కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు
(డాక్టర్ వైజయంతి పురాణపండ)
పాతాళభైరవి… ఈ పేరే భలే చిత్రంగా అనిపిస్తుంది. ఈ పేరు ‘చిత్రం’గా మారటానికి ‘ఆహా’ చిన్న కథలాంటి నేపథ్యం ఉంది. విజయ సంస్థ వారు ‘పాతాళభైరవి’ చిత్రానికి ముందే ‘చంద్రలేఖ’ అనే ఓ అందమైన సుందర దృశ్యకావ్యం తీసి, ప్రేక్షకులను మెప్పించలేక కలంలోని సిరాను ఖాళీ చేసి పాళీని పక్కన పడేశారు.
ఓనాడు మద్రాసులో పాత పుస్తకాల సందుల్లో తిరుగుతూండగా, పాకెట్ సైజులో ఉన్న పాతాళభైరవి అనే అక్షరాలు ముద్రించిన పుస్తకం కనిపించింది. ఎందుకో ఆ పుస్తకం చూడగానే కొద్దిపాటి తెలివిలాంటి ఆసక్తి కలిగింది. కొంటే పోలే.. అనుకుని కొద్దిపాటి కాసులు ఇచ్చి, ఆ పొత్తం తెచ్చి చదువుతుంటే, తల మెదడులో చురుక్కున తళుక్కుమనే ఆలోచన వచ్చింది. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా.
నిజమే చెప్పనా..
తక్షణ కర్తవ్యంగా సినిమా మొదలుపెట్టారట.
కథ ఏంటంటే –
అనగనగా ఓ రాజకుమారి. అనగనగా ఓ తోటరాముడు. అనగనగా ఓ రాణి గారి తమ్ముడు. అనగనగా ఓ రాజుగారు వారి రాణిగారు. అనగనగా ఓ నేపాళ మాంత్రికుడు, వాడి శిష్యుడు సదాజపుడు. తోటరాముడు రాజకుమారిని ప్రేమించడం, ఆ ప్రేమ కోసం నేపాళ మాంత్రికుడి వలలో పడటం, నేపాళ మాంత్రికుని బురిడీ కొట్టించి, ‘జై పాతాళ భైరవి’ అంటూ పాతాళ భైరవిని సాధించడం, డింగరీ అంటూ సంపన్న డబ్బువంతుడయ్యాడు. పెద్ద మహల్‌ను సృష్టించడం, మాంత్రికుడు కుటిలనీతితో పాతాళభైరవిని చేజిక్కించుకోవటం, ఆ భవంతిని, రాజకుమారిని ఎత్తుకుపోవడం, తోటరాముడు నేపాళ మాంత్రికుడిని సంహరించి, తిరిగి అన్నిటినీ చేజిక్కించుకోవటంతో సుఖాంతం కావడం… అదీ కథ.
ఈ కథను పక్కకు తోసి రాజు అనేద్దాం…
ఈ కథను తన బంగారు పాళితో చంద్రహారం చేసి ‘కాసులపేరు’ పంట పండించిన మాట పలుకులను పరిశీలనశోధన చేద్దామా… తప్పు తప్పు… పరిశోధన కాదు… సరదాగా పరిశీలిద్దాం…
ఆహా భలే హాయిగా ఉన్నాయే అని ఎదమనసులకు ఘాటుప్రేమ బాట పరుద్దాం.
ఆ తోట రాముడికి భలే స్నేహితుడు ఉన్నాడు. వాడు కర్ర సాము చేస్తుంటే అది పింగళి పాళీకి ‘కట్టె సాము మీరూనూ’ అని రెండు భాషల సమాసంగా చేయాలనిపించింది. అనిపించడమేమిటి ఆ పాళీ అలా అనేస్తుందంతే.
ఆ కట్టెను తీసి గట్టున పెడితే –
తోటరాముడు చేసే ఆగడాలను భరించలేని వెర్రి తల్లి, ‘ఓరి భగవంతుడా ఒక కొడుకునిమ్మంటే ఈ రాక్షసుడినిచ్చావేంటిరా’ అంటూ నిట్టూర్చింది.
