వెంకట నారాయణకు పొత్తూరి స్మారక పురస్కార ప్రదానం
హైదరాబాద్, మార్చి 05 : ఇటీవలి కాలంలో ఒక ముఖ్యమంత్రి నుంచి ఇంత మంచి వ్యాఖ్య వినలేదు. ఒక నవీన్ పట్నాయక్ మాదిరిగా తన పని తాను చేసుకునే పోయే సీఎం నూ చూడలేదు. టంగుటూరి ప్రకాశం పంతులు వంటి రాష్ట్రాధినేతలను ఇక ముందు చూస్తామన్న నమ్మకం అంతకంటే లేదు. కానీ… సభా ప్రాంగణం నిండలేదు అని చెప్పినప్పటికీ… విస్మరించి ఒక పురస్కార సభకు హాజరయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి. వచ్చినాయన మిన్నకున్నారా అంటే అదీ లేదు. హాలు నిండలేదని అన్నవారితో తాను ఏమన్నానో తన ప్రసంగంలో వివరించారు. దేశానికి దిశా నిర్దేశం చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మనం చూడాల్సింది సభా ప్రాంగణం నిండిందా లేదా అన్నది కాదు అన్నారాయన. పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక పురస్కారాన్ని అందించేందుకు ఏర్పాటైన ఈ కార్యక్రమంలో రేవంత్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన రావడం కొంత ఆలస్యమైంది. ఈ సందర్భంలో రేవంత్ చేసిన వ్యాఖ్య ఇది. జర్నలిజానికి ఇంతకుమించి ఊపిరిలూదే మాటలు ఏముంటాయి? రేవంత్ అక్కడితో సరిపెట్టకుండా సమకాలీన పాత్రికేయంపై ఆలోచింపచేసే వ్యాఖ్య సైతం చేశారు. తెలుగు జర్నలిజానికి కాపు కాసే వారు తగ్గిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ జర్నలిజం యవనికపై తెలుగు ప్రాశస్త్యం పెరగాలని ఆయన ఆకాంక్షించారు. అందుకు తెలంగాణ ప్రభుత్వ పరంగా చేయూతను అందిస్తామని తెలిపారు.
రేవంత్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షమే..
రాజకీయ నాయకులు మోర్ పవర్ అంటే జర్నలిస్టులు మోర్ ఫ్రీడమ్ అంటారు.
ప్రజా సమస్యలు వెలికి తెచ్చి పరిష్కరింపజేయడం జర్నలిస్టులకే సాధ్యం.
పరిపాలనలో అనుభవజ్ఞులు సూచనలు తీసుకుని మా ప్రభుత్వం ముందుకు వెళుతుంది.
వివిధ రంగాల్లో జాతీయ స్థాయిలో తెలుగువారి పాత్ర తగ్గుతోంది..
ఇది మనకు ప్రమాదకర పరిణామం.
జాతీయస్థాయిలో తెలుగువారి పాత్ర పెరగాల్సిన అవసరం ఉంది.
తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీపై ప్రభావితం చేసే వారిని ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది.
అంతకు ముందు రేవంత్ అంతర్జాతీయ పాత్రికేయుడు ఎస్. వెంకట నారాయణకు పొత్తూరి స్మారక అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో కె. రామచంద్ర మూర్తి, తెలంగాణ ప్రెస్ అకాడమీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఆంధ్ర జ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
పురస్కార స్వీకర్త వెంకట నారాయణ మాట్లాడుతూ, పొత్తూరి ఔన్నత్యాన్ని ప్రశంసించారు. ఆంధ్ర ప్రాంతీయుడు అయినప్పటికీ ప్రత్యేక తెలంగాణ గురించి వాదించారని అన్నారు. సిద్ధాంతాలతో ఆయన ఎన్నడూ రాజీ పడలేదని చెప్పారు. తాను తలపెట్టిన ఒక వార్త ప్రచురణకు యాజమాన్యం అంగీకరించకపోవడంతో రాజీనామా చేసి వెళ్లిపోయారని వెంకటనారాయణ తెలిపారు. తెలుగు నాట పుట్టినప్పటికీ తాను ఎక్కువ కాలం ఢిల్లీలోనే ఉన్నాను కాబట్టి తనను ప్రవాసాంధ్రునిగా అభివర్ణించుకున్నారు. రవీంద్రభారతిలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో పొత్తూరి కుమారుడి వెంకటనారాయణను సత్కరించారు. వెంకట నారాయణ జర్నలిజంలో అనితరసాధ్యమైన ఎత్తుకు ఎదిగారని కె. రామచంద్రమూర్తి చెప్పారు. 1979 ఎన్నికలలో ఇందిరా గాంధీ విజయం సాధిస్తారని చెప్పిన ఏకైక జర్నలిస్టు వెంకట నారాయణ మాత్రమేననని తెలిపారు.