టీడీపీ మహానాడులో బాలకృష్ణ పిలుపు
ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం ఇది
తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ పేరుకు చిరస్థాయి
ఒంగోలు, మే 28: నువ్వు నేను కలిస్తే మనం… మనం మనం కలిస్తే జనం.. జనం జనం కలిస్తే సునామీ అన్నారు నటుడు బాలకృష్ణ. ఒంగోలులో ఏర్పాటైన మహానాడు బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రపంచ పటం మీద తెలుగు సంతకమై నిలిచిన ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం కావడమే ఈ రోజు విశేషమన్నారు. ప్రపంచంలో ఎందరో పుడుతుంటారు.. గిడుతుంటారనీ, నువ్వు ఎదగాలంటే నీ దారిలో నువ్వు నడవాలనీ ఎన్టీఆర్ తనతో అనేవారన్నారు బాలకృష్ణ. మహోన్నత ఆశయంతో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. రైతుగా, సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా కోట్లాదిమంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. మాయాబజార్‌లో ఆయనను శ్రీకృష్ణునిగా చూసి, ప్రజలు తమ మనోఫలకాలపై ముద్రించుకున్నారని చెప్పారు. తెలుగు వెలుగును ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఈ ప్రపంచంలో అందరు మహానుభావులు కాలేరని చెప్పారు. ఏ చిత్రంలో ఏ పాత్ర ధరించినా… అందులో ఒదిగిపోయేవారని తెలిపారు. దేవుడు గుడిలో ఉంటాడు.. విగ్రహం నడివీధిలో ఉంటుందన్నారు. ఎన్టీఆర్‌ను చూస్తే ఇంత మంచి వాడు ఇంకెక్కడైనా ఉన్నారా అనిపిస్తుందన్నారు. తెలుగు ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, నేనున్నానంటూ ముందుకు వచ్చిన సంస్కర్త ఎన్టీఆర్ అని బాలకృష్ణ చెప్పారు. శ్రామికుడి చెమటనుంచి, కార్మికుడు కండ నుంచి పుట్టింది దేశం అన్నారు. సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్ళు అని నిరూపించిన మహానుభావుడు నందమూరి అన్నారు హిందూపురం ఎమ్మెల్యే.
ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచారని చెప్పారు. ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలను చేపట్టారు ఎన్టీఆర్ అన్నారు.
దుర్మార్గమైన పాలన ఇది
ఇప్పుడు చూస్తున్నాం మన రాష్ట్రాన్ని ఎలా ఉందో…. విద్యుత్తు చార్జీలు పెంచారు.. చెత్తపై పన్ను వేశారు. ఆర్టీసీ రేట్లు పెంచారు. ప్రజలకు ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. గురజాడ అప్పారావుగారు అన్న దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న నినాదం నేడు వ్యతిరేకంగా మారిందన్నారు. దేశమంటే మట్టిగా మార్చారు.
మన భావి తరాల గురించే మేం తపన పడుతున్నామని బాలకృష్ణ తెలిపారు. ఓటంటే నోటు కాదు… ఓటుతో ముడిపడి ఉంది ఒరవడి.. అంటూ స్ఫూర్తినింపారు బాలకృష్ణ. మీరంతా వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేసి, రాష్ట్రానికి పునర్వైభవం తేవాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.
ప్రభంజనంలా మారాలి – మార్పు సృష్టించాలి
Date: