గదిలో డబల్ బారెల్ తుపాకీతో మేనేజర్

1
362

వార్తకు – కామన్ సెన్స్ కూ లింక్
ఈనాడు – నేను: 6
(సుబ్రహ్మణ్యం వి.ఎస్.కూచిమంచి)

ఏప్రిల్‌ 26, 1989

పి.ఎస్‌.ఆర్‌. గారు నేను రాసిన కాపీ చేతికిచ్చారు. ముందు పేపర్లో ప్రచురితమైన వార్త చదివాను. కారు బోల్తా ఏడుగురి దుర్మరణం.. శీర్షిక. వార్తలో సామర్లకోట-కాకినాడ మార్గంలో కారు బోల్తాపడిన ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.. అనేది ప్రారంభ వాక్యం. కాసేపు అర్థం కాలేదు. తప్పెలా జరిగిందో… ఎక్కడ జరిగిందో.. శీర్షిక కూడా నేను పెట్టిందే. పొరపాటయ్యిందని అంగీకరించా. నీదొక్కడిదే కాదులే సుబ్రహ్మణ్యం తప్పు నాది కూడా ఉంది. గట్టిగా చదివినా దొరకలేదు. జాగ్రత్తగా చూసుకుంటూ ఉండంటూ.. మంద్రస్వరంతో హెచ్చరిక చేశారు. సరేనంటూ పనిలో పడ్డా.

డబుల్‌ బ్యారల్‌ గన్‌

ఓ గంటకి మేనేజర్‌ నుంచి పిలుపు. ఎందుకయి ఉంటుంది? తప్పుంది కదా! ఆయన కూడా ఓ సలహా ఇస్తారనుకుంటాననుకుంటూ లేచా. మా డెస్కుకు ఎడమ వైపునే మేనేజర్‌ గది. టేకుతో నగిషీలు చెక్కిన పెద్ద తలుపు. అప్పుడే తీసుకొచ్చి బిగించారా అన్నట్లు తళతళలాడిపోతోంది. కొల్లి వెంగళనీడు, మేనేజర్‌ అని తలుపుపై ఇత్తడి అక్షరాలు. బాయ్‌ తలుపు తెరిచాడు. లోపల్నుంచి.. చల్లటి గాలి మొహానికి తగిలింది. ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యింది. తమాయించుకుని లోపలికి అడుగుపెట్టాను. తలుపు మూసుకుంది. మరోసారి ఉలిక్కిపడ్డా.. ఒళ్ళంతా చెమటలు పట్టింది. కారణం. తన కుర్చీదగ్గర నిలబడిన ఓ ఆజానుబాహుడు.. డబుల్‌ బ్యారల్‌ గన్‌ గురిచూస్తూ కనిపించాడు. అయ్యబాబోయ్.. తప్పు జరిగితే కాల్చేస్తారా! ఏమిటనుకుంటూ.. చిన్నగా దగ్గాను. గోల్డ్ ఫ్రేమ్‌ కళ్ళాద్దాలు ధరించిన ఆయన సీరియస్‌ గానే చిరునవ్వు నవ్వారు. నువ్వేనా సుబ్రహ్మణ్యం.. కూర్చో అన్నారు. చిన్న రాడ్‌ చివర ముఖమల్‌ క్లాత్‌ చుట్టి ఉంది. దాన్ని పుచ్చుకుని గన్‌ బ్యారెల్‌ను శుభ్రం చేయడం మొదలు పెట్టారు మళ్ళీ. కొద్దిసేపటికి పి.ఎస్‌.ఆర్‌ కూడా లోపలికి వచ్చారు.
అతను సరిగ్గానే రాశాడండి.. తప్పు నాదే… వార్త బాగా రాశాడనే ఉద్దేశంతో కొంచెం అలసత్వం అంటూ ఆయన వివరణ ఇచ్చారు. నిన్ను పిలిచింది అందుకోసం కాదులే.. గన్‌ చూసి మనవాడికి ఏసీలో కూడా చెమటలు పట్టడం చూస్తావని.. అంటూ నవ్వారు వెంగళనీడు గారు. డోన్ట్‌ వర్రీ మొదటి రోజే కదా.. రైట్‌ కేర్‌ఫుల్లీ అంటూ వాతావరణాన్ని తేలికచేశారాయన. అనంతరం టీ తెప్పించారు. ఈలోగా నా వివరాలు అన్నీ అడిగి తెలుసుకుని.. సంపాదకీయ నేపథ్యం ఉందన్న మాట. గుడ్‌ అంటూ భుజం తట్టారు.

