తిరుమల అనుభవం చెప్పిన మాజీ సీఎం
(Kvs Subrahmanyam)
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారికి మీడియాతో ఒక అనుభవం ఎదురైంది. అది కూడా తిరుమలలో. ఆ సమయంలో ఆయన తమిళనాడు గవర్నరుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కే చెందిన ఒక ప్రముఖ నేతకు ఈ అనుభవాన్ని చెప్పి మీడియా ఎంతటి దుస్థితికి దిగజారిందో చెప్పారట ఆయన. ఒకసారి తిరుమల వెళ్ళినప్పుడు… కాటేజీ బయట కూర్చున్న ఈ నేతకు.. పక్క కాటేజీలోనే ఉన్న రోశయ్య గారు కనిపించారు. రోశయ్య గారు ఆయనను గుర్తుపట్టి, రమ్మన్నట్టు చెయ్యి ఊపారు. కొంతసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్న తరవాత, ఏమిటండీ ఈ మీడియా మరీ ఇంత దారుణంగా తయారయ్యింది. అంటే… ఏమైంది సర్… అంటూ ఆ నేత ప్రశ్నించారు. చెప్పుకుంటే నాకు సిగ్గుచేటు అన్న రోశయ్య తన అనుభవాన్ని చెప్పారు.
దర్శనం చేసుకుని మహాద్వారం నుంచి బయటకు వస్తున్న నన్ను చూసి కొందరు మీడియా మిత్రులు పరుగున వచ్చారు. మైకులు ముందు పెట్టి “చెప్పండి సర్” అన్నారు. రెండు రాష్ట్రాలు బాగుండాలని, ప్రజలు బాగుండాలని స్వామి వారిని కోరుకున్నట్టు చెప్పాను… ఆ బైట్ తీసుకుని, వాళ్ళు వెళ్లిపోయారు. ఈలోగా మరొక రిపోర్టర్ తన మీడియా గొట్టం పట్టుకుని పరుగుపరుగున వచ్చారు.
“సర్… సర్… చెప్పండి అన్నారు. ఏమి చెప్పాలి అన్నాను. నేను రావడం ఆలస్యమైంది. వాళ్లకి ఏమి చెప్పారో అదే చెప్పండి అన్నారు. సరే అంటూ చెప్పబోతుంటే… మీ పేరు చెప్పి ఆ తరవాత వారికి ఏమి చెప్పారో అది చెప్పండి అన్నారు. అది విన్న నాకు నోట మాట రాలేదు. నేనెవరో తెలియని విలేఖర్లున్నారా అనిపించింది. చేసేదేమి లేక, నవ్వుకుంటూ ఏమీ అనకుండానే అక్కడి నుంచి నిష్క్రమించాను” అంటూ రోశయ్య గారు తెలిపారని ఆ నేత నాతో అన్నారు. రోశయ్య గారి వంటి నాయకుణ్ణి పట్టుకుని మీ పేరు చెప్పండనే స్థాయికి మన మీడియా దిగజారిందన్నారు. ఎంత కొత్తగా వచ్చిన రిపోర్టర్ అయినా రోశయ్య గారి లాంటి నేత తెలియకపోవడం విచిత్రమే కదా…
(రోశయ్య గారి వర్థంతి సందర్భంగా ఇదో చిన్న జ్ఞాపకం)