లడ్డూపై లడాయి

Date:

నాటి నుంచి నేటి వరకూ లడ్డూ ప్రసాదం కథ కమామిషు
(వాడవల్లి శ్రీధర్)

కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామి కొలువైన పవిత్ర క్షేత్రం తిరుమల. స్వామివారు అలంకార ప్రియుడే కాదు నైవేద్యప్రియుడు కూడా. అందువల్లే శ్రీవారికి ఎంతో ఇష్టమైన లడ్డూను నైవేద్యంగా పెట్టడమే కాదు భక్తులకు ప్రసాదంగా అందిస్తుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్. శ్రీవారిని దర్శించుకునేవారు తప్పుకుండా లడ్డూ రుచిస్తుంటారు… ఇంటికి పట్టుకెళ్లి బంధువులకు, స్నేహితులకు అందిస్తుంటారు. ఇలా స్వామివారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదాన్ని అనాదిగా ఎంతో నిష్టతో చేస్తుంటారు… అందుకే దీనికా పవిత్రత, ప్రత్యేకత. తిరుపతి వెళ్లాము అని చెప్పగానే గల్లీ నుండి ఢిల్లీ దాకా అందరూ అడిగే ప్రశ్న ఒక్కటే… లడ్డూ ఎక్కడ అని. తిరుపతి లడ్డూను పంచడంతోపాటు పుచ్చుకోవడమూ ఓ దర్జానే. వడ నుండి చక్కెర పొంగలి వరకు శ్రీవారి ప్రసాదాలు ఎన్నున్నా… లడ్డూకు మాత్రం తిరుగులేదు.
పల్లవుల కాలం నుంచి….
వెంకన్న ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. రెండవ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. ఆ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేశారు. అప్పుడే శ్రీవారికి ‘సంధి నివేదనలు (నైవేద్య వేళలు)’ ఖరారయ్యాయట. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు.

ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ‘తిరుప్పొంగం’ అనేవారు. తర్వాత సుఖీయం, అప్పం, వడ, అత్తిరసం, మనోహరపడి ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మరేదీ ఎక్కువ రోజులు నిల్వ ఉండేది కాదు. దాంతో దూరప్రాంతాలకు తీసుకెళ్లేందుకు వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలను విక్రయించడం ప్రారంభించింది. అప్పుడే లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించడం ప్రారంభమైందట. అది కాస్తా చివరకు 1940లో లడ్డూగా స్థిరపడింది.

పెరుగుతున్న లడ్డూ దిట్టం…
తిరుపతి లడ్డును తయారుచేసేందుకు ముడిసరుకులను పక్కా కొలతలతో ఉపయోగిస్తారు. ఏ పదార్థం ఎంత మోతాదులో వాడాలో తెలియజేసేదే దిట్టం. దీని ప్రకారమే తిరుమల లడ్డూ తయారీకి శనగపిండి, జీడిపప్పు, యాలకులు, ఆవు నెయ్యి, చక్కెర, ఎండుద్రాక్షలు, కలకండ ఉపయోగిస్తారు. దీనిని తొలిసారిగా టీటీడీ పాలక మండలి 1950లో నిర్ణయించింది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. దీనినే ‘పడితరం దిట్టం స్కేలు’ అంటారు. పడిని కొలమానంగా నిర్ణయించుకున్నారు. పడి అంటే 51 వస్తువులు. ఆ ప్రకారం ఉగ్రాణం (శ్రీవారి స్టోర్) నుంచి వస్తువులు ఇస్తారు. అన్న ప్రసాదాలకు సోలను పరిమాణంగా తీసుకుంటారు. అరసోల, పావుసోల కొలతలు కూడా ఉన్నాయి. ఈ ప్రమాణాల ఆధారంగా సరుకులను కేటాయిస్తారు. ఈ కొలమానాల ప్రకారం 5,100 లడ్డూలు తయారు చేయడానికి… ఆవు నెయ్యి 185 కిలోలు, శెనగపిండి 200 కిలోలు, చక్కెర 400 కిలోలు, జీడిపప్పు 35 కిలోలు, ఎండు ద్రాక్ష 17.5 కిలోలు, కలకండ 10 కిలోలు, యాలకులు 5 కిలోలు వినియోగిస్తారు. అంటే 5,100 లడ్డూల తయారీకి 852 కేజీల సరుకుల్ని వినియోగిస్తారన్నమాట. ఈ లడ్డూల తయారీలో వైష్ణవులదే కీలక పాత్ర. అనాదిగా బూంది తయారి నుండి లడ్డులు కట్టేవరకు వీరు సాంప్రదాయబద్దంగా ఆచారాలను పాటిస్తుంటారు. ఎంతో పవిత్రంగా భావించే లడ్డూల తయారీ కూడా అంతే పవిత్రంగా జరుగుతుంది.

