ఇక్రిశాట్‌లో ప్రధాని మోడీ
స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొన్న ప్రధాన మంత్రి
హైదరాబాద్, ఫిబ్రవరి 5: స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన లోగోను ప్రధాని ఆవిష్కరించారు. తొలుత ఆయన ఇక్రిసాట్‌లో ఆవరణలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. ఫొటో గ్యాలరీని సందర్శించారు. రెయిన్ వాటర్ మేనేజ్‌మెంట్‌పై తయారు చేసిన వీడియోను తిలకించారు. మోడీ వెంట గవర్నర్ తమిళ్ ఇసై, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తొమర్, కిషన్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హాజరయ్యారు.
25 ఏళ్లలో విప్లవాత్మక మార్పులు
మరో 25ఏళ్ళలో దేశంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తొమర్ చెప్పారు. ఇక్రిశా్ ఇంత వరకూ జై జవాన్, జై కిసాన్ నినాదాలు మనకు తెలుసనీ, వాజపేయి వీటికి జై విజ్ఞాన్ జోడించగా… ప్రధాని మోడీ జై అనుసంధాన్ జత చేశారని తెలిపారు. ప్రధాని మాట్లాడుతూ ఇక్రిశాట్‌కు స్వర్ణోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. తొలుత రెండు పరిశోధన కేంద్రాలను ప్రారంభించారు. సంస్థ పరిశోధన, సాంకేతికత వ్యవసాయం సులభతరమై, సుస్థిరత సాధించడానికి ఉపకరించిందని మోడీ శాస్త్రజ్ఞులను ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగం ఆయన మాటల్లోనే…. సుస్థిరత సాధించడానికి ఉపకరించింది. విశ్వ అనుకూల ప్రజా ఉద్యమం కేవలం మాటలకే పరిమితం కాదు,
భారత ప్రభుత్వ చర్యలలో కూడా ప్రతిబింబిస్తుంది. భారతదేశ ప్రధాన దృష్టి అంతా వాతావరణ మార్పులనుంచి రైతులను రక్షించేందుకు మూలాలలోకి వెళుతూ, భవిష్యత్‌కు ముందడుగు వేయడంపై ఉంది. డిజిటల్ సాంకేతికత ద్వారా రైతులకు సాధికారత కల్పించేందుకు భారత దేశ కృషి నిరంతరాయంగా కొనసాగుతోంది. అమృత సమయంలో సమ్మిళిత వృద్ధిపై , వ్యవసాయంలో ఉన్నత వృద్దిపై భారత్ దృష్టి పెడుతోంది. వేలాది రైతు ఉత్పత్తి సంస్థలు ఏర్పాటుచేయడం ద్వారా, చిన్న, సన్నకారు రైతులను అప్రమత్తతో కూడిన శక్తిమంతమైన మార్కెట్‌శక్తిగా తీర్చిదిద్దాలని మేం కోరుకుంటున్నాం. మేం ఆహార భద్రతపైన, పౌష్టికాహార భద్రతపైన దృష్టిపెడుతున్నాం. ఈ దార్శనికతతో మేం గత ఏడు సంవత్సరాలలో ఎన్నో బయోఫోర్టిఫైడ్ వంగడాలను రూపొందించాం”
రెండు పరిశోధన శాలల ప్రారంభం
తొలుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ ( ఇంటర్నేషనల్ క్రాప్స్ రిసెర్చి ఇన్ స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఆరిడ్‌ట్రాపిక్స్ – ఇక్రిశాట్)లో మొక్కల సంరక్షణకు సంబంధించి వాతావరణ మార్పుల పరిశోధనా కేంద్రాన్ని , ఇక్రిశాట్ రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్‌మెంట్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ రెండు సదుపాయాలను ఆసియా, సబ్ -సహరాన్ ఆఫ్రికాలోని చిన్న రైతులకు అంకితం చేశారు. ఇక్రిశాట్ ప్రత్యేకంగా రూపొందించిన లోగోను, ఈ ఉత్సవాల సందర్భంగా తీసుకువచ్చిన స్మారక తపాలా బిళ్లను ప్రధానమంత్రి ఆవిష్కరించారు.
ఇక్రిశాట్ కు, దేశానికి రాగల 25 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని ప్రధానమంత్రి మోడీ చెప్పారు. నూతన లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిసాధనకు కృషి చేయాలన్నారు. భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వ్యవసాయానికి సహాయం అందించడంలో ఇక్రిశాట్ చేసిన కృషిని ప్రధాన మంత్రి ప్రశంసించారు.. నీరు, నేల నిర్వహణ , పంట రకాల మెరుగుదల, పంటల వైవిధ్యం, పశుగణ సమ్మిళితత్వం వంటివాటి విషయంలో ఇక్రిశాట్ పాత్రను ఆయన కొనియాడారు. రైతులను మార్కెట్ లతో అనుసంధానం చేసేందుకు అనుసరిస్తున్న సమగ్ర విధానాలను , పప్పుధాన్యాలను ప్రోత్సహించడాన్ని , ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో శనగ పంటను ప్రోత్సహించడంవంటి వాటిని ఆయన కొనియాడారు. “మీ పరిశొధనలు, సాంకేతికత వ్యవసాయం సులభతరం, సుస్థిరత సాధించడానికి ఉపకరించిందని నరేంద్ర మోదీ అన్నారు.
