రఘురామా! వైసీపీనా!!
ఓం బిర్లా నిర్ణయంతో అంతటా ఆసక్తి
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు వ్యవహారం అంతిమ దశకు చేరినట్లే కనిపిస్తోంది. ఈ దశలో కూడా ఎవరి పంతం నెగ్గుతుందనేది సస్పెన్సే. ఎడతెగని సస్పెన్స్‌కు తెరపడుతుందా లేదా… ఫిబ్రవరి 3న తేలిపోనుంది. ఫిబ్రవరి 5న ఎంపీ పదవికి తాను రాజీనామా చేస్తానని రఘురామకృష్ణంరాజు ఇప్పటికే ప్రకటించారు. ఈలోగానే ఆయనపై అనర్హత వేటు వేయించాలనేది వైసీపీ పంతం. అందుకు తగ్గట్టుగానే అడుగులు వేసింది. తాజాగా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ స్పీకర్‌కు లేఖ రాశారు. అనర్హత పిటిషన్ అంశాన్ని తేల్చాలని అందులో అభ్యర్థించారు. రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అందుకు తగిన ఆధారాలు ఉన్నాయనీ తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలలోనే రఘురామ సంగతి అటో ఇటో తేల్చేయాలని వైసీపీ కృతనిశ్చయంతో ఉంది. తాను రాజీనామా చేసేది లేదనీ, దమ్ముంటే సస్పెండ్ చేయాలి లేదా అనర్హత వేటు వేయించాలనీ రఘురామ కృష్ణంరాజు సవాలు విసురుతూ వచ్చారు.
రాజకీయాలంటే వ్యూహ ప్రతివ్యూహాలే. డాక్టర్ వైయస్ఆర్ ప్రియ శిష్యుడైన ఆర్ఆర్ఆర్ ఆయన కుమారుడైన వైయస్ జగన్మోహన్‌రెడ్డి పార్టీ టికెట్ తీసుకుని గెలవడంలో తప్పులేదు. గెలిచిన తరవాత, ఏదో సాకు చెప్పి, పార్టీకీ అధినేతకీ ఎదురుతిరగడం ముమ్మాటికీ తప్పే. ఇది అవకాశవాదం అవుతుంది. రాజకీయాలలో ఇవన్నీ సహజమేనని సర్దిచెప్పుకోవాలా? ఏమో అలాగే ఉంది. ఏది ఏమైనా… ఒక్క విషయం మాత్రం నిజం. ముఖ్యమంత్రిగారిని ఏమీ అనడం లేదనీ, తీసుకునే నిర్ణయాలనే తప్పు పడుతున్నాననీ రఘురామ కృష్ణంరాజు చెప్పుకుంటూ వచ్చారు. రాజధాని రచ్చబండ పేరుతో ప్రతిరోజు 12గంటలకు కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఏపీ ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. స్వపక్షంలోనే విపక్షంగా మారారు. పార్టీలో పంటికింద రాయి అయ్యారు. ఇలాంటి పరిస్థితిని ఏ పార్టీ అంగీకరిస్తుంది. సమయం కోసం వేచి చూసి, ఆర్ఆర్ఆర్‌ను ముప్పుతిప్పలు పెడుతోంది. రఘురామ చేస్తున్న విమర్శలు అలాంటివి మరి. టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌లో ఆయన పనిచేస్తున్నారనేది వైసీపీ నమ్మకం. మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుంచి రఘురామ తన విమర్శల దాడిని పెంచారు. ఈ క్రమంలో ఆయనపై సీఐడీ కేసు పెట్టడం.. తదితర పరిణామాలను అంతా గమనించారు.
సాధారణంగా ఏ పార్టీ అయినా తనపై విమర్శలు చేసే వారిని విడిచిపెట్టదు. ఇంతవరకూ వైసీపీ ఆయనపై ఎందుకు ఉదాశీనత చూపించిందనేది ప్రశ్నార్థకమే. అనర్హత పిటిషన్ వేసి వదిలించుకుంటే పోయేది. ఆ పని మాని ప్రతి విమర్శలతో సరిపెట్టింది. ఇక ఫిబ్రవరి 5న రాజీనామా చేస్తానని రఘురామ ప్రకటించడంతో ఆ అవకాశం ఆయనకు ఇవ్వరాదని నిర్ణయించుకున్నట్లు కనపడుతోంది. ఆయనపై పార్టీ ఫిరాయింపు ఫిర్యాదు చేసే అవకాశం లేదు. కారణం ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు.
లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ఈ నెల 3న జరగబోతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని వైసీపీ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. రఘురామపై అనర్హత వేటు వేయాలనేది దాని సారాంశం. ఈ లేఖ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రఘురామ అంశంపై తక్షణం సత్వర విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రఘురామపై వేటా… ఓటా ఆ రోజున తేలిపోతుంది. వేటు వేస్తే వైసీపీ పంతం నెగ్గుతుంది. కాదంటే రఘురామ మాటల దాడి మరింత పెరుగుతుంది. సాధారణంగా ఇలాంటి అంశాలలో పార్టీల పట్టే నెగ్గుతూ వస్తుంది. ఈ నెల 3 వరకూ వేచి చూడాల్సిందే.