పోటు (లడ్డూల తయారు చేసే వంటశాల) : తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో లడ్డులను తయారుచేసే వంటశాల వుంది. దీన్ని పోటు అంటారు. గతంలో కట్టెల పొయ్యిపై లడ్డూలు, ఇతర పదార్థాలు తయారుచేసేవారు…కానీ ప్రస్తుతం ఆధునిక సామాగ్రిని ఉపయోగిస్తున్నారు. ఇక ఈ పోటులో తయారుచేసిన లడ్డూలను భక్తులకు విక్రయించే కౌంటర్లకు తరలించేందుకు కన్వెయర్ బెల్టులు ఉపయోగిస్తున్నారు. ఈ పోటులో ప్రతినిత్యం లడ్డూలను తయారుచేస్తారు. ఈ పోటు గరిష్ట సామర్ధ్యం 8 లక్షల లడ్డూల తయారీ… కానీ ప్రతిరోజు భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకుని 2 నుండి 3 లక్షల లడ్డూలు తయారుచేస్తారు. బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక రోజుల్లో ఎక్కువ లడ్డులును తయారుచేస్తుంటారు.

తల్లి రుచి చూసిన తర్వాతే…
కొడుకు ఆకలి తల్లికి మాత్రమే తెలుసు. అందుకేనేమో, తల్లిప్రేమకు చిహ్నంగా మూలమూర్తి కొలువుండే గర్భాలయానికి శ్రీవారి పోటు(వంటశాల)కు ముందు శ్రీనివాసుని తల్లి వకుళమాత విగ్రహాన్ని నెలకొల్పారు. వాస్తు ప్రకారం ఆగ్నేయ మూల ఆలయంలో నిర్మించిన పోటులో ప్రసాదాలు తయారు చేస్తారు. వాటిని వకుళమాత ముందు కొంతసేపు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. లడ్డూ వడలు మొదలైన పనియారాల్ని ఆలయంలోని సంపంగి ప్రాకారం ఉత్తర భాగాన తయారు చేస్తారు.

మూడు రకాల లడ్డూలు…
తిరుపతి లడ్డూల్ని ఆస్థానం లడ్డు, కల్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డు అని పిలుస్తారు. ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారుచేసి, గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమ పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేస్తారు.

ఇక కల్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు కల్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు. ఇది చిన్న లడ్డూ కంటే రుచిగా ఉంటుంది. దీని ధర రూ.100. మూడవది ప్రోక్తం లడ్డూ. ఇదే చిన్న లడ్డూ. భక్తులకు లభించే లడ్డూ 175 గ్రాములు బరువుండే దీని ధర రూ.25.

1940 తొలిరోజుల్లో లడ్డూ (అప్పట్లో కల్యాణోత్సవం లడ్డూ సైజులో ఉండేది) రేటు ఎనిమిదణాలే. ఆ తర్వాత 2 రూపాయలకు విక్రయించేవారు. మెల్లగా అది నాలుగు, ఐదు, పదికి పెరిగింది. ఇప్పుడు ఏకంగా రూ.25కు చేరింది. రేటు పెరిగినా దానికున్న డిమాండ్ మాత్రం అంతా ఇంతా కాదు. రూ.50 నుండి రూ.75 వరకు చెల్లించినా లడ్డూలు దొరకని సందర్భాలు ఉన్నాయి.

రద్దయిన మిరాశి పద్ధతి
పూర్వం శ్రీవారి ప్రసాదాలు, పనియారాలను అర్చకులు, జీయంగార్లలో కొందరికి మాన్యాలిచ్చి తయారు చేయించేవారు. ఈ సంగతి అప్పటి నార్త్ ఆర్కాట్ జిల్లా (తిరుమల ఆ జిల్లా పరిధిలో ఉండేది) అధికారి జి.జె.స్టార్టన్ ఆలయ రికార్డుల్లో నమోదు చేశారు. 1933లో టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత, రోజురోజుకీ పెరుగుతున్న యాత్రికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, అప్పటి ఆలయ పేష్కార్ అన్నారావు కొత్త పద్ధతిని ప్రారంభించారు. దీని ప్రకారం లడ్డూలను తయారుచేసే మిరాశిదారులకు డబ్బుకు బదులు లడ్డూలనే ప్రతిఫలంగా ముట్టజెప్పేవారు. 51 లడ్డూలు తయారు చేస్తే 6 లడ్లు వారి సొంతం. మిరాశిదారులు వాటిని విక్రయించి నగదు పొందేవారు. 1950లో రోజుకు వెయ్యి లడ్లు తయారుచేసే మిరాశిదారులు 1990 నాటికి సుమారు లక్ష లడ్డూలు తయారుచేసే స్థాయికి చేరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో 1996, మార్చి 18న మిరాశి వ్యవస్థను రద్దు చేశారు.

