుకుంటుంటే, మీరే నన్ను ఎదగనివ్వట్లేదు’ అని కోపంగా అన్నాను. ‘నువ్వు డిగ్రీ పూర్తి చెయ్యి. తరవాత చూద్దాం’ అన్నారు నాన్న. హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసి, గోల్డ్‌ మెడల్‌ సాధించాను. చెల్లెలు బి. సి. ఏ చేసి, సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తోంది. డిగ్రీ పూర్తి కాగానే మళ్లీ సినిమాల గురించి అడిగాను. వెంటనే నా ఫోటోలు అందరికీ ఇచ్చారు. మొట్టమొదటగా ఒక చానెల్‌లోను, ఆ తరవాత వారి బ్యానర్‌లోను నటించే అవకాశం వచ్చింది. నన్ను తెర మీద చూడగానే నాన్న కళ్లలోని ఆనందబాష్పాలు ఇప్పటికీ మనసులో పదిలంగా ఉన్నాయి.


అందరూ ఎగతాళి చేశారు…
నేను సినిమాలలోకి రావటం చూసి, ‘పిల్లల్ని చెడగొడుతున్నారు’ అని అందరూ నాన్నను మందలిస్తుంటే, ‘నేను తప్పు చేస్తున్నానా’ అని నాన్న బాధపడేవారు. ‘ఒక ఏడాది ప్రయత్నిద్దాం, సక్సెస్‌ సాధించకపోతే ఉద్యోగంలోకి వెళ్లిపోవాలి’ అన్నారు. అప్పుడు చదువు విలువ తెలిసింది నాకు. జీవితమే అన్నీ నేర్పుతుందని అర్థమైంది. నాన్న చనిపోయాక తండ్రి విలువ తెలిసింది నాకు.


లైఫ్‌ సైన్సెస్‌
నాన్న పెద్దల పట్ల గౌరవంగా ఉండేవారు. పనివారైనా సరే వయసులో పెద్దవారైతే ‘మీరు’ అనేవారు. ‘దర్శకుడు వయస్సులో మన కంటె చిన్నవాడైనప్పటికీ, తండ్రి స్థానంలో చూడాలి, కాలి మీద కాలు వేసుకోకూడదు, నిర్మాతను ఇబ్బంది పెట్టకూడదు’ అంటూ చాలా విషయాలు చెప్పారు. రాముడితో పాటు రావణుడు కూడా గొప్పవాడని, కొన్ని చెడ్డ లక్షణాల వల్లే దుర్మార్గుడయ్యాడనీ చెబుతూంటే, ఆ టీనేజ్‌లో చాలా ఇరిటేటింగ్‌గా ఉండేది. ఇప్పుడు నాలో ఆధ్యాత్మిక భావం బాగా పెరిగింది. పురాణాలు, కథలు అన్నీ తెలిసినందుకు సంతోషంగా ఉంటోంది. ఈ జీవిత ప్రయాణంలో నాన్న చెప్పిన విషయాలు మెదడులో చేరిపోయాయి. ఎప్పుడైనా తెలియక తప్పు చేస్తే, ‘సారీ చెప్పు’ అని లోపల నుంచి మనసు హెచ్చరిస్తుంది. నన్ను అందరూ గౌరవంగా చూస్తున్నారంటే అందుకు కారణం నాన్న నేర్పిన సత్ప్రవర్తన. నాన్న నన్ను అక్కినేని గారి దగ్గరకు తీసుకువెళ్లినప్పుడు, ఆయన నాకు ‘అక్కినేని అఆలు’ అనే పుస్తకం ఇస్తూ, ‘ఊబిలోకి దిగుతున్నావు, జాగ్రత్త’ అని సూచించారు. ఆ తరవాత నాన్న కూడా ‘మానసికంగా బలంగా ఉండాల్సిన రంగంలోకి దిగుతున్నావు, నచ్చితే సింహాసనం మీద కూర్చోపెడతారు లేదంటే తోసేస్తారు’ అని చెప్పారు. సినిమా పరిశ్రమ అంటే ‘మెంటల్‌ రోలర్‌ కోస్టర్‌ మీద రైడ్‌’ అని అర్థమైంది.


మంచి జ్ఞాపకం
బాపుగారు తీసిన ‘వెంకటేశ్వర వైభవం’ లో వెంకటేశ్వరస్వామి పాత్ర పోషించాను. ఒకరోజున బాపుగారిని కలిసినప్పుడు నాన్నతో, ‘పురాణ పాత్రలకు ప్రసిద్ధులైన ఎన్టీర్‌ లాంటి కుమారుడిని కని ఇచ్చావు. థాంక్స్‌ రామకృష్ణా’ అన్నారట. ‘ప్రేమించు’ సినిమాలో నటిస్తున్నప్పుడు బాలుగారు, నాన్నకు ఫోన్‌ చేసి, ‘నీ కొడుకు హీరోగా నటిస్తున్న సినిమాలో నేను పాడుతున్నాను’ అని చెప్పారట. ఈ రెండు సంఘటనలూ నాన్న ఎంతో ఆనందంగా నాకు చెప్పారు.