అంతే…
‘రాక్షసుడంటే రక్షించేవాడు పిన్నీ, అంటే రాజు’ అని కొత్త తాత్పర్య భాష్యం చెప్పాడు అంజి. అక్కడితో ఆగితే బానే ఉండేది. పిల్లికి ఎలక సాక్ష్యంలాగ, ‘పులిగాడికి తోడు పిల్లిగాడు’ అని ఆ తల్లి నోట కొత్త సామెత పండింది.
తోటరాముడు చేస్తున్న ఆగడాలను భరించలేక ఆ పిచ్చి తల్లిని… తల నరికి కోటకు కడతారురా అనమంటే… తపున్ప తప్పు…S ‘కనపడితే కంఠానికొస్తుంది సుమా’ అనే కొత్త కంఠం వినిపించింది.
ఈ పింగళి తాత బహు కొంటెవాడు…
ఆయన గోళీలతో ఆడుకున్నాడో లేదో కానీ…
పదాలతో చెడుగుడు ఆడేశాడు…
లేకపోతే…
కాదు కాదు… తప్పు తప్పు… లాంటి అల్ప పదాలకు కూడా నిఘంటువులో చోటిచ్చేస్తాడా…
‘రాణిగారి తమ్ముడు’, ‘విచిత్రమైన కోతి తోకలాంటి టోపీ’ అంటూ కొత్త పదాలకు… కాదు కాదు… ఉన్న పదాలనే కొత్తగా వాడటానికి హ్రీంకారం చుట్టారేమో. హ్రీంకారమేంటి తప్పు తప్పు శ్రీకారం చుట్టారు అనాలి కదూ. ‘వినోదమేంటి తప్పు తప్పు పరమ ప్రమాదం, పన్నిచ్చుకోవాలి’ అంటూ రాజుగారి బావమరిది చేత ‘కాదు కాదు’ అనకుండా ‘తప్పుతప్పు’ అంటూ ‘కూడని’ పనిని ‘తప్పు’ చేశారు.
అందుకే ‘ఇది తప్పు’ అనకండి. ‘కాదు’ అని కూడా అనకండి.
సరే కానీ…
మనం మాత్రం పింగళి పాళీ పట్టుకుని ముందుకు నడుద్దాం..
పాళీకి, పారశీకానికి ఏదైనా లంకె బిందె ఉందా…
తప్పు తప్పు … లేదు లేదు…
వినోదం చూస్తున్న సదరు వ్యక్తి తాను పారశీకుడనని నుడివితే, ‘పారశీకం ఏంటి తప్పు తప్పు పరశోకం’ అంటూ కొత్త భాష్యం చూపింది ఆ పాళీ.
తన మీద పెట్టుకున్న టోపీని ‘టోపీ ఠింగురంగాలా ఉందే’ అంటూ ‘టోపీని కూడా టింగురంగడిలా తయారు చేశారు.
కోపంతో మాట్లాడుతుంటే, కత్తుల్లాంటి మాటలు అంటారేమో అనుకుంటే, ‘కటారులా కస్సుమంటున్నావు’ అంటూ అచ్చ తెలుగు పదాలను అవలీలగా ఉపయోగించేశారు. అసలు కత్తి కస్సుమంటుందా? ఏమో అంటుందేమో? అనకుండా ఉంటే ఈ ప్రయోగం ఎలా వస్తుంది? కాబట్టి అలా అనే తీరాలి.
––––––––––
నేతిబీరకాయలో నెయ్యి లేనట్లే, వీరసేనశూరసేనుడి పేరులో కూడా ఆ మూడూ లేవు. అందుకే అమాయకంగా ‘నన్ను కొడతావా తప్పు తప్పు’ అంటూ తనని కొట్టకూడదంటూ బావమరిది తప్పు తప్పు రాణి గారి తమ్ముడు (రేలంగి) ఆజ్ఞా శాసనం జారీచేశాడు .
మహారాజుకే కాదు ‘కథానాయకుడికి జై’ అనిపించారు.
తోటలో పూలు కోసే అమ్మిని ‘తోట ముసలిది’ అన్నారు.
తోటరాముడిని నిలదీస్తే చాలు, ‘నిజం చెప్పమన్నారా, అబద్ధం చెప్పమన్నారా’ అంటూ నిజాయితీగా పలికించారు.