కనుమరుగైన ఆనాటి రుచి
తిరుపతి లడ్డూ రుచి మారుతోందని భక్తులు అంటున్నారు. కాలంతోపాటు మార్పు సహజమే అయినా ఆనాటి పరిస్థితులు ఈ రోజుల్లో ఎక్కడున్నాయని అధికారులు అంటున్నారు. లడ్డూ తయారీలో వినియోగించే శెనగపప్పు (శెనగపిండి), చెరకు (చక్కెర)ను గతంలో సేంద్రీయ ఎరువులతో పండించేవారు. ప్రస్తుతం కృత్రిమ ఎరువులతో పండిస్తున్నారు. పొయ్యికింద కట్టెలకు బదులు గ్యాస్‌ను, బూందీని, చక్కెరపాకాన్ని కలపడానికి యంత్రం వాడుతున్నారు. లడ్డూల్ని యంత్రాలతో తయారు చేయడం వల్ల వాటిమీద ఉన్న చక్కెరపాకం కారిపోతోంది. ఫలితంగా ఒక్కరోజులోనే గట్టిపడిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న డిమాండుకు అనుగుణంగా లక్షలాది లడ్డూలు తయారు చేయాలంటే పాత పద్ధతిని అనుసరిస్తే సాధ్యమయ్యే పనేనా అంటారు అధికారులు. ఆవునెయ్యి, ముంత మామిడిపప్పు, ఎండుద్రాక్ష కంటే కలకండ, ఇతర పదార్థాల్ని ఎక్కువగా వినియోగిస్తుండటం కూడా మరో కారణం.

సబ్సిడీ ధరపై లడ్డూల విక్రయం
ప్రస్తుతం ఒక లడ్డూ తయారు చేయడానికి టీటీడీకి 25 రూపాయలు పడుతోంది. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని ఉచిత దర్శనానికి వెళ్లే వారికి సబ్సిడీ ధరపై రూ.10 చొప్పున రెండు లడ్డూలు, రూ. 50 సుదర్శన్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్లిన భక్తులకు టికెట్టు నిబంధనల కింద రెండేసి లడ్డూలు ఇస్తారు. ఇక ఆర్జిత సేవలో వెళ్లిన భక్తులకు ఆ సేవలో కేటాయించిన లడ్డూలు, ఇతర ప్రసాదాలు అందజేస్తారు. అదనపు లడ్డూలు కావాలంటే ప్రత్యేక కౌంటర్లలో రూ.100కు నాలుగు, రూ.50కి రెండు ఇస్తారు. అలాగే ఆలయ డిప్యూటీ ఈవో, రిసెప్షన్ డెప్యూటీ ఈవో, ఓఎస్‌డీ, ఆలయ పేష్కార్, పోటు పేష్కార్ సిఫారసుతో కోరినన్ని లడ్డూలు పొందవచ్చు. కల్యాణోత్సవం లడ్డూలు మాత్రం ఆర్జిత సేవల భక్తులకు మాత్రమే కేటాయిస్తారు.

లడ్డూకు మేధోసంపత్తి హక్కులు…
వెంకన్న లడ్డూకి పేటెంట్ హక్కులు సాధించుకునేందుకు చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ విభాగంలో దరఖాస్తు చేసింది టీటీడీ. మాజీ ఈవో కేవీ రమణాచారి లడ్డూ పేటెంట్ హక్కుల సాధన కోసం విశేషంగా కృషిచేశారు. లడ్డూ తయారీ విధానం, రుచి, నిల్వ సామర్థ్యం లాంటి అంశాలను ప్రధానంగా పరిశీలించిన జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ… వెంకన్న లడ్డూను తన జాబితాలో చేర్చింది. తిరుపతి లడ్డూకు మేధోసంపత్తి హక్కులు అందజేసినట్టు 2009, సెప్టెంబరు 18న ప్రకటించింది. తిరుమల లడ్డూ చాలా ప్రత్యేకమైనది. ఈ రుచి మరెక్కడా దొరకదు. దీంతో ఈ లడ్డుకు టిటిడి పేటెంట్ తీసుకుంది. 2009 లో తిరుమల లడ్డుకు పేటెంట్ లభించింది. దీంతో ఇతరులెవ్వరూ తిరుమల పేరుతో లడ్డూల తయారీ నిషేధించారు.