నా అదృష్టం…
‘శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి’ పాటల రికార్డింగ్‌కి వెళ్లాను. ఎన్‌టీఆర్‌ నన్ను చూస్తూనే, ‘దానవీరశూరకర్ణ సినిమా సమయంలో పుట్టినవాడేనా’ అన్నారు. ఆ సినిమా పాటల రికార్డింగ్‌ సమయంలో నాన్న చాలా టెన్షన్‌గా ఉన్నారట. ఇంతలో ‘అబ్బాయి పుట్టాడు’ అని ఫోన్‌ వచ్చిందట. వెంటనే ఎన్‌టీఆర్‌ అందరికీ స్వీట్స్‌ పంచారట. అలా ఆయన నా గురించి గుర్తు పెట్టుకున్నారు. ఎన్‌టీఆర్‌ నటించిన రాముడు, కృష్ణుడు, రావణాసురుడు, శివుడు పాత్రలే నేను కూడా చేయడం యాదృచ్ఛికం కావచ్చు.


ఎన్నటికీ మరిచిపోలేను
‘డార్లింగ్‌ డార్లింగ్‌’ సినిమా క్లైమాక్స్‌ సీన్‌ రాజమండ్రిలో వేసవికాలంలో జరిగింది. నాతో పాటు నాన్నను తీసుకువెళ్లాను. షూటింగ్‌ అయిపోయాక మరో రెండు రోజులుండి, పడవ మీద నాన్నను లంక గ్రామాలలోకి తీసుకువెళ్లాను. గోదావరి స్నానం చేశాం. మరోసారి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి వెళ్లాం. ఆయన సమాధి అయిన చోట నమస్కరిస్తుండగా, నాన్న కళ్లలో నీళ్లు వచ్చాయి. నేను అక్కడకు తీసుకువెళ్లినందుకు సంతోషించాను. ఒకసారి హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌ ప్రయాణిస్తున్నాం. ‘ఈరోజు మహాలయ అమావాస్య కదా, శివుడిని దర్శించుకోవాలి’ అన్నారు నాన్న. మహాలయ అమావాస్యనాడు శివుడు శ్మశానంలోనే ఉంటాడని అంటారు. ఆ దారిలో ముందుకి వెళితే శ్మశానం వస్తుంది. అక్కడ పెద్ద శివుడి విగ్రహం, వీరభద్రుడు, హరిశ్చంద్రుడి బొమ్మ ఉంటాయి. అక్కడకు రాగానే ‘ఇక్కడికి ఎందుకు’ అన్నారు. ‘నువ్వు గుడికి వెళ్తాను అన్నావు కదా’ అని కొబ్బరికాయ కొట్టించాను. నాన్న భక్తిపారవశ్యంతో ‘భక్త కన్నప్ప’ చిత్రంలోని ‘జయ జయ మహాదేవ’ పద్యం గట్టిగా చదువుతుంటే, ప్రకృతి ప్రతిధ్వనించింది. అందరికీ శివుడిని చూసిన అనుభూతి కలిగి, ఒళ్లు పులకరించి, కళ్లలో నీళ్లు తిరిగాయి. పరవశించిపోయాం. ఈ సంఘటనలు నా జీవితంలో నేను మర్చిపోలేను.


సరదాగా ఉండేవారు…
నాన్న చాలా సరదాగా ఉండేవారు. హోటల్లో బాగా తినేసి, కదలలేని స్థితిలో ‘ఏంట్రా అస్సలు తినలేకపోతున్నాం’ అనేవారు. ‘ఎదగడానికి ఎందుకురా తొందర… ’ పాట నన్ను ఉద్దేశించి అప్పుడప్పుడు పాడేవారు. దేవుడి దయ వల్ల నా వృత్తిలో సక్సెస్‌ అయ్యాను. కోయిలమ్మ సీరియల్‌లో నటిస్తున్నప్పుడు ‘నాన్న బతికి ఉంటే బావుండేది. చూసి సంతోషపడేవారు’ అనుకున్నాను. నాన్న నేర్పిన జీవిత పాఠాలు నా ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికీ నాన్న నా వెంట ఉండి నడిపిస్తున్నట్లే మనసులో భావించుకుంటాను.


చాలా కూల్‌గా ఉంటారు…
ఒకసారి నాన్న, నేను కారులో రాయలసీమలో ప్రయాణిస్తుండగా, ఒక చోట ట్రాఫిక్‌ ఆగిపోయింది. అక్కడ ఒకరి మీద ఒకరు బాంబులు విసురుకుంటున్నారు. గన్‌ పేలుస్తున్నారు. నాకు భయం వేసింది. నాన్న మాత్రం చాలా ప్రశాంతంగా, కారు పక్క రోడ్డులోకి తిప్పు అన్నారు. ఆ రోడ్డు చాలా ఎత్తుగా ఉంది. ఆ రోడ్డులోకి వెళ్లి చూస్తే, దూరం నుంచి వారి గొడవ కనిపించింది. ‘నేను భయపడుతుంటే, నువ్వు అంత కూల్‌గా ఎలా ఉన్నావు’ అని అడిగితే, ‘వాళ్లలో వాళ్లు కొట్టుకుంటారు, మన జోలికి రారు వాళ్లు. నువ్వు టెన్షన్‌ పడకు’ అన్నారు. ఏం జరుగుతున్నా దేనికీ భయపడరు, తొణకరుబెణకరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

We are here to help our country: Trump

This is a moment never seen before We are here...

Uddhav Thackeray: Congress riding Shiv sena tiger?

(Dr Pentapati Pullarao) In November 2019, Uddhav Thackeray broke of...

US Elections vs Indian Polls

Plethora of similarities in campaigning style (Anita Saluja) As the US...

శిల్ప చేసిన భగీరథ విఫల యత్నం

త్వరలో సమస్య పరిష్కారానికి HMWSSB ఎం.డి. హామీ (కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)ఎవరికైనా వ్యక్తిగతంగా...