రాజ్యంలో అన్యాయం జరుగుతుంటే, తోటరాముడు చేయి చేసుకుంటాడు. ‘మా అధికారంలో మీరు చేయి చేసుకోరాదు’ అని తక్షణ కర్తవ్యాన్ని బోధిస్తాడు రాజు (సి.ఎస్.ఆర్.)
భలే పింగళి
ఈ పాళీ వెంట నడిచేవారికి భలే పదం వచ్చే తీరాలి.
‘భలే రాముడు, భలేసాహసి’ అని తోటరాముడికి నీరాజనం పలికారు.
రాకుమారిని మనసారా ప్రేమించి, గొప్పగా, ‘మనసు కళగా ఉంటే పని కూడా కళకళలాడుతుంటుంది’ అంటూ జతగాడితో పలికి, ‘మనం ప్రేమించడం, మనం అంగీకరించడం అయిపోయింది’ అన్న వాక్యాలను అరవై సంవత్సరాలు దాటినా మనసుల మీద చెరగని ముద్రలా కూర్చున్నాయి.
పింగళికి భావుకత ఎక్కువే.. తప్పు తప్పు.. చాలా చాలా ఎక్కువ.
‘నా ప్రేమనే పరిమళించమని పువ్వులను అడిగాను, నా అనురాగాన్ని తీయగా పాడమని కోయిలను బ్రతిమాలుకున్నాను’ అంటూ పువ్వులతో ప్రేమను పరిమళింపచేశారు, కోయిలతో అనురాగాన్ని పాడించారు.
స్వయంవరం పరీక్షిస్తుంది…
రాజకుమార్తె (మాలతి) కు తగిన వరుడిని తానేనంటాడు రాణితమ్ముడు.
‘రాణీ! నీ తమ్ముడు పెళ్లికూతురవుతున్నాడేంటి’ అని రాజు చమత్కార చాపం సంధిస్తే…
‘పెళ్లికూతురేమిటి తప్పు తప్పు, పెళ్లికొడుకును బావా!’ అని ఆ చాపాన్ని వెనక్కి పంపేశాడు.
‘నన్ను స్వయంవరం పరీక్షిస్తుందట’. ఈ వాక్యం అర్థమయ్యిందా? ఏమీ అర్థం కాదుగా.
‘ప్రేమైతే ఎంతైనా చేస్తానే అక్కు’ అంటూ అక్కని అక్కు చేశాడు రాణి తమ్ముడు. అక్కు పక్షి తెలుసు కాని, అక్కను అక్కు అనడమేంటి? తప్పు తప్పు… అలా అనకూడదు.. అక్కు అనిపించారంటే అనిపించారు రేలంగితో… అంతే..
అవును ఈ చెలికత్తెతో కొత్తగా ‘చెలికత్తనం’ అన్నారేమిటి? ఇల్లరికం, కోడరికం తెలుసు, ఈ చెలికత్తనం ఎక్కడ నుంచి వచ్చిందో. అక్కడితో ఆగారా, అబ్బే, ఆగకుండా జ్యోతిష్య పండితుడిని ‘చెప్పండి జోశ్యులు’ అని అడిగించారు. జాతకం అద్భుతంగా ఉంది అని మామూలుగా అనకుండా, ‘అఖండ విజయవంతంగా ఉంది’ అని రెట్టించి చెప్పారు.
సదాశివా అనడం విన్నారు కదా. మరి ‘సదాజపా’ అనడం విన్నారా, వినలేదు కదా. వినం. అందుకే వినిపించారు పింగళి. నిత్యం జపం చేసేవాడిని సదాజపా అనాలట. ఆ సదాజపుడి ముఖానికి ముసుగువేసి ‘సదాజపా’ గా ఆ పాత్రకు పేరు (నామ) కరణం చేసేశారు.
‘ హ్రాం ఫట్… ఆం హట్… చండీ ప్రసన్న.. చాముండీ ప్రసన్న… సోహిండీ ప్రసన్న… కాపాలినీ ప్రసన్న… ఆం మంత్రాది దేవతా ప్రసన్నా’ ఈ మంత్రాలు ఏ వేదాలలో ఉన్నాయో, ఏ ఉపనిషత్తులలో ఉన్నాయో..
