పార్టీని ఎంచుకోవడమే ప్రధానం
ముద్రగడవైపు చూస్తున్న బీజేపీ
వైసీపీ వ్యూహకర్త చూపూ ఆయన వైపే(Mudragada enters politics)
గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో ఏదో రూపంలో ప్రభావాన్ని చూపిస్తున్న ముద్రగడ పద్మనాభం అతి త్వరలో క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించనున్నారా! అనే ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. పరిణామాలను పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు దీనిని అంగీకరిస్తున్నారు. కాపు ఉద్యమ నేతగా కుల ముద్రను సొంతం చేసుకున్న ముద్రగడ త్వరలోనే ఒక ప్రధాన రాజకీయ పక్షంలో చేరి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది.
రాష్ట్ర రాజకీయాలలో కాపు సామాజిక వర్గం ఓటర్ల ప్రభావం అతి ముఖ్యమైనదని అన్ని రాజకీయ పార్టీలూ అంగీకరిస్తున్నాయి. ప్రస్తుతం ఆ సామాజిక వర్గంలోని నాయకులు ఏ పార్టీలో ఏ హోదాలో ఉన్నప్పటికీ ఓటర్లు మాత్రం జనసేన పక్షాన నిలుస్తున్నారని అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో ముద్రగడను తమ పార్టీలోకి ఆహ్వానించి, పెద్ద పీట వేయడం ద్వారా ఆ సామాజిక వర్గం ఓట్లను చీల్చవచ్చని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. కాపు రిజర్వేషన్ల పోరాటాన్ని నిర్వహించిన ముద్రగడ అదే అజెండాతో తమ పార్టీలో చేరినా తమకు భారమవుతుంది తప్ప లాభం కాదని ఒక రాజకీయ పార్టీ భావిస్తోందని అంటున్నారు. అందుకే ముందుగా ముద్రగడ మోస్తున్న పోరాట బాధ్యతల నుంచి విముక్తుడు కావాలని సూచించారని తెలుస్తోంది. అందుకే ఆయన ఏడాది క్రితం కాపు పోరాటానికి స్వస్తి పలుకుతున్న బహిరంగ ప్రకటన చేసి, ఇంటికే పరిమితమయ్యారు. వచ్చే సంవత్సరం తొలి త్రైమాసికంలోనే ముద్రగడ ఒక సంచలన ప్రకటన చేసి, ఒక ప్రధాన రాజకీయ పక్షంలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ముద్రగడ ఒక వ్యూహకర్త కనుస్నలలోనే నడుస్తున్నారంటున్నారు.
ముద్రగడ మజిలీలు
ముద్రగడ పద్మనాభం 1978లో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నుంచి జనతా పార్టీ తరఫ/న ఎమ్మెల్యేగా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. అనంతరం 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి అదే నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ ప్రభంజనంలో అఖండ విజయం సాధించారు. 1985లో మళ్ళీ అదే నియోకర్గంనుంచి టీడీపీ తరఫునే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్ర డ్రైనేజి బోర్డు చైర్మన్‌గా సమర్థంగా పనిచేశారు. 1989లో ఆయన తెలుగు దేశాన్ని వీడి కాంగ్రెస్‌లో చేరారు. నాలుగో సారి ప్రతిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1994 వరకూ ఘన విజయం సాధిస్తూ వచ్చారు. 1994లో కాంగ్రెస్ అభ్యర్తిగా పోటీ చేసి, టీడీపీ ప్రభంజనంలో ఓటమి పాలయ్యారు. జిల్లాలో అత్యధిక మెజారిటీ సాధించిన మొదటి ఐదు స్థానాలలో ప్రత్తిపాడు ఉండడం ఆయనను నిర్ఘాంతపరిచింది. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. 1999 లోక్‌సభ ఎన్నికల నాటికి ఆయన తిరిగి టీడీపీలో చేరి, కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. తక్షణం క్రియా శీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 2009లో మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లో చేరారు.
పిఠాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజారాజ్యం అభ్యర్థి వంగా గీత చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో ఇండిపెండెంటుగా ప్రతిపాడు నుంచి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు. వరుసగా ఓటమి హ్యాట్రిక్ ఎదుర్కొన్న ముద్రగడ ఈసారి ఓ వెలుగు వెలగాలనీ, మళ్ళీ కాపు ఉద్యమాన్ని నెత్తికి ఎత్తుకున్నారు. అయినా ఆయన కల ఫలించలేదు. పైగా ఒక కుల నాయకుడిగా ముద్రపడింది. కొన్ని కులాలకు దూరమయ్యారు. 69 సంవత్సరాల వయసుకు చేరుకన్న ముద్రగడ పద్మాభం ఈ పర్యాయం వెనకబడితే ఆ తరువాత వృద్ధుడిగా ముద్రపడి రాజకీయాలకు శాశ్వతంగా దూరమై పోతాననే ఆందోళనలో ఉన్నారని సన్నిహితులు అంటున్నారు. అందుకే ఈ సారి తాను చేరబోయే పార్టీ బలంగా ఉంటే చాలుననీ, సురక్షితంగా ఉండగలనని భావిస్తున్నారనీ అంటున్నారు. ఇంతకాలం కులం కోసం పోరాటాలు చేసిన ముద్రగడ పద్మనాభం అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరితేనే కుల విశ్వసాన్ని పొందగలుగుతారనీ, అలా కాని పక్షంలో ఆయన కాపు కులానికి ద్రోహం చేసిన వ్యక్తిగా మిగిలిపోతారనీ ఆ సామాజిక వర్గానికి చెందిన వారు విశ్లేషిస్తున్నారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం గానీ, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన గాని ఎన్నికల క్షేత్రంలో ఓటమి పాలవడంతో ముద్రగడ తన ఉనికి కోసం తాను పడటం మినహా ఇతరత్రా ఆలోచనవేవీ చేయడం లేదని సన్నిహితులు అంటున్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో తన భార్యపై అధికార పార్టీ సభ్యులు అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు కంటనీరు పెట్టినప్పుడు రాష్ట్రమంతా సానుభూతి చూపింది.
కానీ ముద్రగడ మాత్రం చంద్రబాబుకు(Chandrababu naidu) బహిరంగ లేఖ రాశారు. ఎత్తిపొడిచారు. దీనిని బట్టి ఆయన టీడీపీలోకి చేరే అవకాశం లేదని తెలుస్తోంది. వైసీపీలోకి ముద్రగడను ఆహ్వానించి, పవన్ గాలికి చెక్ పెట్టవచ్చనీ, ఆ పార్టీ తన వ్యూహకర్త మంత్రాంగాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. సొంతంగా ఎదగాలని ప్రయత్నిస్తున్న బీజేపీ కూడా ముద్రగడను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ, ముద్రగడ ఏదో పార్టీలో చేరడం ఖాయం. అది వైసీపీయా, జనసేనా… బీజేపీయా కాలమే తేల్చాలి. రాజకీయాలో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రత్వాలు ఉండవు. కాబట్టి ఏదైనా సాధ్యమే!