ప్రతిబింబిస్తున్న ఆయన నిర్ణయాల ఫలాలు
పీవీ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
తండ్రి జ్ఞాపకాలను పంచిన పీవీ కుమారుడు ప్రభాకరరావు
దేశం విస్మరించిన నాయకుడు పీవీ: కేఆర్ మూర్తి
హైదరాబాద్, జనవరి 7: పదవికి వన్నె తెచ్చిన పీవీ… మన దేశానికి ఠీవి అన్న మాడుగుల నాగఫణి శర్మ గారి ప్రశంసను ఉదహరించారు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక ప్రసంగ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పీవీ గ్లోబల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. పీవీ చొరవతో స్థాపించిన రెసిడెన్షియల్ స్కూల్‌లో తాను చదువుకున్నాననీ, అదే తాను ఈ సభకు రావడానికి కారణమనీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. పీవీ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. భారత దేశ రజతోత్సవాల సమయానికి పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నారనీ, స్వర్ణోత్సవాల సమయంలో ఆయన ప్రధానిగా ఉన్నారనీ, వజ్రోత్సవాల సమయంలో ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాల ఫలాలను దేశం అనుభవిస్తోందనీ వివరించారు. ఇలా దేశం ప్రతి అడుగులోనూ పీవీ ముద్రలు కనిపిస్తాయన్నారు.
ఏ భాష వారితో అదే భాషలో సంభాషించిన పీవీ
నాకు పన్నెండేళ్ళప్పుడు ఓసారి మా తండ్రిగారిని గమనించా… ఆయన చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు. ఎవరూ ఏ భాషలో పలుకరిస్తే అదే భాషలో పీవీ సమాధానం ఇచ్చే వారు. ఇది చూసి, అందరూ ఆశ్చర్యపోయేవారు అంటూ పీవీ తనయుడు పీవీ ప్రభాకరరావు చెప్పారు. తండ్రితో ఉన్న అనుబంధాన్ని ఆయన వివరించారు. ఆయనకు గుండె శస్త్ర చికిత్స జరిగినప్పటి సంఘటను తెలియజేశారు. చికిత్స అనంతరం, కళ్ళు తెరిచిన బాపు… నేనెక్కడున్నాను అని అడిగారు. సర్జరీ బాగా జరిగిందనీ, అంతా బాగుందనీ చెప్పా. ఆయన చిరునవ్వు నవ్వి, రెండు రోజుల క్రితమే నేను మరణించాల్సింది… బతికాను అంటే ఇంకా నేను చేయాల్సిన పనేదో మిగిలిపోయిందన్న మాట అన్నారు. సరిగ్గా పది నెలలకు పీవీ ప్రధానమంత్రి అయ్యారు అంటూ ప్రభాకరరావు చెప్పగానే… సభ చప్పట్లతో మార్మోగిపోయింది. కుర్తాళం పీఠాధిపతిగా ఉండాలని కూడా అప్పటి పీఠాధిపతి కోరిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన చనిపోయిన దాదాపు 20ఏళ్ళ తరవాత ఢిల్లీలో ఆయనకు స్మారక మందిరం ఏర్పాటవుతోందన్నారు. దేశాన్ని గాడిలో పెట్టిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ఆవేదన వ్యక్తంచేశారు.
అధికారికంగా పీవీ సంస్మరణ సభ లేదు…
పీవీ మరణించిన తరవాత అధికారికంగా ఆయనకు సంస్మరణ సభను నిర్వహించలేదని ప్రముఖ పాత్రికేయుడు కె. రామచంద్రమూర్తి చెప్పారు. తాను హెచ్ఎమ్‌టీవీలో చేరిన తరవాత, ఈ సంగతిని తమ యజమాని వామనరావుతో ప్రస్తావించగా… నిర్వహణకు సహకరించారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా నిరాఘాటంగా సంస్మరణ సభను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది పీవీ ప్రభాకరరావు ముందుకు వచ్చారన్నారు. తొలి స్మారక ప్రసంగాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేశారన్నారు. పీవీ తీసుకున్న నిర్ణయాల కారణంగా దేశం ఈనాడు అద్వితీయ విజయాలను సాధిస్తోందన్నారు.