(డా విడి రాజగోపాల్, 9505690690)
ఓ సృష్టి కర్తా! ఓ బ్రహ్మ దేవా!
ఇదేమి న్యాయం ఇదేమి న్యాయం
సర్వప్రాణిని సృష్టించే నీకు
సమదృష్టిలేదెందుకయా!
పుర్రెలన్ని నీవే సృష్టిస్తావు
పుర్రెకో బుద్ధి ఎందుకిచ్చావయా
జాలి కరుణ బొత్తిగా లేని కొందరిని
నిలువెత్తు విషం నింపి కొందరిని
ఎక్కడ చూసినా గంజాయి మొక్కలే
తులసి మొక్కలే కరువైనాయి
చూశావా కొందరు దుర్మార్గులు
కామాంధులై కన్యపిల్లలపై విషంజిమ్ముతున్నారు
హత్యలు మానభంగాలు నిత్యం
మూడు పువ్వులు ఆరు కాయలుగా
సాగుతున్నాయి
కట్నాలతో వేధించే అత్త మామలు
లంచాలతో వేధించే అధికారులు
నోటు ఎరజూపి ఓటడిగే నాయకులు
విద్య పేరిట దోపిడి
వైద్యం పేరిట దోపిడి
పండించే రైతన్నలంటే అందరికి అలుసే
వారి సమస్యలు పట్టవు పాలకులకు
నదీజలాలు వినియోగం పై తగవులు
సరిహద్దు వివాదాలతో సైనికుల మరణాలు
పూట గడవక కొందరు
తిన్నది అరగక కొందరు
తలదాచుకోను గూడు లేక కొందరు
లంకంత కొంపల్లో కొందరు
నత్త నడక నడచే న్యాయస్థానాలు
గుండాల గుప్పిట్లో తగాదాల పరిష్కారాలు
నరకలోకంలో వీరిపై విచారణ ఉంటుందంట కదా! ఏమో అది ఎవరికి తెలుసు
ఇక్కడైతే చాకచక్యంగా తప్పించుకుంటారు
మా చట్టాలకు నిర్దోషులు దోషులుగా చిక్కుతారు
నీవే పరిష్కారం చూడవయ్యా
పాపం బిజీ గా ఉన్నా అప్పుడప్పుడూ
మంచి మూడ్ లో ఉంటావేమో
ఏరికోరి కొందరిని ప్రత్యెకంగా సృష్టించావు
గాన గంధర్వులనిచ్చావు వారి
కంఠమాధుర్యంతో ఓలలాడించడానికి
స్వార్థం ఇసుమంతైన లేని నిస్వార్థ పరులనిచ్చావు దేశం పరిపాలించమని
కవిపుంగవులనిచ్చావు కావ్యాలు సృష్టించమని
కళాకారులనిచ్చావు తమ కళతో మమ్మలరించమని
అందుకు ధన్యులమయా!
కానీ ఈ దుర్మార్గుల లీలలూ కనవా
దుర్యోధనుని సృష్టిస్తివి
ఏకంగా కురుక్షేత్రం తెచ్చాడు
రక్తం ఏరులై పారింది
కీచకుని సృష్టిస్తివి
వాని వారసులెందరో పుట్టారు
కాని భీమయ్యలు లేరే వారిని వధించ
ధర్మనిరతి గల ధర్మరాజును సృష్టించావు
కాని వారి వారసులు దీపం పెట్టి వెతికినా కానరారు ఎక్కడ
కాస్త ఈ తీరు చూడయ్య బ్రహ్మయ్య
ఇలా తారతమ్యాలెందు కయా!
ఏదో పరధ్యానంగా అలా బొమ్మను చేసి ప్రాణంపోసి తమాష చూడొద్ధయ్యా
ఓ బ్రహ్మయ్యా!
నీవు విసరివేసిన ఈ బొమ్మలు
చేసే కృత్యాలపై సారించు నీ దృష్టి
మంచి బొమ్మలను పడేయ్
చెడు బొమ్మల భరించలేమయా మేము
వాటిని నీ దగ్గరకూడ ఉంచమాక
మీ లోకం అయ్యేను వినాశనం
ఓ బ్రహ్మయ్యా! మా బ్రహ్మయ్యా!
(కవిత రచయిత రిటైర్డ్ డైరెక్టర్ ఆప్ మైన్స్ అండ్ జియాలజీ)
ఓ బ్రహ్మయ్య ఇటు చూడయ్య
Date: