పాత గృహ రుణాల లబ్ధిదారులపై ఓటీఎస్ పేరిట వత్తిడి
ఏపీ ప్రభుత్వంపై ముద్రగడ విమర్శలు
గతంలో చంద్రబాబు వైఖరిపై నిప్పులు
ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి చురకలు
ముద్రగడ ధోరణికి విస్తుపోతున్న రాజకీయం
ఉద్యోగుల పట్ల సానుభూతి చూపాలని వినతి
కాపు నేత అసలు వైఖరికి కారణమేమిటి?
కిర్లంపూడి, జనవరి 22: ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం లేఖను సంధించారు. ఓటీఎస్ పేరుతో వసూళ్ళకు పేదలను వత్తిడి చేయడం సరికాదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడును విమర్శిస్తూ ఘాటైన లేఖను రాసిన ముద్రగడపై ఆయన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారేమో అనే అనుమానాలు పొడసూపాయి. కొందరైతే బహిరంగంగానే ముద్రగడపై విమర్శలకు దిగారు. ఈ క్రమంలో ఆయన ఓటీఎస్ వసూళ్ళను వ్యతిరేకిస్తూ లేఖ రాయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ముద్రగడ పద్మనాభం తీరును ఎవరూ అంచనా వేయలేమని కొందరు అంటున్నారు. ఇంతకూ ముద్రగడ రాసిన లేఖలో ఏముంది. లేఖ పూర్తి పాఠం…
గౌరవనీయులు వైయస్ జగన్మోహన్ రెడ్డిగారికి ముద్రగడ పద్మనాభం నమస్కారాలు. గత ప్రభుత్వాలు పేదవారి గృహాలకు ఇచ్చిన అప్పులను ఓటీఎస్ పేరుతో వసూలు చేయమని అధికారులు విపరీతంగా వత్తిడి ఇస్తున్నారండీ. ఇలా వత్తిడి చేయడం ఎంతమాత్రం న్యాయం కాదండి. ఆ రోజున పేదవారికిచ్చిన రుణాలు కట్టనవసరం ఉండదని వారు భావించడంతో పాటు అప్పటి ప్రజాప్రతినిధులు కూడా ఈ రుణాలను తప్పని సరిగా కట్టాలని చెప్పిన సందర్భాలు కూడా లేవండి. అప్పటి ప్రజాప్రతినిధుల జాబితాలో నేను కూడా ఒకడినండి.
1978 నుంచి ఉమ్మడి ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎందరో గౌరవ కలెక్టర్లు నేను అడిగిన ఇళ్ళు శాంక్షను ఇవ్వడమే కాదండి, ఎవరికి ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అదే చోట ఇళ్ళు కట్టుకునే విధానం నేను తీసుకొచ్చానండి. అలాగే, స్థోమత కలిగిన వారు రెండు గదులతో పాటు, రెండు వరండాలు క్టుకునే విధానం కూడా నేను ప్రవేశపెట్టానండి. నేను రాష్ట్రంలోనే అప్పట్లో ఎక్కువ ఇళ్లు కట్టించానండి. ఎప్పుడూ రుణం కట్టాలనే మాట చెప్పలేదండి. సంసారం అనే సాగంలో పేదవారు ఎన్నో ఇబ్బందులు పడటంతోపాటు అన్ని రకాల నిత్వావసర వస్తువుల ధరలు అందుబాటులో లేకపోవడం, కరోనాతో వారి స్థితిగతులు మారిపోవడంతో అప్పులు కట్టేని నిస్సహాయ స్థితిలో కూరుకు పోయారు…పోతున్నారండి.
అయ్యా! ఒక విషయం గత ప్రభుత్వంలో ఎన్నో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను వివిధ శాఖల పర్యవేక్షణలో చేసి ఉన్నారండి. గతంలో చేసిన పనులకు తమరు బిల్స్ ఇవ్వకపోవడం న్యాయమేనంటారా? చఏసిన పనులకు బిల్స్ రావపోవడం వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు సోషల్ మీడియాలో చూపుతున్నారండి. కానీ గత ప్రభుత్వంలో కట్టిన వాటికి బిల్లులు ఇవ్వకుండా బిల్డింగులు, రోడ్లు, వగైరా తమరి పాలనలో ఉపయోగించుకోవడం న్యాయమవుతుందంటారాండి. గత ప్రభుత్వంలో చేసిన పనుల తాలూకు బిల్స్ ఇవ్వకూడదని తమరు భావించినప్పుడు, గత ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాల ముందు ఇచ్చిన ఇంటి రుణాలు వసూలు చేసే అధికారం కూడా మీకు లేనట్లే కండి? పేదవారిని ఇబ్బంది పెట్టకండి. వారు సంతోషంగా, ఆనందంగా ఉండేలా చేయండి. తమరు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో వారిని చాలా ఇబ్బందులకు గురిచేయడం మంచిగా లేదండి. కొట్టవద్దు అని కోరితే మరొకటి కొట్టు అన్నట్లుగా ఉంది మీ నిర్ణయమని చెప్పుకుంటున్నారని. దయచేసి, ఈ రెండు విషయాలపై సానుభూతి చూపమని కోరుతున్నాననండి.
ఇట్లు
ముద్రగడ పద్మనాభం
ఈ లేఖ రాజకీయ వర్గాలలో సంశయాన్ని సృష్టిస్తోంది. ముద్రగడ వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం కోరుకుంటున్నారన్న వార్తలు వస్తున్న తరుణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన లేఖ రాయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అదే ఉద్దేశంతో రెండు నెలల క్రితం ముద్రగడ లేఖ రాసి విమర్శల బాణాలు గుప్పించారు. ఆ లేఖ ఆయనపై వైసీపీకి అనుకూలుడనే ముద్ర వేసింది. ఇటీవలే చిరంజీవి సీఎంను కలవడం రాజ్యసభ సభ్యత్వం కోసమేననే వార్తలు గుప్పుమన్నాయి. మెగాస్టార్ దీనిపై చాలా తీవ్రంగా స్పందించారు. తాను రాజకీయాల్లోకి వచ్చేది లేనేలేదని కుండబద్దలు కొట్టారు. ఏమైనప్పటికీ ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ఒకవంక రఘురామ కృష్ణంరాజు తన విమర్శలను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎకనమిక్ టైమ్స్‌లో వచ్చిన కథనం మేధావి వర్గాలలో ప్రకంపనలనే సృష్టిస్తోంది. రానున్న రోజుల్లో రాజకీయం ఎలా ఉండబోతోందో అనేది సామాన్యుడి ఊహకు అందడం లేదు. ఏది ఏమైనప్పటికీ, వైసీపీ దగ్గరలోకి వచ్చి సవాలు చేసే సీన్ టీడీపీకి ఇప్పట్లో కనిపించడం లేదు.
అసలు ఈ లేఖపైనే కాపు సామాజికవర్గం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోంది. ఏదైనా అంశంలో అన్యాయం జరుగుతూ ఉంటే డిమాండ్ చేయాలి తప్ప సానుభూతి చూపమని సాగిలపడడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ముద్రగడ వేసేవి లేఖాస్త్రాలు కాదనీ, తుస్సుమనే టపాకాయలనీ అంటున్నారు.