- విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించం….
- ప్రకటనల ఆదాయం పెంపుపై కసరత్తు చేయాలి..
- మల్టీలెవల్ పార్కింగ్… స్కైవాక్ మార్కెట్లపై అధ్యయనం చేయండి..
- నూతన మేయర్లు.. డిప్యూటీ మేయర్లు.. ఛైర్మన్లు… డిప్యూటీ ఛైర్మన్లతో త్వరలో సమావేశం
- పురపాలక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 17: మూడు నగర పాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాను ప్రత్యక్ష పరిశీలనకు వస్తానని… ఎక్కడైనా చెత్త కనపడితే సహించమని అధికారులను సీఎం హెచ్చరించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి నగర పాలక సంస్థల కమిషనర్లు తెల్లవారుజామున ఆరు గంటలకే క్షేత్ర పర్యటనలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రకటనల ఆదాయం పెంపు పాలసీపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆదాయం పెంపునకు తీసుకోవాల్సిన పలు అంశాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. నగరంలో కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలక్ట్రిక్, ఇతర కేబుళ్లు, సీసీ కెమెరాలు, ప్రకటనల బోర్డులు వాటిపై ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు.

నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేటు భూముల్లోనూ మల్టీలెవల్ పార్కింగ్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నెక్లెస్ రోడ్డు పక్కన పలు ప్రాంతాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. ప్రకటనలకు సంబంధించి పెద్ద మొత్తంలో వివిధ రకాల బోర్డులు కనిపిస్తున్నా ఆశించిన ఆదాయం రాకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ముంబయి, అహ్మదాబాద్, బెంగళూర్‌ల్లోని ప్రకటనల ఆదాయంతో నగరంలో వస్తున్న ఆదాయాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్న ప్రకటనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రకటనలకు 10 శాతం బోర్డులు కేటాయించాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా పీపీపీ, ఇతర నమూనాల్లో ఆదాయం సమకూర్చుకునే అంశంపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దానిని పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు, సలహాలు అందజేశారు. మూడు నగర పాలక సంస్థలతో పాటు రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ సిస్టమ్ అనుసరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూడు నగర పాలక సంస్థల పరిధిలోని పార్కుల వివరాలు సేకరించాలని.. వాటి అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు.
- ఒక రోజు శిక్షణ…
రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు.. ఛైర్మన్లు, డిప్యూటీ ఛైర్మన్లతో త్వరలోనే ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరాలు, పట్టణాల అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలు.. ఇతర అంశాలను వివరించాలని సూచించారు. తాను సమావేశానికి హాజరై నూతనంగా ఎన్నికైన వారితో మాట్లాడాతానని సీఎం తెలిపారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు , సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనర్లు ఆర్.వి.కర్ణన్, సృజన, వినయకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

