సి.పి.ఆర్.తో ఆగిన గుండెలో చలనం
పాండిచేరి, జూలై 9 : అప్పిచ్చువాడు…వైద్యుడు.. ఎప్పుడు ఎడతెగక పారు ఏరు పద్యం గుర్తుందిగా… ఈ మూడింటిలో మధ్యన ఉన్న వైద్యుడు లేకపోతే మనుగడ కష్టమవుతుంది. డబ్బులున్న వైద్యుడు సమీపంలో లేకపోతే… ఆ పరిస్థితిని ఊహించలేం. కాకినాడకు చెందిన ప్రముఖ వైద్యుడు సకాలంలో స్పందించి కార్డియాక్ అరెస్ట్ అయిన వ్యక్తికి జీవం పోశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
గుండె మరణాలు ఇటీవల పెరగడం, హఠాత్తుగా గుండె ఆగిపోవడం ఈ మధ్య తరచుగా జరుగుతున్నది.
పశ్చిమబెంగాల్ భవానిపూర్ కి చెందిన రిటైర్డ్ ఉద్యోగి అనిరుధ్ దాస్ (71) తన కుటుంబ సభ్యులతో పాండిచ్చేరిలోని ఆరోవెల్లిలో ప్రఖ్యాత ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో, వాహనం ముందు సీట్లో కూర్చుని ముందుకు వాలిపోయారు. కుటుంబ సభ్యులు బాధ, ఆందోళనతో సహాయం చేయాల్సిందిగా కేకలు వేశారు. కాకినాడకు చెందిన ప్రముఖ సాంక్రమిక వ్యాధుల నిపుణులు డాక్టర్ యనమదల మురళీకృష్ణ కుటుంబంతో అదే ప్రాంతంలో ఉన్నారు. తక్షణం, వాహనం దగ్గరికి చేరుకొని గుండె ఆగిపోయిన (కార్డియాక్ అరెస్ట్ ) విషయాన్ని గుర్తించారు. అక్కడనే డ్రైవర్ సీటు వైపుకి పడుకో పెట్టారు. వెంటనే ఛాతి మధ్య భాగంలో గట్టిగా ఆగకుండా అదమటం మొదలుపెట్టారు. రెండు నిమిషాలలో, గుండె తిరిగి కొట్టుకోవడం మొదలై, రక్త ప్రసరణ ప్రారంభమైంది. పేషంటు స్పృహలోకి వచ్చారు. అట్లానే ముందు సీట్లోనే పడుకోబెట్టి అంబులెన్స్ ని పిలిచారు. తదుపరి వైద్యం కోసం పాండిచ్చేరిలో ఉన్న జిప్మర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు అనిరుధ్ దాసుని తరలించారు. కొన్ని పరీక్షల తర్వాత, మరింత వైద్యం అందడంతో అనిరుధ్ దాసు కోలుకొన్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో డాక్టర్ యనమదల మురళీకృష్ణ జిప్మర్ కి చేరుకుని పేషెంట్ ని పరామర్శించారు. సకాలంలో డాక్టర్ మురళీకృష్ణ కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సిపిఆర్) చేయడంతో దుష్పరిణామాలు లేకుండా పేషెంట్ కోలుకొన్నారని ఎమర్జెన్సీ విభాగంలోని వైద్యుడు డాక్టర్ ఎస్. సురేంద్ర అన్నారు.
సమయానికి తగిన విధంగా స్పందించి, తమ తండ్రి ప్రాణాన్ని రక్షించినందుకు అనిరుధ్ కుమార్తె అనీషా దాస్, అల్లుడు అభినవ్ డాక్టర్ మురళీకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనిరుధ్ త్వరగా కోలుకోవాలని డాక్టర్ యనమదల మురళీకృష్ణ ఆకాంక్షించారు.
పాండిచేరి జిప్ మర్ హాస్పిటల్ ఎమర్జన్సీ విభాగంలో అనిరుధ్ దాస్ ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తున్న డాక్టర్ యనమదల, జిప్మర్ వైద్యుడు డాక్టర్ ఎస్. సురేంద్ర