పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

Date:

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డి
జె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి అప్పగింత
సాకారమవుతున్న పదహారేళ్ళ స్వప్నం
(పి.వి. రమణారావు, 98499 98093)
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయిన పదేళ్ల తర్వాత పత్రికా రంగానికి స్వాతంత్య్రం వచ్చింది. 2023 డిసెంబర్‌ 7న ఎనుముల రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, బాధ్యతలు తీసుకున్న తర్వాత పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ముఖ్యమంత్రి, మంత్రులు ఏర్పాటు చేసే విలేకర్ల సమావేశంలో పాత్రికేయులు స్వేచ్ఛగా ప్రశ్నించగలుగుతున్నారు. హైదరాబాదులోని జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్‌ సొసైటీ (జెఎన్‌జెహెచ్‌ఎస్‌)కి చెందిన వెయ్యిమందికి పైగా జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాల కోసం భూమి అప్పగించాలని రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం 7 సంవత్సరాల్లో తీసుకోలేకపోయిన నిర్ణయాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తొమ్మిది నెలల్లో తీసుకుంది. 2024 సెప్టెంబరు 8న ఉదయం 11.00 గంటలకు హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసే బహిరంగ సమావేశంలో ఇళ్ల స్థలాల కోసం 38 ఎకరాల భూమిని స్వాధీనం చేసే అధికారిక డాక్యుమెంట్‌ను జవవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టుల మ్యాక్‌ హౌజింగ్‌ సొసైటీకి అందిస్తామని రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తోంది.


హైదరాబాదులోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు అవసరమైన భూమిని గతంలో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ఇచ్చారు. బంజారాహిల్స్‌లో మొదటి పర్యాయం, జూబ్లీహిల్స్‌లో రెండో పర్యాయం గోపన్‌పల్లిలో 1993 -98 మధ్య మూడో పర్యాయం ఇళ్ల స్థలాల అందచేశారు.
డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్‌ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం 70 ఎకరాల భూమిని మార్కెట్‌ ధరకు కేటాయిస్తూ 25.03.2008న ఉత్తర్వులు (జి.ఓ.ఎం.ఎస్‌.నెం. 424) జారీ చేసింది. మేడ్చల్‌ జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట గ్రామంలో 332 సర్వే నెంబర్‌లో 32 ఎకరాలు, ఇదే జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం పేట్‌ బషీరాబాద్‌లో 25/2 సర్వే నెంబరులో 38 ఎకరాలు కేటాయించారు. జర్నలిస్టులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులతో కూడిన హౌజింగ్‌ సొసైటీలకు కూడా హైదరాబాద్‌లో ఇళ్ల కోసం భూములను కేటాయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ వీరికి ఇళ్ల స్థలాలు ఇవ్వద్దంటూ ప్రజ్రా ప్రయోజనాల వాజ్యం (పిల్‌) హైకోర్టులో దాఖలయింది. ఈ వాజ్యంపై హైకోర్టు 05.01.2010న తీర్పు చెబుతూ ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేని వారికి మాత్రమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సూచించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేసింది.


ప్రజా సేవలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌., ఐపిఎస్‌ అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ‘‘వన్‌టైం బెనిఫిట్‌’’ కింద ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసింది. జె.ఎన్‌.జె. హౌజింగ్‌ సొసైటీ కూడా ఈ కేసులో ఇంప్లీడ్‌ అయింది.
2017 మే 2న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ జెఎన్‌జె హౌజింగ్‌ సొసైటీకి 70 ఎకరాల భూమిని స్వాధీనం చేయాలని సూచించింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు నిజాంపేటలోని 32 ఎకరాల భూమిని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2018లో జర్నలిస్టుల సొసైటీకి స్వాధీనం చేసింది. పేట్‌ బషీరాబాద్‌లో భూమిని మాత్రం స్వాధీనం చేయలేదు. పేట్‌ బషీరాబాద్‌లోని 38 ఎకరాల భూమిని జెఎన్‌జె హౌజింగ్‌ సొసైటీకి స్వాధీనం చేయవచ్చని గవర్నమెంట్‌ ప్లీడర్‌ (రెవెన్యూ) ప్రభుత్వానికి 2017 డిసెంబర్‌ 30న లేఖ రాసారు. 38 ఎకరాల భూమిని జెఎన్‌జె హౌజింగ్‌ సొసైటీకి స్వాధీనం చేసేందుకు అనుమతి ఇవ్వాలని జిపి సూచన మేరకు ఒక అధికారిక లేఖను 2018 మార్చి 3న ఆనాటి ముఖ్యమంత్రికి రెవెన్యూ శాఖ పంపించింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఈ ఫైలుపై నిర్ణయం తీసుకోకుండా ఏడు సంవత్సరాల కాలం గడిపారు.


