Date:

మిషన్ 2024 ఎన్నికల ముఖచిత్రం ఇదే!
(ఎలిశెట్టి సురేష్ కుమార్, 9948546286 )
2024 ఎన్నికలు…
ఆంధ్రప్రదేశ్ లో ఇవి ఎలా ఉండబోతున్నాయి..
గత ఎన్నికల్లో విపక్షాలను అసలు దగ్గరకే రానీయకుండా
దిగ్విజయం సాధించిన జగన్ పార్టీ వైసిపి రానున్న ఎన్నికల్లో ఆ ఫీట్ ను రిపీట్ చెయ్యగలుగుతుందా..?
మొన్నటి ఎన్నికలతో గత వైభవాన్ని కోల్పోయి..ఒకనాడు జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి!?పవన్ కళ్యాణ్ ప్రభావం ఏపాటి..
గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలపై ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయినా రాష్ట్రాన్ని..ప్రజలను..వారి సమస్యలను విడిచి పెట్టకుండా ప్రజల్లోనే మసలుతూ తన ఉనికిని కాపాడుకుంటూ
వస్తున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఏ మాత్రం ప్రభావం చూపించబోతున్నాడు..?
ఇక బిజెపి..ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద పార్టీగా గుర్తింపు సంపాదించ లేకపోయిన జాతీయ పాలక పక్షం భారతీయ జనతా పార్టీ మద్దతు ఎవరికి..??
ఆ విషయం ఇంకా తేలలేదు..తేల్చలేదు..!

ఎన్నికల తేదీలు వచ్చేలోగా
ఇలాంటి విషయాలపై
కొన్ని విశ్లేషణలు అనివార్యం..

ముందుగా అధికార పార్టీ గనక వైసిపి పరిస్థితి..
జగమ్మోహన రెడ్డికి గాని..ఆయన స్థాపించిన పార్టీకి గాని 2019 నాటి క్రేజ్
ఇప్పుడు లేదన్నది వాస్తవం.నాలుగేళ్లకు పైగా సాగిన పాలన జగన్ సత్తాని..వైసిపి రంగుని ప్రజల ఎదుట తేటతెల్లం చేసింది.
ఈ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని..ధరలు పెరిగిపోయి సామాన్యులు..
మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారినా పట్టించుకునే నాథుడే లేడనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఏర్పడిపోయింది.జగన్ విధానాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చుకొలేనంత దుర్భర స్థితిలో ఉంది.ప్రాజెక్టులు లేవు..ఉన్నవి పూర్తి కావు..
ఇవన్నీ చాలవన్నట్టు ఏది ఎందుకు చేస్తున్నారో తెలియని అయోమయం..
రాజధానిపై కొనసాగుతున్న గందరగోళం..అంతా హడావిడి..అసలు తక్కువ..
హంగామా ఎక్కువ..టైపు..!
ఒక పరాకాష్టగా ఉచితాలు..ఇవి పుచ్చుకుంటున్న వారికి సైతం వెగటు పుట్టించేంత దారుణంగా పరిణమించాయి.
ఖజానా గుల్ల కావడమే గాక ధరల రూపంలో
ఈ ఉచితాలన్నీ తమ నెత్తిన మోయలేనంత భారంగా పరిణమించాయని ప్రజలకి స్పష్టంగా అవగతమైంది.
ఆర్థిక సంక్షోభం..శాంతి భద్రతల క్షీణత..మహిళలకు కొరవడిన రక్షణ..సరైన ఫలితాలు ఇవ్వని సచివాలయ వ్యవస్థ..
చెత్త పన్ను..మెజారిటీ దన్నుతో పెరిగిపోయిన ఎమ్మేల్యేలు…ఇతర నాయకుల ఆగడాలు..
భూదందాలు..ఆక్రమణలు.. భూకబ్జాలు..ఏకపక్ష ధోరణులు..
ఇలాంటి ఎన్నో మైనస్ లతో..పూర్ ట్రాక్ రికార్డుతో అధికార పార్టీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.ఇవన్నీ గాక జగన్ వ్యక్తిగత ఇమేజ్..అది 2019 మాదిరి మెరిసిపోవడం లేదు.
అధికారంలోకి రాక ముందు ఓదార్పు యాత్ర..పాదయాత్ర ఆంటూ జనాల్లో తెగ తిరిగిన వైసిపి అధినేత ముఖ్యమంత్రి
అయిన తర్వాత దర్శనమే కరవు చేశారు.
సచివాలయంలో తన ఛాంబర్ నుంచి
ఓ చిత్రరాజం..
అప్పుడప్పుడు సమావేశం…
వీడియో కాన్ఫరెన్స్..తప్పదు సుమా అన్నట్టు ఎప్పుడైనా ప్రత్యక్షంగా కొన్ని కార్యక్రమాల్లో హాజరు..కరోనా..తుఫాను..
ఇలాంటి అత్యవసర సందర్భాల్లో సైతం ముఖ్యమంత్రి జనం మధ్యలో ఉండి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు తక్కువ.
ఇలాంటి విపరీత ధోరణి వల్ల జనానికి..జగన్ కి
మధ్య దూరం పెరిగిపోయిందన్నది వాస్తవం.
అయితే విజయసాయి రెడ్డి..లేదా సజ్జల..ఈ ఇద్దరే పార్టీలో..ప్రభుత్వంలో..జనంలో..జగన్ సన్నిధిలో విఐపిలు..ఆ ఇద్దరికీ ప్రజల్లో పలుకుబడి..పరిచయాలు తక్కువ..ఇక ఎమ్మెల్యేలలో పెరిగిపోయిన అసహనం..ఇవన్నీ వైసిపిని వేధిస్తున్న అంశాలు.!

