(మాడభూషి శ్రీధర్)
ఇది మూల కవి ఆలోచన. అందరూ ఒప్పుకోవలసిన అవసరం లేదు. అమ్మకు నాన్నకు పోటీ పెట్టడం అవసరం లేదు. ఇద్దరూ కలిసి ఉంటేనే కుటుంబం, వసుధైక కుటుంబకం, నిజమైన జీవితం, అసలైన జీవనం. దంపతులు, తండ్రి, ధర్మపత్ని విడివిడిగా చూడలేము. ఏ కారణాలేమై ఉన్నా విడిపోతే అనురాగం పండదు. కనుక ఆలోచించాల్సింది ఇది.
నాన్న ఎందుకో వెనుకబడ్డాడు. ఎందుకో వెనుకబడ్డాడు. అమ్మ తొమ్మిది నెలలు మోస్తే! నాన్న పాతికేళ్ళు. రెండు సమానమే అయినా నాన్న ఎందుకో వెనుకబడ్డాడు!!! ఇద్దరి శ్రమ సమానమే అయినా నాన్న ఎందుకో వెనుకబడ్డాడు
ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ!
తన జీతమంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న.
ఏది కావాలంటే అది వండిపెడుతూ అమ్మ,
ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న
ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు… నాన్నెందుకో బాగా వెనుకబడ్డాడు.
ఫోన్లోను అమ్మ పేరే! దెబ్బతగిలినపుడు అమ్మా అని పిలవడమే.
అవసరం వచ్చినపుడు తప్ప మిగతా అప్పుడు గుర్తు రానందుకు నాన్నేమైనా బాధపడ్డాడా? ఏమో!
ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమని పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో బాగా వెనుకబడ్డాడు
అమ్మకి, మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు, బట్టలు.
నాన్న బట్టలకు దండెం కూడా నిండదు.
తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనుకబడ్డాడు.
అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు! నాన్నకి బంగారు అంచు ఉన్న పట్టు పంచె ఒకటి.
కుటుంబం కోసం ఎంత చేసినా తగినంత గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకో వెనుకబడ్డాడు.
పిల్లల ఫీజులు, ఖర్చులు ఉన్నాయి, ఇప్పుడు ఈ పండుగకు చీర కొనద్దు అనే అమ్మ…
ఇష్టమైన కూరని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న…
ఇద్దరి ప్రేమ ఒకటే అయినా అమ్మ కంటే నాన్న చాలా వెనుకబడ్డాడు.
వయసు మళ్ళాక.. ‘అమ్మ అయితే ఇంట్లోకి పనికి వస్తుంది, నాన్న అయితే ఎందుకూ పనికి రాడు’ అని మేం తీర్మానం చేసుకున్నపుడు కూడా వెనుకబడిందీ నాన్నే.
నాన్న ఇలా వెనుకబడి పోవడానికి కారణం.
ఆయన ఇలా అందరికీ వెన్నెముక కావడమే.
వెన్నెముక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం…
బహుశా నాన్న వెనుకబడి పోవడానికి గల కారణం ఇదేనేమో.
పితృ దినోత్సవ శుభాకాంక్షలు!
విష్ణుః పితృ రూపేణ అంటుంది వేదం.
ఒక మిత్రుడు ఈ విధంగా ఈ విలువ గురించి వివరించారు. నాన్న నిలువెత్తు త్యాగాల రూపు. ఎన్నో కష్టాల తాలిమి. బిడ్డల క్షేమం, ఉన్నతి కోసం ఎంతటి శ్రమకైనా వెనకాడడు తండ్రి. తన సర్వస్వాన్ని అర్పించి, కుటుంబ క్షేమంలోనే తన ఆనందం చూసుకుంటాడు జనకుడు. అంతటి మహోన్నత త్యాగమూర్తి గురించి సనాతన ధర్మం ఏం చెబుతోందయ్యా అంటే..
లాలయేత్ పంచవర్షాణి దశ వర్షాణి తాడయేత్
ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్
బిడ్డకు అయిదేళ్లు వచ్చేవరకూ తండ్రి లాలించి, వాత్సల్యం చూపించాలి. ఆ తర్వాత పదేళ్లు… పిల్లలు మంచి మార్గంలో నడిచే విషయంలో దండించటానికీ వెనకాడకూడదు. పదహారేళ్లు రాగానే సంతానంతో మిత్రుడిలా మెలగాలి. వేదం ‘పితృ దేవోభవ’ అంటూ తండ్రిని దైవంగా చూడాలని చెబితే, శాస్త్రాలు ఆయనకి విష్ణు స్థానమిచ్చాయి. జగత్తును పాలించి పోషించేది విష్ణుమూర్తి. అందువల్ల కుటుంబాన్ని పోషించే తండ్రిని విష్ణు సమానుడిగా చెప్పాయి.
బిడ్డల కోసం తండ్రి చేసే త్యాగాలు వెలకట్టలేనివి. తాను ఎన్ని కష్టాలు అనుభవించైనా పిల్లల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని దివారాత్రాలు శ్రమిస్తాడు నాన్న. ఆ క్రమంలో తన గురించి తను పూర్తిగా మర్చిపోతాడు. అయినా, నాన్న పడే కష్టం బయటికి కనిపించదు. అందుకే, ‘అమ్మ తొమ్మిది నెలలు మోస్తే! నాన్న జీవితాంతం మోస్తాడు.
అందుకే తనికెళ్ల భరణి గేయం వినవల్సిందే.
ఇదేనేమో బహుశా నాన్న వెనుకబడి పోవడానికి గల కారణం.
(తెలుగు రచయిత నేను కాదు. కాని తనికెళ్ల భరణి చాలా బాగా పాడి మేమంతా పాడి సంతోషించాం. సందర్భం కనుక చాలా గొప్పది. వినండి చూడండి అర్థం చేసుకోండి)
(Author is Professor in Mahindra School of Law and former Commissioner, Central RTI)