గ్లోబల్ మీడియా మానిటరింగ్ ప్రాజెక్ట్‌పై ప్రెజెంటేషన్‌లో పద్మజా షా
ఉత్సాహభరిత వాతావరణంలో ఎన్‌డబ్ల్యూఎంఐ 20 వ వార్షికోత్సవం
కొవిడ్ తరవాత వివిధ రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత తరుగుతూ వస్తోందని ఉస్మానియా యూనివర్శిటీ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగ ప్రొఫెసర్ పద్మజా షా ఆవేదన వ్యక్తంచేశారు. 1988 నుంచి ఆమె ఉస్మానియాలో పనిచేస్తున్నారు.
గ్లోబల్ మీడియా మానిటరింగ్ ప్రాజెక్ట్‌పై ఆమె ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేక వివరాలను తెలియజేసింది. ముఖ్యంగా మీడియా రంగంలో మహిళల సంఖ్య ఏ విధంగా పడిపోయిందీ ఆమె తెలియజేశారు. అనేక రంగాలో మహిళలు కనుమరుగైపోతున్నారంటూ దానికి సంబంధించిన డేటాను చూపారు. పద్మజా షా ప్రసంగం ఆలోచింపజేసేదిగా ఉంది. ఈ కార్యక్రమంలో మహిళా దినోత్సవాన్ని ఎంతో ఆనందంగా జరుపుకున్నారు.
ఎన్‌డబ్లూఎమ్ఐ లక్ష్యాలు, చేసిన పనులను ప్రెస్‌క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ సి. వనజ తన ప్రసంగంలో వివరించారు. మరో సీనియర్ జర్నలిస్టు మంజరి.. ఎన్‌డబ్ల్యూఎంఐ సమావేశాలకు వెళ్లిన ప్రదేశాలలోని తమ అనుభవాలను వివరిస్తూ మాట్లాడారు.
ఇండిపెండెంట్ జర్నలిస్టుగా తను ఎదుర్కొంటున్న ప్రశంసలతోపాటు, ఇబ్బందులను కూడా తులసి చందు మనసు విప్పి మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి 62 మంది మహిళా జర్నలిస్టులు హాజరయ్యారు. నిర్మాణాత్మక ఆలోచలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.
మహిళా శక్తి మరింత పెరగాలంటూ అందరూ ముక్తకంఠంతో అన్నారు. మహిళా జర్నలిస్టులంతా ఇదే విధంగా ముందుకు వచ్చి, ఒకే తాటి మీద నడుస్తూ, ఎవరికి ఇబ్బంది వచ్చిన అండగా నిలబడగలిగితే వీరి సంఖ్య మరింత పెరుగుతుందని అందరూ అభిప్రాయపడ్డారు.
ఎన్‌డబ్లు్యఎంఐ 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం వెనుక ఎంతోమంది మహిళా జర్నలిస్టుల కృషి ఉందన్నారు. గతంలో వాకా మంజుల, అత్తలూరి అరుణ, సరస్వతి రమ, యశోద, గాయత్రి… ఇంకా ఎంతోమంది అహర్నిశలు కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందులో మరింత కృషి చేసిన యశోదకు చిరుసత్కారం అందచేశారు.(Report: Vijayanthi Puranapanda)