38 ఎకరాల భూమిని జెఎన్‌జె హౌజింగ్‌ సొసైటీకి స్వాధీనం చేయని విషయం సుప్రీంకోర్టు దృష్టికి జర్నలిస్టులు తీసుకురాగా 2022 ఆగష్టు 25న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని త్రిసభ్య బెంచి తీర్పు చెప్పింది. పేట్‌ బషీరాబాద్‌లోని 25/2 సర్వే నెంబరులో ఉన్న 38 ఎకరాల భూమిని జెఎన్‌జె హౌజింగ్‌ సొసైటీని వెంటనే స్వాధీనం చేయాలని ఆదేశించింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం 70 ఎకరాలు కేటాయించగా ఈ సొసైటీ 12 కోట్ల 33 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించారని సుప్రీంకోర్టు తన తీర్పులో గుర్తు చేసింది. ఇళ్ల స్థలాలు తమ చేతికి వస్తే ఇళ్లు కట్టుకోవాలని జర్నలిస్టులు 14 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని తన తీర్పులో పేర్కొన్నది. 38 ఎకరాలను ప్రభుత్వం ఈ సొసైటీకి స్వాధీనం చేయాలని చెబుతూ, ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని సొసైటీలో సభ్యులైన జర్నలిస్టులు ఇళ్లు కూడా నిర్మించుకోవచ్చని సుప్రీం కోర్టు సూచించింది.


సుప్రీం కోర్టు 2017లో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను కాని, 2022 ఆగష్టు 25న జారీ చేసిన త్రిసభ్య బెంచి తీర్పును టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2023 డిసెంబరు దిగిపోయేవరకు అమలు చేయలేదు. 2014 – 2023 మధ్య 70 మంది జర్నలిస్టులు చనిపోయారు. దీనిని కూడా కెసిఆర్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో జె.ఎన్‌.జె.హెచ్‌.ఎస్‌.లో సభ్యులైన వెయ్యి మంది జర్నలిస్టులు ఆందోళనకు గురయ్యారు.


పోరుబాట
సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని పేట్‌ బషీరాబాద్‌లో 38 ఎకరాలు తమకు స్వాధీనం చేయాలని జె.ఎన్‌.జె.లో భాగస్వామ్యం అయిన సభ్యులు ‘‘టీం జెఎన్‌జె’’ పేరుతో పోరుబాట పట్టాము. 2023 జూలై 2న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సొసైటీ సభ్యులతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశాం. 2023 జూలై 10న పత్రికాధిపతులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేసాము. ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌తో పాటు పలు పత్రికల సంపాదకులు హాజరై తమ మద్ధతు తెలిపారు.


