అతి పెద్ద వంటశాల
కుండలలోనే వంటకం
(డాక్టర్ వైజయంతి పురాణపండ)
సాగర తీరం… పచ్చటి ప్రకృతి…
దారి పొడుగునా …ఆట పాటలతో, సరదా కబుర్లతో పరుగులు తీస్తున్న పసిబాలలు…
దూరం నుంచి సముద్రాన్ని ఆకాశం తాకుతోందా అన్నట్టుగా కనిపించే క్షితిజరేఖ…
ఒకటేమిటి… అన్నీ… అన్నీ… అన్నీ… అన్నీ మధురానుభూతులే…
రండి పూరీ జగన్నాథుని దర్శిద్దాం…
భువనేశ్వర్ నుంచి 65 కి.మీ. దూరంలో ఉంది ‘పూరీ’. ఇది జగన్నాథుని ఆలయం. ఒక్క జగన్నాథుడే కాదు బలభద్రుడు, సుభద్ర కూడా జగన్నాథునికి ఇరుప్రక్కలా ఉంటారు. అన్నాచెల్లెళ్ల ఆత్మీయతానురాగాలకి, విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి పూరీ నిదర్శనం. అన్నాచెల్లెళ్లకు గుడి కేవలం పూరీలో మాత్రమే ఉంది. ‘సర్వం’ అంటే సమస్త ప్రాణులు లేక జీవులు. ‘జగన్నాథం’ అంటే ఆ జగత్తు అంతా నాథుని సృష్టే అని అర్థం. అందుకే జగన్నాథుడు అంతటా, అందరిలో ఉన్నాడనే భావాన్ని చెపμడం కోసం ‘సర్వం జగన్నాథం’ అన్నారు. ఈ జగన్నాథునికి 64 రకాల నైవేద్యాలు తయారుచేస్తారు.
ప్రయాణం
రైలులో ప్రయాణించేటప్పుడు మరో గంటలో భువనేశ్వర్ చేరతామనగా మనతో పాటు చిలకసరస్సు ప్రయాణం మొదలుపెడుతుంది. ఈ సరస్సు సుమారు ఇరవై నిమిషాల పాటు మనతోటే ఆప్యాయంగా ప్రయాణం చేస్తుంది. ఒక్కోచోట ఒక్కో అనుభూతి. సరస్సు దూరం నుంచి చూస్తే అది నీరా లేక దట్టమైన పొగమంచా అనిపిస్తుంది. సముద్రాన్ని మరిపిస్తుంది. అంత పెద్ద మంచినీటిసరస్సు అది. ఆ సరస్సు మనతో వస్తున్నప్పుడు అందులోని కొంగలు నిలబడి మనల్నే చూస్తుంటాయి. మనకి వీడ్కోలు పలుకుతాయి. మధ్యమధ్యలో చేపల్ని తింటూ వుంటాయి. ఈ ప్రయాణం ఆస్వాదించే వారికి మనోల్లాసాన్ని కలిగిస్తుంది.
చారిత్రకం
మనకు లభించిన తాళపత్రాలు – కళింగ ప్రభువైన అనంతవర్మ చోడంగ దేవుడు ఈ ఆలయ నిర్మాణం చేశాడని తెలియచేస్తున్నాయి. 1174 నాటికి ఒరిస్సా ప్రభువైన అనంగ భీమదేవుడు తరువాత పూర్తిగా ఒక రూపం తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న దేవాలయ ఆకారం ఈయన కాలంలో రూపుదిద్దుకున్నదే. 1558లో ఆఫ్ఘన్ రాజు కాలాపహాడ్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆ తర్వాత వచ్చిన రామచంద్రదేవుడు ఒరిస్సాలోని ఖుర్దాను స్వతంత్య్ర రాజ్యంగా ప్రకటించుకుని, ఆలయాన్ని సంప్రోక్షణ చేసి విగ్రహాలను పునః ప్రతిష్ఠించాడు.
ఆలయ నిర్మాణం
పూరీ దేవాలయం సుమారు 4 లక్షల చదరపు అడుగుల వైశాల్యం కలిగిఉంది. దీని ప్రాకారం చాలా ఎల్తైనది. ప్రాంగణంలో సుమారు 120 దేవాలయాలున్నాయి. ఈ ఆలయ నిర్మాణం ఆశ్చర్యం గొలుపుతుంది. సుశిక్షితులైన ఇంజనీర్లుగాని, క్రేన్లు కాని ఏ ఆధారాలు లేని కాలంలో అంత ఎల్తైన గోపుర నిర్మాణం ఆశ్చర్యం కలిగించకమానదు. ఒక్కొక్క రాయిని పైకి ఎలా తీసుకెళ్ళారా అనిపిస్తుంది. ఒరిస్సా పద్ధతిలో నిర్మాణం సాగిన ఈ ఆలయం నిర్మించిన శిల్పి అమరుడయ్యాడు. ప్రధాన ఆలయం చాపరేఖలా ఉంటుంది. విమాన స్థానంలో అష్ట నేముల (స్పోక్స్) తయారుచేసిన చక్రం ఉంటుంది. దీన్ని నీలచక్రం అంటారు. ఇది అష్టధాతువులతో నిర్మించబడింది. భగవంతునికి ఉదయం 5 గంటలకు ద్యార్పితం, మంగళహారతితో మొదలై రాత్రివరకు వివిధ రకాల సేవలు జరుగుతూ ఉంటాయి.
జాగ్రత్తలు
‘పండా’ (పురోహితులు) ల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. నేరుగా ఆలయంలోకి వెళ్ళి దేవుని దర్శించుకోవాలేగాని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్త పడితే పూరీ జగన్నాథ దర్శనం భక్తి ముక్తి దాయకం.
ఎలా వెళ్ళాలి?
దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలనుంచి భువనేశ్వర్‌కు రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. భువనేశ్వర్ నుంచి పూరీ బస్‌లో కాని, కారులో కాని గంటన్నరలో చేరుకోవచ్చు.
సమీపంలోనే కోణార్క్ దేవాలయం
పూరీతో పాటుగా భువనేశ్వర్‌లోని దేవాలయాలు, కోణార్క్ సూర్యదేవాలయం సందర్శిస్తే ఒరిస్సా యాత్ర పూర్తయినట్టే. పూరీలో శంఖంతో తయారు చేసిన గాజులు దొరుకుతాయి. పక్కనే ఉన్న పిపిలిలో ఒరిస్సా హస్తకళలకు సంబంధించిన ప్రత్యేకమైన వస్తువులు లభ్యమవుతాయి.
విశాలమైన గుడి
ప్రాంగణం చూస్తే చాలు జగన్నాథుడి దగ్గర ఎంత మందైనా ఆశ్రయం పొందవచ్చు అనిపిస్తుంది. ఇదొకటే కాదు, అతి పెద్ద వంటశాల ఉన్న ఈ ఆలయంలో నిరతాన్నదానం జరుగుతూనే ఉంటుంది. పూర్వం జగన్నాథుడు కుచేలుడికి సహాయం చేశాడని కథ మాత్రం చదివాం. ఇప్పుడు ఆ సహాయాన్ని ప్రత్యక్షంగా దర్శించవచ్చు. కుల, వర్గ విభేదాలు లేకుండా అందరికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం ఈ జగన్నాథుని ప్రత్యేకత. అందుకే సర్వం జగన్నాథం అంటారు.