కమీషన్ల కక్కుర్తి తో ఆవునెయ్యి ని అస్మదీయులు సరఫరా చేసేటట్లు అధికారవర్గం అప్పటి టి.టి.డి అధికారులు నియమనిబంధనలు మార్చిచేశారు. సరైన తనిఖీలు, నాణ్యత పరీక్షలు చెయ్యకుండా మొక్కుబడిగా కానిచ్చి మమ అనిపించి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేశారు. అప్పటి నెయ్యి నమూనాలను పరిశీలించిన ప్రయోగశాల విడుదల చేసిన రిపోర్టు విస్తు పరిచే నిజాలను వెల్లడించింది. అనుమానాస్పద పదార్థాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఎన్‌డిడిబి క్యాల్ఫ్ ల్యాబ్‌లో కనుగొన్న అంశాలను సమర్పించారు. వీటిలో సోయాబీన్, ఆవునెయ్యి, ఆలివ్ నూనె, గోధుమ నూనె, మొక్కజొన్న నూనె, పత్తి గింజల నూనె, చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, జంతు కొవ్వు కూడా ఉన్నాయి, ఇవి సాంప్రదాయ ఆవు నెయ్యి నుండి చాలా దూరంగా ఉన్న మిశ్రమాన్ని సూచిస్తున్నాయి.

దిద్దు బాటు చర్యలు:
గత సర్కార్ హయాంలో.. ధర విషయంలో అంగీకారం కుదరకలేదు.. దీంతో గతేడాది సెప్టెంబరు నుంచి నెయ్యి సరఫరాను నిలిపి వేశారు. ఇటీవల 350 టన్నుల నెయ్యి సరఫరా చేయాలని టీటీడీ కోరిందని.. అందుకే మళ్లీ నెయ్యి సరఫరాను ప్రారంభించామని కర్ణాటక పాల సమాఖ్య అధికారులు తెలిపారు. నందిని దేశవాళీ ఆవు పాలతో చేసిన నేతిని ముఖ్యమంత్రి విడుదల చేశారు. టీటీడీ 2024-25కి సంబంధించి 350 టన్నుల నెయ్యిని కేజీ రూ.470 చొప్పున సరఫరా చేసేందుకు టెండరు ఖరారైంది. రెండు ట్యాంకర్లలో 20వేల కేజీల నెయ్యిని పంపిస్తున్నారు. ఇప్పటికే టీటీడీ ఈ నెయ్యి నమూనాలను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపినట్లు తెలుస్తోంది. నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే నెయ్యి సరఫరాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కర్ణాటక ప్రభుత్వం నెయ్యి సరఫరా చేస్తోంది. అక్కడి ప్రభుత్వం నందిని బ్రాండ్‌ నెయ్యి సరఫరాను టీటీడీకి మళ్లీ ప్రారంభించింది. ఈ మేరకు మొదటి లోడును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జెండా ఊపి ప్రారంభించారు. కర్ణాటక ప్రభుత్వం 2023-22 మధ్య మొత్తం 5 వేల టన్నుల నందిని నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారు

లడ్డూపై రాజకీయ లడాయి జరుగుతోంది. అధికార ప్రతిపక్షాలు దీనిపై రాద్దాంతం చేస్తున్నాయి. రానున్న బ్రహ్మోత్సవాలను దృష్టిలో వుంచుకుని ఈ లడాయికి స్వస్తి పలికి భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తిరుపతి పవిత్రతను కాపాడుతూ పరమ పావనమైన ప్రసాదాన్ని స్వచ్ఛంగా అందించి భక్తుల ఆదరాభిమానాలు చూరగొనాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అందరమొకటై చేయి చేయి కలిపి… జై జై గణేశ

శిల్ప కాలనీలో ఘనంగా గణేశ ఉత్సవాలు67 వేలకు పెద్ద లడ్డూ, 17...

Young India Skill university a role model for country

CM Revanth Appeals to Industrialists to play a key...

రాష్ట్ర సంపద పెంపునకు ఎం.ఎస్.ఎం.ఈ. పాలసీ-2024

విధానం లేకుండా అభివృద్ధి అసాధ్యంపాలసీ- 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డిహైదరాబాద్,...

యువ వికాసానికి ప్రజా ప్రభుత్వం ద్విముఖ వ్యూహం

ప్రజా పాలనా దినోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్హైదరాబాద్, సెప్టెంబర్ 17 :...