2023 జూలై 18న ఇందిరాపార్కు సవిూపంలోని ధర్నాచౌక్‌లో భారీ ఎత్తున ధర్నా చేసారు. ఆనాటి టిపిసిసి అధ్యక్షుడు (నేటి ముఖ్యమంత్రి) ఎ. రేవంత్‌రెడ్డి టీం జెఎన్‌జెకు మద్ధతు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 2023 చివరలో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని, తాము అధికారంలో వచ్చిన తర్వాత పేట్‌ బషీరాబాద్‌ భూమిని జెఎన్‌జె సొసైటీకి స్వాధీనం చేస్తామని వారు హావిూ ఇచ్చారు.
రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు 18.07.203న జరిగిన ధర్నాలో ఆనాటి పిసిసి ఉపాధ్యక్షుడు (నేటి పార్లమెంటు సభ్యులు) మల్లురవి స్వయంగా పాల్గొన్నారు. దాదాపు అయిదు గంటల పాటు మల్లు రవి ధర్నాలో పాల్గొని ఆందోళన చేస్తున్న జర్నలిస్టులకు అండగా నిలిచారు. ఈ ధర్నాలో బిజెపి తరపున ఈటల రాజేందర్‌ (నేటి ఎంపి) సి.పి.ఐ. నాయకుడు కూనమనేని సాంబశివరావు (నేటి కొత్తగూడెం ఎమ్మెల్యే), సిపిఎం నాయకులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, న్యాయ నిపుణులు, రామచంద్రరావు తదితరులు పాల్గొని జర్నలిస్టులకు సంఫీుభావం తెలిపారు.
ప్రభుత్వ హావిూ
2023 డిసెంబర్‌ 21న టీం జెఎన్‌జె నేతృత్వంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బహిరంగసభ జరిగింది. ప్రభుత్వం తరఫున మల్లు రవి ఈ సభలో ముఖ్య అతిధిగా పాల్గొని పేట్‌ బషీరాబాద్‌లోని 38 ఎకరాలు జె.ఎన్‌.జె.కు స్వాధీనం చేస్తామని హావిూ ఇచ్చారు.
కొత్త కమిటీ నేతృత్వం
జెఎన్‌జె హౌసింగ్‌ సొసైటీకి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 20023 జనవరిలో ఆదేశాలు జారీ చేశారు. పదేళ్ల తర్వాత ఈ సొసైటీకి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు 2024 మార్చి 3న జరిగాయి. కొత్తగా అయిదుగురు డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు (బిఓడి) చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి జెఎన్‌జెకు అండగా నిలిచారు. పేట్‌ బషీరాబాద్‌ భూమి జెఎన్‌జె సొసైటీకి అప్పగించేందుకు వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దాంతో జె.ఎన్‌.జె. జర్నలిస్టుల 17 సంవత్సరాల కల సాకారం అవుతోంది.


వేగంగా అడుగులు
2024 పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత రెవెన్యూ మంత్రి శ్రీనివాస్‌ రెడ్డిని జెఎన్‌జె హౌసింగ్‌ సొసైటీ ప్రతినిధులు, సభ్యులు అనేక పర్యాయాలు కలిశారు. పేట్‌ బషీరాబాద్‌ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఫైలును సిద్ధం చేయాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఫైలు సిద్ధమైన తర్వాత 2024 జులై రెండో వారంలో మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఫైలుపై సంతకం చేశారు. ఆ వెంటనే ఈ ఫైలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యాలయానికి వెళ్లింది. ముఖ్యమంత్రి కూడా తన ఆమోదముద్ర వేశారు. జూలై మూడో వారం శాసనసభ సమావేశాలు. ఆ వెంటనే ముఖ్యమంత్రి అమెరికా, కెనడా పర్యటనలకు వెళ్లి వచ్చారు. దాంతో కొద్ది జాప్యం జరిగింది.


22.08.2024 రోజు బిఓడి ప్రతినిధులు రెవెన్యూ మంత్రితో ఆయన ఛాంబర్‌లో చర్చించారు. ఆ వెంటనే రెవెన్యూ మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ఈ విషయంలో గంటసేపు చర్చించారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు మేరకు 2024 సెప్టెంబరు 8న రవీంద్రభారతిలో ఏర్పాటు చేసే సభలో పేట్‌ బషీరాబాద్‌లో భూమిని హౌసింగ్‌ సొసైటీకి స్వాధీనం చేసేందుకు సంబంధించిన మెమోను అందిస్తామని రెవెన్యూ మంత్రి ప్రకటించారు. తెలంగాణ విూడియా అకాడమీ చైర్మెన్‌ కె. శ్రీనివాస్‌ రెడ్డి సమక్షంలో ఇటీవల అధికారుల సమావేశం జరిగింది. 2024 సెప్టెంబరు 8న ఉదయం 11 గంటలకు రవీంద్రభారతిలో జర్నలిస్టులలో సమావేశం ఏర్పాటు చేసి మెమోను హౌజింగ్‌ సొసైటీలో వారికి అందచేస్తామని ప్రకటించారు. ఇందుకోసం చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.


