(ఎలిశెట్టి సురేష్ కుమార్, 9948546286)
వేటూరి రాసినట్టే..
ఆయన పాట పంచామృతం..
అక్షరాల ప్రవాహం..
భావాల సందోహం..
ఆ మహాకవి దూరమైనా
మన హృదయ తంత్రులను
మీటుతూనే ఉంటుంది అహరహం..!
మల్లె కన్న తెల్లన
మా సుందరరామ్మూర్తి
మనసు
తేనె కన్న తీయని
ఆయన పలుకు అన్నట్టు..
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను..
అంటూ మొదలైంది
ఆయన సినీ ప్రయాణం
ఆనాటి నుంచి ఆయన
కలమే అయింది
పాటకు ప్రమాణం..!
ఆయన పాట
ప్రేమకు పట్టాభిషేకం..
భక్తికి పుష్పాభిషేకం..
రౌద్రానికి రుధిరాభిషేకం..
శంకరాభరణంతో అఖిలాంధ్రను
అలరించినా..
అన్నమయ్యతో అఖిలాండకోటి
బ్రహ్మాండ నాయకునే మెప్పించినా..
దుర్యోధన దుశ్శాసన దుర్నిరీతి
లోకంలో దుండగులను ఎదిరించినా..
వేణువై వచ్చి భువనానికి
గాలి అయి వెళ్ళినా గగనానికి
వేటూరి కలం కలకలం..
జీవించి ఉండు కలకాలం..
అందులో సిరా..
వేలపాటలను
రాసేసింది బిరాబిరా..!
ఆ కలం..
మహా పండితుల
చేతి ఘటం..
అద్భుత గీతాలు
ఆయన చేతివాటం..
నవరసాలు ఆయన పాటకు
రుచులు గూర్చే గసగసాలు..
పదాలు ఇట్టే జాలువారే పాదరసాలు..
కొన్ని గీతాలైతే వానకురిసే
వేళలో నోటికి వేడిగా
అందే సమోసాలు..!
వలపు కోయిలలు పాడే
వసంతం వేటూరి
పాటకు సొంతం..
ఎడారిలో కోయిల
తెల్లారని రేయిలా
ఆయన ఇంటిముందే కాపు వేస్తుందేమో ఆ కలం నుంచి
జారే పాటను తానే ముందు ఆలపిద్దామని..
జగతికి జానకి కంటే
ముందుగా వినిపిద్దామని..
బాలుతో గొంతు కలిపి ఆలపిద్దామని..!
సుందర రామ్మూర్తి
ఆగమనం వెండితెరపై
తెలుగు పదానికి జన్మదినం
జానపదానికి జ్ఞానపథం..
ఆయన పాటల్లో తెలుగుతనం
తన సొగసులను
ఆరేసుకోబోయి పారేసుకుంది హరి హరి..
ఆ పదాలను
ఎత్తుకుపోయిన కొండగాలి ఉడుకెత్తిపోయిందేమో
పాటల ఖుషీతో..
తన స్వయంకృషితో
ఈ కలం మనిషి
పాటల రుషి అయ్యాడు..
ఆయన పాటల్లో గగనవీణ
స్వరజతులనాడగా..
అన్నమయ్య రీతులు
రామదాసు కృతులు..
అందంగా అమరి
అభిమానులకు
వీనులవిందుని
తెలుగు సినిమాకి
అయిదువేల పాటల పసందుని
అందించి ఆయనను
అమరుడిని చేశాయి..
సుందరరామ్మూర్తి కలం ఎదురులేని బాణం
తిరుగులేని దీక్షకు
అతడే ప్రాణం..!
మనసు పాటకు ఆత్రేయ
పెట్టింది పేరు..
సొగసు పాటకు
వేటూరి అక్షరాలే
కాసుల పేరు!
తెలుగు పాటకు
కోనంతా సందడి
చిగురాకుల తోరణాలు కట్టి
చిరుగాలి సన్నాయి
వినిపించిన
వేటూరి సుందర రామ్మూర్తి
జయంతి సందర్భంగా
ఆ మహాకవి రాసిన పాటలను మనసారా
నెమరువేసుకుంటూ..
(కవిత రచయిత విజయనగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్)