ఇక తెలుగుదేశం పార్టీ
2019 ఎన్నికల్లో కోలుకోలేనంత దెబ్బతింది.
ఆ ఎన్నికల్లో అధికారం కోల్పోవడమే గాక అటు తర్వాత కూడా ప్రజల్లో పట్టు కోల్పోతూ..పార్టీలో ఒకొక్కరు జారిపోయి ఒక దశలో ఎన్టీఆర్ పార్టీ పని
ఇక శాశ్వతంగా ముగిసిపోయినట్టేనన్న లెవెల్లో టాక్ వచ్చేసింది.
చంద్రబాబుకు వయసు
పైబడిందని..లోకేష్ ను ప్రజలు ఆమోదించే పరిస్థితి లేదనే అభిప్రాయం కొన్ని వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది..అయితే ఇప్పుడిప్పుడే కొంత పుంజుకుంటున్న మాట వాస్తవం..ఇదీ టిడిపి
ప్రోగ్రెస్ రిపోర్ట్..!

పవన్ కళ్యాణ్ సంగతి..
జనంలో విపరీతమైన క్రేజ్..
ఆకట్టుకునే ప్రసంగాలు..
సమస్యలపై పోరాటాలు..
ఇవన్నీ జనసేన అధినేత ప్లస్ పాయింట్లు..అయితే ఇవి 2019 లోనూ ఉన్నాయి. కాని పవన్ని జనాలు ఆమోదించలేదు.అయినా అదే దూకుడుతో జనసేనాని
2024 ఎన్నికలకు షాట్ రెడీ చేసుకుంటున్నారు.

ఇప్పుడు వర్తమానానికి వస్తే…2024 ఎన్నికల్లో వైసిపి
సింగిల్ గా బరిలోకి దిగుతుందన్నది నిర్వివాదం.
జగన్ పార్టీ పొత్తు కోరుకునేది
బిజెపితో.. మరి కమలనాథులు వైసిపితో
చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు
ఏ దశలోనూ ఎలాంటి సంకేతాలూ లేవు..
అది సాధ్యపడేనా…లేదా అన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే…!
బిజెపి జనసేనకు దగ్గరగా ఉంది గనక ఆ పార్టీ తెలుగుదేశంతో జత కడితే కమలం కూడా ఆ కూటమి వైపే మొగ్గు చూపే పరిస్థితి ఉంది.ఇప్పటికైతే ఆ కోణంలోనే ఎక్కువ సంకేతాలు వినిపిస్తున్నాయి..
కనిపిస్తున్నాయి కూడా..!
టిడిపి..జనసేన..బిజెపి పొత్తు ఇంచుమించు ఖరారై పోయిందన్న వార్తల నేపథ్యంలో చివరి ప్రయత్నంగా ఏమో జగన్ ఢిల్లీ వెళ్లి మోడీని..అమిత్ షాను కలిసే ప్రయత్నం చేస్తున్నారు.విశాఖ రాజధాని అనే నినాదంతో వైసిపి ప్రధానంగా ఉత్తరాంధ్ర స్థానాలనే టార్గెట్ చేసి ఎన్నికలకు సిద్ధం అవుతోంది.