ఇవి పింగళి వేద మంత్రాలయి ఉండొచ్చు.
అంతేనా అమ్మవారి చేత ‘నరుడా ఏమి నీ కోరిక’ అనిపిస్తే, మాంత్రికుడి చేత, ‘దేవీ పలుకు’ అని వాక్యానికి చివర మకుటం చేశారు. ‘సంజీవి స్పర్శ సాయరా’ ‘మహాసాహసవంతుడు’ ‘కీడు మూడేను’ ‘తలకోసి ప్రాణం తీస్తారు’ అంటూ పెద్ద నిఘంటువే తయారయ్యింది పాతాళభైరవి ఆశీర్వాదంతో.
‘అంత కాకపోతే ఇంత ఏమిటి మామయ్యా ఇదంతా’ అంటూ రాకుమారి (మాలతి) మేనమామతో చమత్కరింపులు చిలకరిస్తుంది.
‘నిద్రేమిటి? తప్పు! తప్పు! భద్రంగా ఉండాలి!’ అనే జాగ్రత్తలు కూడా నేర్చుకోనూవలసిందే.
‘నువ్వు విజయోస్తు అని దీవించు నేను తథాస్తు అంటాను’ అంటూ అస్తుఅస్తులు పలికించారు.
‘అదృష్టం ఉంటే ఆకాశం నుంచి రాలతాయి’ ‘విజయలక్ష్మి కిరీటం పెట్టిందని కాదు’ అంటుంటే, ఇదంతా కొత్త సాహిత్యమా అంటూ కవులంతా కపాలాలు ముక్కలు చేసుకోవలసిందే.
కొత్త పదాలకు ఒక నిఘంటువు తయారుచే సి, ‘భలే పింగళి’ అంటే బాగు బాగుగా ఉంటుందేమో.
అమ్మవారిని…
‘ఆం… ఆం.. అష్టభైరవి, ‘క్లా కఘం… కాలభైరవి, ఢాం తదరం… ఇక మంత్రబలం చూపించేను… మనోబలం చూపించేను’ … అమ్మవారి మంత్రాలను భలేగా పలికించారు నేపాళ మాంత్రికుడితో.
అవును..
అసలు నేపాళం ఎక్కడ నుంచి వచ్చిందో.
నేపాల్ నుంచి కొంచెం కళవళపరిస్తే నేపాళం వచ్చిందేమో!
ఏమో!
అవునేమో!
నిజమేనేమో!
ఎంత కొత్త పదములో…!!!
ఎంత వింత పదములో…!!!
‘డింగిళ్లనండి వందనాలనండి’ ‘నడుములు వంగిన నాయకులంతా గడిబిడ సేయక వెనక్కు వెళ్లండి’ ‘డింగరీ…’
అయ్యయో!!!
ఈ కొత్త పదాలను అక్షరాలతో పుట్టించేశారా…
‘జనం కోరేది మనం సేయడమా… మనం సేసేది జనం చూడటమా’
ఇది లోకరీతి వాక్యమేమో..
ఇది కొత్త సామెతేమో…
ఈ అక్షర విత్తనాలను బాగానే నాటారు.
పంట సుభిక్షంగా భలేగా పండింది.
‘గాగీగూగే టోటా టీటూ లీలూలేలో మామీమేమో’
ఈ గుణింతాల మంత్రాలేమిటో…
తప్పు! తప్పు!
ఇవి మాంత్రికుడి మంత్రాలు.
ఈ గుణింతాలు చదివి ‘ఈ రాతిని కోతిని సేయండి’ అంటే వెంటనే జరిగిపోతుంది.
‘హాహాహూహూ హీహీహిహిహి’ ‘డీడూడేడో డూడూడూడూ’ ‘ఈ కోతిని నాతిని సాయండి’
మరో రెండు మూడు గుణింతాలను అడ్డదిడ్డంగా చదివితే మళ్లీ ఆ మంత్రం ఫలించకతప్పుతుందా.