అట్టడుగు వర్గాలపై వాతావరణ మార్పుల ప్రభావం
సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన వారిపై వాతావరణ మార్పుల ప్రభావం అధికంగా ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు. అందువల్ల వాతావరణ మార్పులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రపంచానికి భారతదేశం చేసిన అభ్యర్థనను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. లైఫ్ స్టయిల్ ఫర్ ఎన్విరాన్ మెంట్ -ఎల్.ఐ.ఎఫ్.ఇ (లైఫ్) గురించి . పి-3 విశ్వ అనుకూల ప్రజా ఉద్యమాలు, 2070 నాటికి భారత్ నెట్‌జీరో లక్ష్యాల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ” ఈ విశ్వానికి అనుకూలమైన ప్రజా ఉద్యమం ప్రతి సమాజాన్ని, ప్రతి వ్యక్తిని వాతావరణ మార్పుల విషయంలో బాధ్యతతో వ్యవహరించేలా అనుసంధానం చేస్తుంది. ఇది కేవలం మాటలకే పరిమితం కాదు, ఇది భారత ప్రభుత్వ చర్యలలో కూడా ప్రతిబింబిస్తోంది “అని ప్రధానమంత్రి అన్నారు.
మారుతున్న భారత్‌లో మరో కోణం
మారుతున్న భారతదేశానికి సంబంధించి మరో కోణం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, డిజిటల్ వ్యవసాయం భారతదేశ భవిష్యత్ అని అన్నారు. ప్రతిభ కలిగిన భారతీయ యువత ఈ రంగంలో ఎంతో కృషి చేయగలదన్నారు. పంట అంచనా, భూరికార్డుల డిజిటైజేషన్, పురుగుమందులు, పోషకాలను డ్రోన్ల ద్వారా వెదజల్లడం వంటి వాటిలో సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ వాడకం పెరిగిందని ప్రధానమంత్రి అన్నారు . డిజిటల్ సాంకేతికత ద్వారా రైతులకు సాధికారత కల్పించేందుకు భారత్ కృషి నానాటికి పెరుగుతున్నదని ప్రధానమంత్రి తెలిపారు.
సమ్మిళిత వృద్ధిపై దృష్టి
అమృత్ సమయం సందర్భంలో భారత్ వ్యవసాయంలో ఉన్నతస్థాయివృద్ధితో కూడిన సమ్మిళత వృద్ధిపై దృష్టిపెడుతున్నదని అన్నారు. స్వయం సహాయక బృందాల ద్వారా వ్యవసాయ రంగంలో మహిళలకు మద్దతునివ్వడం జరుగుతోందన్నారు. జనాభాలోని ఎక్కువ మందిని పేదరికం నుంచి బయటపడేసి వారికి మెరుగైన జీవనాన్ని కల్పించగల శక్తి వ్యవసాయ రంగానికి ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఈ అమృత్ సమయం రైతులకు భౌగోళికంగా సంక్లిష్టంగా ఉన్న అంశాలలోనూతన అవకాశాలను కల్పించనున్నదన్నారు.
ద్వంద్వ వ్యూహంతో పనిచేస్తున్న భారత్
భారత్ ద్వంద్వ వ్యూహంతో పనిచేస్తున్నదని అంటూ ప్రధానమంత్రి, ఒకవైపు పెద్ద మొత్తంలో భూమిని నీటి పొదుపుద్వారా ,నదుల అనుసంధానం ద్వారా సాగులోకి తెస్తున్నామని అన్నారు. తక్కువ నీటిపారుదల ఉన్నచోట సూక్ష్మ నీటిపారుదల ద్వారా నీటి వాడకంలో సమర్ధతను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు. మరోవైపు వంట నూనెల విషయంలో స్వావలంబనకు జాతీయ మిషన్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ మిషన్ పామాయిల్ విస్తీర్ణాన్ని 6 లక్షల హెక్టార్లకు పెంచేందుకు లక్ష్యంగా నిర్ణయించుకుందన్నారు. ఇది భారతీయ రైతులకు ప్రతి స్థాయిలో ప్రయోజనకరం కానున్నదని ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రైతులకు మేలు చేస్తుందని అన్నారు. పంట కోత అనంతర అవసరాలను బలోపేతం చేయడం అంటే, కోల్డ్ చెయిన్ స్టోరేజ్ సామర్ధ్యాన్ని 35 మిలియన్ టన్నులకు చేర్చడం, లక్షకోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకున్న విషయాన్ని ప్రధానమంత్రి వివరించారు.