ఇకపోతే జగన్ క్రేజ్ కాస్తయినా మిగిలి ఉందేమో గాని ఆయన టీంలో ఇతర ప్రముఖులెవరూ వ్యక్తిగతంగా
ఇమేజ్ సంపాదించుకున్న దాఖలాలు లేవు.జగన్ కూడా అదే ఫీల్లో ఉన్నారు.ఈసారి కూడా తన బొమ్మ పెట్టుకుని గెలవాల్సిన పరిస్ధితేనని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.ఆ నమ్మకం మరీ పెరిగిపోయి నచ్చినరీతిలో
కొత్త అభ్యర్థులను తెరపైకి తేవడానికి
ఆశ్చర్య పడాల్సిన సైతం వెనకాడ్డం లేదు.కనీసం యాభై నియోజకవర్గాల్లో కొత్త ముఖాలు ఉంటాయని తెలుస్తోంది.
ఇదంతా జగన్ బుర్రలో మాత్రమే నడిచే విషయం.అయితే అభ్యర్థులను మార్చే చోట
తిరుగుబాట్లు కూడా ఉండే ప్రమాదం తప్పకపోవచ్చు.

చంద్రబాబు ఈసారి తన గుడ్ కంటే జగన్ బ్యాడ్ పైనే ఎక్కువగా ఆధారపడి
ఎన్నికలకు వెళ్తున్న పరిస్థితి ఉంది..జగన్ క్రేజ్ తగ్గుతోంది అనగానే బాబు స్పీడ్ పెంచారు.ఆయన సభలకు..కార్యక్రమాలకే గాక పాదయాత్రతో పాటు లోకేష్ సభలకు కూడా జనాల హాజరు పెరగడం పెద్ద మార్పు..!

ఎవరు అధికార పీఠంపై కూర్చుంటారు అనే అంశం కంటే వైసిపి వ్యతిరేక ఓట్లు చీలకూడదన్నదే తన కీలక
ప్రాధాన్యత అని నొక్కి వక్కాణిస్తూ ఎవరితోనైనా తాను పొత్తుకు సిద్ధమేనని చెబుతూ వచ్చిన
పవన్ ఆ మాటపై నిలబడుతూ కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నా గాని టిడిపితో పొత్తు కుదుర్చుకున్నారు. అంతే గాక బిజెపిని టిడిపికి దగ్గర చేసే విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇదిలాఉండగా గత చేదు అనుభవాన్ని మరచి బిజెపి బాబుతో మరోసారి దొస్తీకి సిద్ధపడితే..అప్పుడు అనేక కోణాల్లో వైసిపి అధినేత కష్టాల్లో పడినట్టు అవుతుంది. ప్రస్తుత పరిణామాలైతే స్థూలంగా
2024 ఎన్నికల్లో జగన్ వర్సెస్ టిడిపి+జనసేన
+బిజెపి..అనే పరిస్థితిని సూచిస్తున్నాయి.
కమ్యూనిష్టులు సరే..
ఈ పొత్తులపై ఆధారపడి నిర్ణయం తీసుకుంటారు.
సిపిఎం..సీపీఐ బాబుతో..
పవన్ తో చేతులు
కలిపేందుకు సిద్ధపడతాయేమో గాని
ఆ కూటమిలో కమలం పార్టీ ఉంటే గనక కలిసే పరిస్థితి ఉండదు.

ఇక కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతానికి ఒక శక్తిగా పరిగణించే పరిస్థితి లేదు.
అయితే షర్మిల రాకతో కొంత మార్పు కనిపిస్తున్నా
ఆ ప్రభావం జగన్ ఓట్లపైనే ఉంటుంది.

సో..అన్నీ కుదిరితే…
అంతా బాగుంటే..
అందరూ ఒకటైతే..
2024లో..వైసిపి వర్సెస్ టిడిపి..జనసేన..ఇంచుమించు పక్కా..బిజెపి కూడా కలిస్తే ఎంచక్కా..జగన్ కు వ్యతిరేకంగా బలమైన కూటమే చెమ్మచెక్కా..!
ఇదంతా రానున్న నాలుగైదు రోజుల్లో ఒక కొలిక్కి వచ్చేసి
క్లియర్ పిక్చర్ తెలిసిపోతుంది.!

(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గణేశుని పూజిస్తే మౌస్ క్లిక్ చేసినట్టే…

నిరాడంబరుడు… విఘ్నలను తొలగించే రాజు(డా. పురాణపండ వైజయంతి)మౌస్‌ని ఒక్కసారి క్లిక్‌ చేస్తే...

గణేశ మండపాలకు ఉచిత విద్యుత్తు: రేవంత్

ఖైరతాబాద్ వినాయకునికి సీఎం పూజలుహైదరాబాద్, సెప్టెంబర్ 07 : ఖైరతాబాద్ గణేశ...

పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డిజె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి...

విఘ్నాధిపతి రూపం – విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం

(వాడవల్లి శ్రీధర్)శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"శుక్లాంబరధరం అంటే...