రెండు ప్రభుత్వాల మధ్య తేడా!
కెసిఆర్‌ నేతృత్వంలోని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఆరు సంవత్సరాల్లో తీసుకోలేకపోయిన నిర్ణయాన్ని రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎనిమిది నెలల్లో తీసుకున్నది. టిపిసిసి అధ్యక్షుడిగా ఉండగానే రేవంత్‌రెడ్డి జర్నలిస్టులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే అమలు చేసారు.


సుప్రీం కోర్టు తీర్పు వెలువడ్డ తర్వాత కెసిఆర్‌ హయాంలో, రేవంత్‌రెడ్డి హయాంలో పరిశీలిస్తే నిర్ణయం తీసుకోవడంలో తేడా ఉంది. కెసిఆర్‌ తన హావిూ నిలబెట్టుకోలేకపోయారు, సుప్రీం తీర్పును అమలు చేయమని గతంలో కెసిఆర్‌కు జర్నలిస్టులు వినతిపత్రం అందచేసినా ధర్నాలు, ఆందోళనలు చేసినా అమలు చేయలేదు. పైగా ఈ భూమిని ఇతర సంస్థలకు కట్టబెట్టాలని కెసిఆర్‌ ప్రభుత్వం పావులు కదిపింది. టీం జెఎన్‌జెని అడ్డుకోవడంలో పేట్‌ బషీరాబాద్‌ భూమి ఇతరుల చేతులలోకి పోకుండా ఆగింది.


జర్నలిస్టు బంధు!
రేవంత్‌రెడ్డి జర్నలిస్టులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని జర్నలిస్టు బంధుగా పేరు తెచ్చుకున్నారు. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళిక (మానిఫెస్టో)లో కూడా ఈ అంశం పొందుపరిచారు. మానిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇచ్చిన హావిూలు కూడా దశల వారీగా అమలు అవుతాయని రాష్ట్రంలోని జర్నలిస్టులు నమ్ముతున్నారు. రవీంద్ర భారతి ప్రాంగణం రేపు జర్నలిస్టులు చేసే జయహో రేవంత్ నినాదాలతో మార్మోగనుంది.

(వ్యాస రచయిత సీనియర్‌ జర్నలిస్ట్‌, డైరెక్టర్‌, జెఎన్‌జె హెచ్‌ఎస్‌)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అభిమానం మితిమీరితే…

ఆంధ్రపురాణ రచయితకు వింత అనుభవం(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)ప్రముఖ రచయితలకు వింత అనుభవాలు ఎదురవుతుంటాయి....

ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే వాత పెట్టండి: సీఎం

ఆరోగ్య ఉత్సవాలకు రేవంత్ శ్రీకారం213 అంబులెన్సులకు పచ్చ జెండాహైదరాబాద్: రాష్ట్ర వైద్య,...

మధుశ్రీ కథలపై సమీక్షకు పుస్తక రూపం

అవధానుల మణిబాబు ప్రయత్నంపై ప్రశంసలుమాదారం: ఒక పుస్తకానికి సమీక్ష రాయడం పాత...

ఇంత రుణమాఫీ చరిత్ర దేశంలో ఉందా… హరీష్

రైతు పండుగలో సవాలు విసిరినా సీఎం రేవంత్కుట్రలు, కుతంత్రాలకు బెదిరేవాణ్ణి కాదుబి.ఆర్.ఎస్....