ఈలోగా మోటూరి వెంకటేశ్వర రావుగారుకూడా గదిలోకొచ్చారు. ఏంటి శీను.. మొదటి రోజే భయపెట్టేస్తున్నావా..అంటూ నా వెన్ను తట్టారు. కాసేపు అవీ ఇవీ మాట్లాడుకున్న తరవాత బయటికొస్తుండగా.. వెంగళనీడుగారి ప్రశ్న … కారులో ఒకేసారి ఎంతమంది ప్రయాణం చేయొచ్చు…
ఐదుగురండి… నా సమాధానం
మరి ఏడుగురు ఎక్కడినుంచొచ్చారు.
జస్ట్‌ కామన్‌ సెన్స్‌ పాయింట్‌.. మిస్సయ్యావు…అదే తప్పు… అన్నారు.

ఇది మొదటి పాఠం… వార్త రాయడమే కాదు. ఇంగిత జ్ఙానమూ జోడించాలి.. బుద్దికుశలతకి… అప్పుడే వార్తకి పరిపూర్ణత చేకూరుతుంది.

ఇక అక్కణ్ణుంచి.. జాగ్రత్తగా వ్యవహరిస్తూ.. వార్తలు రాస్తూ వచ్చాను. కొన్నాళ్ళకి స్పెషల్‌ అయిటమ్స్‌కూడా ఇవ్వడం మొదలయ్యింది. ఇంట్రోలు రాయించుకునేవారు. స్వతహాగా.. బ్రాహ్మణ కుటుంబంనుంచి వచ్చి ఉండడంతో పురాణాలపై కొద్దిపాటి అవగాహన ఉంది. దాన్ని ఆలంబనగా చేసుకుని.. లీడ్స్‌ రాసేవాడిని.

ఆ తర్వాత కొంతకాలానికి ఉమ్మడిగా ఉన్న ఉభయగోదావరి జిల్లాలు తూర్పు, పశ్చిమ గోదావరి డెస్కులుగా రూపాంతరం చెందాయి. తూర్పు గోదావరికి పి.ఎస్‌.ఆర్‌., పశ్చిమ గోదావరికి ఆచంట సుదర్శన రావుగారు ఇన్ఛార్జులు (నేటి ఈనాడు భాషలో.. బాధ్యులు). మా డెస్కులో నవీన్‌ గారు,