‘మహాజనానికి మరదలు పిల్ల. అందరూ బావలే గలగల ఆడవే గజ్జెల కోడి’
నేటికీ ఆ మరదలు పిల్ల మహాజనంలోకి చొచ్చుకునిపోయే ఉంది. ఆ మరదలు పిల్ల తక్కువేం తినలేదు, మాంత్రికుడు నాతిని చేయగానే ఈ పిల్ల కూడా గుణింతాలతో ‘లలలూ లలలూ లాలలు లాలలు లాలలూ’ అంటూ పాటను భలే కొనసాగించింది.
‘నావెంట మీరంతా గుమిగుమిగుమిలే….’ ఈ పదానికి అర్థం ఏమిటో మరి. ‘కూకం కాకి కాకి కూకే’ ‘గాగిగూగే టాటీటూటే’ ‘నీ కోరిక తీరే కీలకం చూపిస్తాను… సాహసం సాయగలవురా’
ఇది నేపాళ మాంత్రికుడి ఆంతరంగిక భాష.
ఈ మాటలతోనే భలే రాముడిని తికమకపెడతాడు.
‘సాహసివిరా వరపుత్రుడివిరా’ ‘హ్రాం హ్రీం బభంభం’ ‘భలే డింభకా భలే భలే’…
ఈ అక్షర శిలాక్షరికి ‘భలే’ పదం భలే ఇష్టం. మాయాబజార్‌లోనూ ‘భలే మామ భలే, భలే కృష్ణ భలే… అని పలికి, ఇక్కడ భలే డింభకా.. అంటూ పిలిచారు.
కొండదేవర తెలుసు, బొడ్డు దేవర తెలియదు కదా, నేపాళ మాంత్రికుడు పుట్టించాడు ఈ దేవరను. ‘చూస్తివిరా బొడ్డుదేవరను, ఆ ఉక్కుగదతో పగలమోదమంటోంది. ఆజ్ఞ సాయరా. బలంగా మోదరా’ అంటూ కొత్త దేవరను.. తప్పు తప్పు కొత్త దేవుడు కంటి నేత్రాలు తెరిచాడు.
‘శ్రీంకాళి హ్రీంకరాళి రక్తనేత్రౌ’
ఇది పాతాళభైరవికి కొత్త స్తోత్రం
‘మంత్రజపం చేసి మాతను ప్రసన్నం చేస్తాను. అనుగ్రహం సాయిస్తాను’
ఇవి టక్కరి మాంత్రికుడు నోటి పలుకులు.
గాయత్రీ మంత్రాన్ని కూడా మాంత్రికుడి మంత్రం చేశారు. లలితా సహస్రంలోని కళాధారా,‡ కలికల్మషనాశినీ’ మంత్రాలను కూడా ఆవాహన చేసుకున్నాడు.
‘భలేరాముడు’ కాదు! కాదు! ‘తోటరాముడు’ పాతాళభైరవిని బహు చమత్కారంగా చేరుకున్నాడు.
‘ముక్కుకు సూటిగా వెళ్లాను, నక్క తోక తొక్కాను, కుక్క తోక దొరికింది., పట్టుకెళ్లి పాతాళంలో పడ్డాను. అక్కడ దేవి ప్రత్యక్షం అయ్యింది’ అంటూ కట్టె కొట్టె తెచ్చె లాగ పలికాడు.
‘ఆర్యులారా అగ్రజులారా’ అంటూ ఊరి పెద్దలను సంబోధించాడు తోటరాముడి శిష్యుడు.
‘చూడాలేమిటి తప్పు తప్పు పరీక్షించాలి’ అంటుంటే, రెండింటిలో ఏ పదానికి ఏది అర్థమో అర్థం కాదు.
ఇక వంటకాలను కూడా మంత్రాలు చేసేశారు. ‘లాడూవేనీ పార్ణం బూర్లు (లడ్డు పేణీ పూర్ణం బూరెలు). ఈసారి కొత్త వంటకాలకు బూరెసారెలు (బాలసారెలు) చేసుకుంటే బావుంటుందేమో.
అన్నింటికీ కొత్త మంత్రాలు పలుకవలసిందే.
మంత్రాలకు చింతకాలయలేమో కాని, కొత్త కొత్త మంత్రాలు రాలవలసిందే
వ్యతిరేకార్థాలు సాయితం…
‘చావకుండా ఎలా బ్రతకడం…’ ‘మీరు బ్రతిమాలుతున్నారు కనక సస్తున్నా! తప్పు తప్పు! వస్తున్నా!’
