శారీ మూవీ వెనుక నిజాలు
(వైజయంతి పురాణపండ)
చీరకి చాలానే చరిత్ర ఉంది.
పురాణ కాలంలో ఎవరు అరణ్య వాసానికి వెళ్లినా నార చీరలే కట్టుకున్నారు.
గోపికలు చెరువులో స్నానం చేస్తుంటే, శ్రీకృష్ణుడు ఆ చీరలను ఎత్తుకెళ్లి, దేహచింతలను పోగొట్టాడు. ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు చీరలిచ్చి మానరక్షణ చేశాడు.
ధర్మరాజు తల నుంచి నెత్తురు కారుతుంటే, ద్రౌపది చీర చెంగు చింపి కట్టు కట్టింది.
ఇక అమ్మ కట్టిన చీర కల్పవృక్షమే.
కొంగుకి చిల్లర కట్టుకుని, పిల్లలు అడగ్గానే కొంగుముడి విప్పి పది పైసలు చేతిలో పెట్టేది.
చిన్న పిల్లలకు ముక్కుమూతులు తుడిచేది.
కొంగు పరచుకుని నేల మీద పడుకునేది.
ఇంత చరిత్ర ఎందుకంటే…
ఇప్పుడు శారీ అనే సినిమా గురించి చెప్పడానికి…
ఆ చీరకి ఈ శారీకి పోలికేంటంటే…
అప్పట్లో కొత్త చీర కట్టుకుంటే ఇరుగుపొరుగు వారికి చూపించి ఆనందించేవారు. అంతే.
మరి ఇప్పుడో..
రీల్స్ చేయడం, ఫోటోలు తీసుకోవడం…
ఇన్‌స్టాలో ఆ చీర అందాన్ని ప్రదర్శించడం.
కామెంట్స్, లైక్స్ చూసుకుని ఆనందించడం.
ఇది ప్రెజెంట్ ట్రెండ్

ఒక ఫోటో ఇన్‌స్టాలో పెట్టడం వల్ల పరిణామాలు ఎలా ఉంటాయనేది ఎవ్వరూ ఊహించలేరు.
అందునా ఆ వయసు ఆడపిల్లలకు అంత పెద్ద ఆలోచనే ఉండదు.
సరదాగా కట్టుకోవడం, దానిని అందరూ చూసేలా పోస్ట్ చేయడం.
అలా ఇన్‌స్టాలో తన చీరలను పోస్ట్ చేసిన అమ్మాయి ఎదుర్కొన్న భయంకరమైన సమస్యలను శారీ సినిమాలో చూపించారు దర్శకుడు గిరికృష్ణ కమల్.
ఆరాధ్య అనే అమ్మాయికి చీర కట్టుకోవడం ఇష్టం. రోజూ తను చీర కట్టుకుని రీల్స్ పోస్ట్ చేస్తుంటుంది. ఇంట్లో అన్నయ్య ఎంత వద్దని చెప్పినా వినిపించుకోదు. ఆరాధ్యను కిట్టు అనే ఒక సైకో ఒకచోట చూసి, ఆ అమ్మాయిని ఇష్టపడతాడు. వృత్తిరీత్యా అతను ఫోటోగ్రాఫర్.

ఒకరోజు ఆ అమ్మాయి పేరు తెలుసుకుని, ఇన్‌స్టాలో సెర్స్ చేసి, కామెంట్స్ పెట్టడం మొదలుపెడతాడు. నెమ్మదిగా మూడు నాలుగు చీరలు కొని ఇచ్చి, ఆ చీరలతో ఫోటో షూట్ చేసి, ప్రింట్స్ వేసుకుని, ఇంట్లో పెట్టుకుని పిచ్చివాడిలా ప్రవర్తిస్తుంటాడు. వాడిలో సైకో తత్త్వం రానురాను పెరిగిపోతుంది. ఆరాధ్యను భయంకరంగా హింసిస్తాడు. తనకు అడ్డు వచ్చినందుకు ఆరాధ్య అన్నయ్యను అతి కిరాతకంగా చంపుతాడు. చివరకు ఆరాధ్యను కూడా చంపబోతాడు. చివరికి ఏమైందీ తెలియాలంటే సినిమా చూడాలి. కట్ చేస్తే.. హాస్పిటల్‌లో బెడ్ మీద ప్యాంట్ షర్టులో ఉన్న ఆరాధ్య, ఇంటికి వచ్చి, తన వార్డ్‌రోబ్‌లో చీరలను తీసుకుని వచ్చి బయట పడేసి, పెట్రోల్ పోసి తగలబెడుతుంది. ఇది సింపుల్‌గా స్టోరీ.

ఈ సినిమా ఎందుకు చూడాలి…
ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండకపోతే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో తెలుసుకోవడానికి తప్పనిసరిగా చూడవలసిన చిత్రం. ఈ చిత్రంలో ఇంటర్వెల్ తరవాత ఆరాధ్య తన అద్భుతమైన నటనతో మెప్పించింది. కొత్త నటిలాగ అనిపించకుండా చాలా అనుభవం ఉన్న నటిలా అనిపించింది.
ఇక సైకో కిట్టుగా వేసిన నటుడిని చూడగానే వెళ్లి చంపేయాలన్నంత ఆవేశం వస్తుంది. అంత సహజంగా నటించాడు. ఇంచుమించు సినిమాని ఆ సైకోనే ఒంటి చేత్తో నడిపించినట్లు అనిపిస్తుంది.

ఇది ఆర్‌జీవీ డెన్ ప్రెజెంట్ చేసిన సినిమా.
సినిమా చాలా ఇంటరెస్టింగ్‌గా నడిచింది. కాకపోతే చివరి సీన్ నిడివి తగ్గితే బాగుంటుందనిపించింది. చాలా సేపు అంత క్రైమ్ చూడటం కూడా కష్టమే.
ఇక పాటల విషయానికొస్తే…
ఆరాధ్యను చెప్పరానంత గ్లామరస్‌గా చూపించారు.

యంగ్ జనరేషన్‌కి నచ్చుతుందేమో కాని, ఈ కథాంశానికి అంత ఓవర్ ఎక్స్‌పోజింగ్ అవసరం లేదనిపించింది.
ఇక ఈ సినిమా నౌకను నడిపిన కెప్టెన్ గిరి కృష్ణ కమల్ దర్శకత్వం చాలాచాలా బావుంది. కమల్‌కి ఇదే తొలి సినిమా. కెమెరాను కొత్తరకంగా చూపించాడు. సైకోలా ప్రవర్తిస్తున్న కిట్లు ముఖంలో ఆరాధ్య ముఖాన్ని కలిపి చూపించిన విధానం చాలాబావుంది. అలాగే ఆరాధ్య ఫోటోలతో మాట్లాడుతున్న సీన్‌లో కూడా డైరెక్షన్ చాలా కొత్తగా ఉంది.
సినిమా నిడివితో పాటు, ఓవర్ ఎక్స్‌పోజింగ్ ఉన్న పాటల నిడివి కూడా తగ్గిస్తే బావుంటుంది.
ఈ సినిమాను ఆడపిల్లలు తప్పక చూడాలి.
రివ్యూ కరెక్ట్.
శారీస్ పై ఉన్న శ్రద్ధ స్క్రిప్టు పై పెట్టీ వుంటే బాగుండేది