నేను, అయ్యగారి శర్మగారు,

కొమ్మినేని లక్ష్మీనారాయణ(ఎన్‌ఎమ్‌ఆర్‌ ఉద్యోగి), జానకిరామయ్య(ఆర్నెల్ల తర్వాత బాగా రాయడం లేదని శిక్షణకాలాన్ని పొడిగించలేదు). మధ్యాహ్నం 1.30 నుంచి రాత్రి 8.30 గంటలదాకా డ్యూటీ. ఇంటికెళ్ళేటప్పటికి తొమ్మిది. తినడం పడుకోవడం.
నేనందుకున్న తొలి జీతం 800 రూపాయలు. ఇంటికి పంపాల్సిన అవసరం లేదు. ఉన్న దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడమే. ఆర్నెల్ల తర్వాత ట్రైనింగ్‌ను మరో ఆర్నెల్లు పొడిగించి జీతం 1000 రూపాయలు చేశారు. నా రూములో న్యూస్‌ టైమ్‌ సబ్‌ ఎడిటర్‌ డి. శ్రీనివాసులు ఉండే వారు. ఆయన ప్రస్తుతం కర్నూలులో హిందూ రిపోర్టర్‌. ఇప్పుడు సాక్షి మీడియాలో కె.ఎస్.ఆర్. లైవ్ షో నిర్వహిస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు గారు రిపోర్టింగ్‌ బ్యూరోలో ఉండేవారు. ఆయన కింద సురేష్‌గారు. సీతారామ్‌. కొమ్మినేని గారు ఒక్కక్షణం ఖాళీగా ఉండేవారు కాదు. వార్తలు రాసుకుంటూనే.. ఓ కన్ను టెలిప్రింటర్‌ రూమ్‌ పైనా వేసి ఉంచేవారు. అది ఏసి గది. జిల్లాల నుంచి టిపిలో కొట్టిన వార్తలు వచ్చేవి. వాటిని ఆ సెక్షన్‌లో ఉన్న ఉద్యోగి కత్తిరించి, చిన్న డోర్‌ తీసి, బుట్టలో వేసేవాడు.. వెంటనే కొమ్మినేని గారు..వాటిని తీసుకుని ఆసాంతం చదివి… ఏ డెస్కుకు ఇవ్వాల్సినవి వారికి పంపేవారు. ఒకవేళ బాయ్‌ అందుబాటులో లేకపోతే ఆయనే తీసుకొచ్చి ఇచ్చేవారు. ఎందుకండి మీరు తెస్తారు.. పిలిస్తే నొనొస్తాగా అంటే.. మనది దిన పత్రిక ఒకరొస్తారని వేచి చూడకూడదు. ప్రతిక్షణం విలువైనదే. ఎక్కడి పని అక్కడ అయిపోవాలి.. అన్నారు. (ఇది రెండో పాఠం).

No Entry
ఓ రోజు అత్యవసరమైన వార్త వస్తుంది టిపీ రూమ్‌లోకి అడగమంటే.. వెళ్ళాను. తలుపు తోశానో.. లేదో.. ఎవరది.. లోపలకి రాకూడదని చెప్పానా అంటూ ఓ కంఠం ఉరిమింది. విషయం చెప్పాను. అంత అర్జంటయితే నేనే తీసుకొస్తా… ఇంకెప్పుడూ లోపలకి రావద్దు హెచ్చరించాడాయన. ఊ కొట్టి బయటికొస్తూ… మీ పేరేంటండి అనడిగా… పిచ్చేశ్వరరావు.. చెప్పాడాయన చాలా సీరియస్‌గా… ఇదంతా గమనిస్తున్న కొమ్మినేనిగారు నన్ను చూసి నవ్వారు. కంగారు పడకు ఆయనంతే. ఆ గది ఆయన సామ్రాజ్యమనుకుంటాడు అంటూ.. ఎందుకయ్యా.. కొత్తవాళ్ళని బెదిరించేస్తున్నావని ఆయనతో కొంచెం గట్టిగానే అన్నారు.

కలకలం

మరుసటి రోజు పశ్చిమ గోదావరి జిల్లా డెస్కులో చిన్నపాటి కలకలం. ఉన్నట్లుండి ఓ సబ్‌ ఎడిటర్‌ ఆఫీసుకి రావడం మానేశారు. మోటూరి వెంకటేశ్వరరావుగారి దగ్గర నుంచి ఆచంట సుదర్శనరావు గారి దాకా దీని గురించి చాలా హడావుడి పడ్డారు.

ఎంతగాఅంటే ఇంటికెళ్ళి ఆయన గడ్డం పట్టుకుని బతిమాలేటంతగా… ఇంతకీ ఈ ఎపిసోడ్‌లో నా పాత్ర ఏమీ లేకపోయినప్పటికీ మీక్కొంచెం సస్పెన్స్‌ ఉండాలి కదా… అందుకే మిగతాది రేపు….. నా వివాహానికి మొదటి అడుగు.. ఎలా పడింది.. ఆ వివరాలు కూడా చెబుతా….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here