రేలంగోడి చమత్కార ములుకులు ఒక్కసారి పరిశీలిస్తే…
‘చావకుండా బ్రతకడం’ అర్థం కాదు, ‘సస్తున్నా! వస్తున్నా!’ అర్థం కాదు.
ఇక ఈ మాటలవాక్యం ప్రత్యేకంగా గుర్తుంచుకోవలసిందే…
‘మీ అమ్మణి ఏం చేస్తోందిరా’ అంటూ నేపాళ మాంత్రికుడు సంశయిస్తుంటే…
‘శోకం చేస్తోంది గురూ’ అంటూ పలికాడు సదాజపా.
ఈ వాక్యాన్ని ‘ఒక్కసారి’ కాదు! కాదు! ‘పది సార్లు’ తప్పు! తప్పు! కోటిలక్షవేయి వందల సార్లు అనుమననం చేయవలసిందే.
వ్యాకరణం సరిగా ఉందో లేదో అర్థం కాదు, శోకం నామవాచకం, చేయడం క్రియ. మరి ఎలా కుదురుతుంది. కుదురుతుంది.
ఆ బంగారు పాళికి ఏదైనా కుదురుతుంది.
‘సంజీవని స్పర్శ చేశాను గురూ!
‘గయ్యాళిసాయక వయ్యారంగా నన్ను వరించవే బుల్‌బుల్’!
ఇవన్నీ ఏమిటి?
సంజీవని స్పర్శ చేసిందట.
గయ్యాళి సాయక, శృంగారం (సింగారం) చేసుకు వస్తాను…
ఏం రాశాడో మహానుభావుడు.
మళ్లీ ఇలాంటి పదాలు పుట్టనే లేదు, ఇంక పుట్టవేమో. అరవై సంవత్సరాలు దాటిపోయినా ఇంకా పుట్టలేదంటే, మళ్లీ పింగళి పుట్టి, తన పదాలకు తానే వివరణ సాయాలి.
‘థిగిడీ…థగిడి’ పదాలు ఎలా పుట్టాయో? నాట్య జతులను ఇలానే పలకాలేమో.
‘నవనాడులు కట్టి తెచ్చి ఇక్కడ పడ వెయ్యి’ అంటూ నాడులను నడుముకి కట్టేసి పడేశారు.
‘కరగ్రహణం,’ ‘తలబుర్ర’ ‘అమ్మాయీమణి’, ‘అమ్మణి’, ‘డింగరీ’
ఎన్నని రాయాలి?
ఎన్నిటిని వివరించాలి?
ఒకరు చెబితే వచ్చేవి కాదు!
ఒకరు చెబితే అర్థం అయ్యేవి కావు.
సద్దు సాయకుండా, బుద్ధిగా పాతాⶠభైరవిని చూసి, నేపాళ మాంత్రికుడి వెంట తిరుగుతూ, సదాజపాలతో తలబుర్రను ఇందులో ఉంచితే ఆ అక్షర అక్షతలు మనలను అనుగ్రహిస్తాయి.
‘మా రాజ్యం సుభిక్షకంగా మా ప్రజలు సౌఖ్యంగా ఉండేట్టు అనుగ్రహించు’ అని ప్రార్థించాలి.
ఫలశ్రుతి:
ఈ కథ చూచిన వారికి, చూచినవారి వద్ద విన్నవారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించేట్లు అనుగ్రహించుము తల్లీ.
తథాస్తు…
––––––––––––––––––
డా. పురాణపండ వైజయంతి
(పింగళి వారి మాటలను తీసుకుని, నాకు తోచిన విధంగా వారి గురించి ఈ సినిమాలోని విచిత్ర పదాలను, విచిత్ర కల్పనలను ఆయన మార్గంలో వివరించడానికి చిన్న బుల్లి బుజ్జి ప్రయత్నం సేసినాను)
మీ విశ్లేషణ చాలా బాగుంది కానీ మొదట్లో మీరు వ్రాసిన చంద్రలేఖ జెమినీ వారి సూపర్ హిట్ సినిమా మీరు విజయ వారి చంద్రహారం గురించి వ్రాసి ఉంటారని అనుకోను దయచేసి వివరిస్తారా