ఆపరేషన్ సక్సెస్ అయ్యిందంటూ తేజస్వి ట్వీట్
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు పునర్జన్మ లభించింది. మూత్రపిండ సమస్యతో బాధపడుతున్న ఆయనకు సింగపూర్‌లో ఉంటున్న కుమార్తె రోహిణీ ఆచార్య తన కిడ్నీని దానం చేశారు. తద్వారా ఆయనకు పునర్జన్మను ప్రసాదించారు. ఆస్పత్రిలోని ఐసీయూకు తరలిస్తున్న తండ్రి వీడియోను ఆయన కుమారుడు తేజస్వి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో ఆయన తన సోదరికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ వీడియోలో తల్లి రబ్రీ దేవితో పాటు రోహిణి కూడా కనిపించారు. అత్యంత కీలకమైన అవయవాన్ని దానం చేసిన రోహిణి త్యాగాన్ని మరువలేమంటూ బీహార్ ఉప ముఖ్యమంత్రి కూడా అయిన తేజస్వి ఆ వీడియోలో తెలిపారు. కిడ్నీ మార్పిడి చికిత్స ప్రక్రియ సజావుగా సాగిందని పేర్కొన్నారు. ఈ విషయంతో పాటు వీడియోను కూడా తేజస్వి తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. రోహిణి ఆచార్య కూడా సర్జరీకి ముందు తన తండ్రితో తీసుకున్న ఫొటోను ట్వీట్ చేశారు. రెడీ టూ రాక్ అండ్ రోల్. విష్ మి లక్ అంటూ కామెంట్ పెట్టారు.
శస్త్ర చికిత్స అనంతరం తండ్రి, కూతురు బాగున్నారనీ, కోలుకుంటున్నారనీ కూడా తేజస్వి తెలిపారు.
https://twitter.com/i/status/1599675635634667520
ఇలా అవయవాలు దానం చేసే వారు చాలామంది ఉంటారు. అన్ని సందర్భాల్లోనూ అవి బయటకు రావు. లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో చురుగ్గా ఉండడమే కాకుండా… కేంద్ర మంత్రిగానూ, బీహార్ ముఖ్యమంత్రిగానూ కూడా పనిచేశారు. దాణా కుంభకోణం కేసులో ఆయన పేరు ప్రముఖంగా కనిపించి, దేశవ్యాప్తంగా ఆయనంటే ఏవగింపు కలిగేలా చేసింది. తాజాగా ఆయన బీహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వంలో భాగమయ్యారు. నితీశ్‌తో కలిసి సోనియాను కలిసి, దేశ రాజకీయాల్లో మరోసారి కేంద్రబిందువుగా మారడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీని దెబ్బకొట్టాలనేది ఆయన లక్ష్యం. ఈ క్రమంలో ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. కిడ్నీ దానం చేసేందుకు ఆయన కుమార్తె రోహిణి ముందుకు వచ్చారు. రాజకీయాల్లో సెలబ్రిటీ కాబట్టి, ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కిడ్నీ మార్పిడికి తొలుత రక్త సంబంధీకులనే ఎంపిక చేసుకుంటారు. కుదరని పక్షంలో జీవన్ దాన్ పథకం ద్వారా కిడ్నీ పొందాల్సి ఉంటుంది. తనకు తగిన కిడ్నీ దొరికే దాకా వేచి ఉండాల్సిందే. లాలూకు వేచి ఉండాల్సిన అవసరం లేకుండానే కుమార్తె కిడ్నీ సరిపోలడంతో సమస్య తీరిపోయింది. కీలకమైన అవయవాన్ని ఇవ్వడానికి ఎంతమంది ముందుకు వస్తారు? అందుకు సమాధానమే రోహిణి.
టాలీవుడ్‌లోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు ఏవీఎస్‌కు కాలేయ మార్పిడికి ఆయన కుమార్తె సహకరించారు. ఆమె తన కాలేయంలోని భాగాన్ని ఇచ్చి, సహకరించారు.