మోడీ తీన్మార్
మూడోసారి ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నిక
ఈ నెల తొమ్మిదిన ప్రధానిగా ప్రమాణం
న్యూ ఢిల్లీ, జూన్ 7 : నరేంద్ర భాయ్ మోడీ వరుసగా మూడో సారి ప్రధాని పదవి స్వీకరించనున్నారు. జవహర్ లాల్ నెహ్రు తరవాత ఈ ఘనత సాధించిన ప్రధాని మోడీ మాత్రమే. 2014, 2019, 2024 లో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం జరిగిన ఎన్డీఏ పక్ష ఎంపీల సమావేశంలో ఆయనను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీన సాయంత్రం ఆరు గంటలకు మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎన్డీఏ పక్ష నేతగా మోడీని రాజ్ నాథ్ సింగ్ ప్రతిపాదించారు. నితిన్ గడ్కరీ బలపరిచారు. ఎన్డీఏ పక్ష నేతలు అందరూ మోడీ నాయకత్వాన్ని బలపరిచారు. ఈ సమావేశంలో రాజ్నాథ్ సింగ్ , చంద్ర బాబు నాయుడు, నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్, తదితరులు ప్రసంగించారు. ఎన్డీఏ పక్ష నేత ఎంపిక అంశాన్ని ఎంపీలు ఈ సాయంత్రం రాష్ట్రపతి దృష్టికి తీసుకుని వెళ్లి, అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించనున్నారు.
భావోద్వేగ క్షణాలివి…
ఎన్డీఏ ఎంపీల సమావేశంలో మోడీ మాట్లాడుతూ, తనకు ఇవి భావోద్వేగ క్షణాలని చెప్పారు. ఎన్డీఏ కూటమే దేశానికి ఆత్మ అని, మనది ఆర్గానిక్ కూటమి అని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం మామూలు విషయం కాదన్నారు. 22 రాష్ట్రాల్లో ప్రజలు ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చారని, అందరికీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి ఇంకా సేవ చేసే భాగ్యం తనకు లభించిందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎన్డీఏ విజయం కోసం కార్యకర్తలు అందరు తీవ్రంగా శ్రమించారని తెలిపారు.
వరుసగా మూడోసారి ప్రధానిగా మోడీ
Date: