శివుడు – యూనివర్సల్ మిడిల్ క్లాస్ గాడ్

0
82

(నిజమైన ఐశ్వర్యం – నిండైన శివ భక్తి)
A Devotional Philosophical Essay by Mahaadev

సామీ!
నీకు తానాలు అంటే వొంటి నిండా గంధం పూసి,బిందెడు పన్నీరు తెచ్చి చేయించాలిట కదా?
కటిక పేదోడ్ని సామీ,అయ్యన్నీ నేను ఎట్టా తేగలను !

ఎందుకు నాయనా నీకు అంత శ్రమ?
ఒక చెంబుడు కోనేటి నీళ్లు నా నెత్తిపై పోయిరాదు.
నీపై అష్ట ఐశ్వర్యాలు గంగా ప్రవాహం లా నే కురిపిస్తాను..

సామీ…
నాకే కట్టుకోడానికి సరైన బట్టే లేదు అంటే,
నీకు పట్టు పీతాంబరాలు నేను ఎట్టాగయ్యా తెచ్చేది?

నిత్యం ఏనుగు చర్మం కట్టుకుని తిరిగే నాకు అవన్నీ ఎందుకు అయ్యా !
ఒక్క మారేడు పత్రం నా నెత్తిపై ఉంచు చాలు..
నీవు ధరించడానికి పట్టు వస్త్రాలు నేనే ప్రసాదిస్తాను..

సామీ !
నీ బొట్టు పెట్టుకోవాలి అంటే అద్దం ముందు నిలబడి, కస్తూరి తిలకంలో దర్భ పుల్లని ముంచి, వంకర్లు లేకుండా సూటిగా, అందంగా పెట్టాలట కదా?
నా దగ్గర అన్ని సౌకర్యాలు లేవు సామీ

వొంటినిండా బూడిదనే బొట్టుగా ధరించి,స్మశానంలో తిరిగే నేను నీ బొట్టు ని ఆక్షాపిస్తానా చెప్పు ?
మూడు వేళ్లు విభూది లో ముంచి నుదుటిపై పెట్టుకోవయ్యా చాలు,ఎవరు అడిగొచ్చారు !
భక్తి నిటారుగా ఉంటే చాలు,బొట్టు వంకరైనా నాకు అభ్యంతరం లేదు.

సామీ !
మరేమో,నీ దగ్గరకు వచ్చే అప్పుడు వొట్టి చేతులతో కాకుండా,వేడి వేడిగా పులిహోర, చక్రపొంగలి పొగలు కక్కేస్తూ చేసి పట్రావాలట కదా?
నాకు పొట్ట గడవడమే కష్టంగా ఉంది సామీ,అవన్నీ నేను ఎక్కడ చెయ్యగలను!

పుర్రె చేత పట్టి భిక్షాటన చేస్తూ భక్తుల అహంకారాల్ని,అజ్ఞానాన్ని భుజించే నాకు అవన్నీ అవసరం లేదు నాయనా!
భక్తిగా ప్రకృతిన పండే ఒక్క రేగిపండు నైవేద్యం పెట్టు చాలు.
నీవు తినడానికి పంచభక్ష్య పరమన్నాలు నేను ప్రసాదిస్తాను..

ఆ భక్తుడు ఇంకేమీ ఆ సామిని అడగలేదు.
మారు మాట్లాడకుండా, ఎంతో భక్తితో, సరళమైన ఈ సపర్యలన్నీ చేశాడు.
అష్ట ఐశ్వర్యాలు పొందాడు..

ఎందుకంటే… ఆ సామికి ఎటువంటి హంగులు,ఆర్భాటాలు అవసరం లేదు – నిర్మలమైన,స్వచ్ఛమైన,భక్తి పూర్వకమైన మన మనస్సు చాలు.
ఆ సామే లోకాలను ఏలే పరమేశ్వరుడు..

భక్తిగా ఒక్క సారి స్మరించిన అన్నీ అనుగ్రహించగల దైవం..

ఓం ఈశానః సర్వవిద్యానాం
ఈశ్వరః సర్వభూతానాం ।
బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోఽధిపతిర్
బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్ ॥

(శివుడు సకల విద్యలకు అధిపతి.
అన్ని ప్రాణులలోనూ ఈశ్వరుడే కొలువై ఉన్నాడు.
సృష్టి, స్థితి, లయాలకు మూలపురుషుడు ఆయనే.)

వాగర్థావివ సంపృక్తౌ
వాగర్థ ప్రతిపత్తయే ।
జగతః పితరౌ వందే
పార్వతీ పరమేశ్వరౌ ॥

(వాక్యం-అర్థం లా విడదీయలేనివారైన
పార్వతీ-పరమేశ్వరులకు నమస్కారం.)

ఈ ప్రపంచంలో మానవ జన్మ అత్యంత విలువైనది.
కానీ ఆ జన్మలోనే మనిషి ఎన్నో మాయల్లో తిరుగుతాడు —

బాల్యంలో ఆటల మాయ,
యవ్వనంలో ప్రేమ మాయ,
కౌమారంలో డబ్బు మాయ,
వృద్ధాప్యంలో “ఇంకా ఏదో తీరని లోటు” అనే మాయ.

ఈ మాయల మధ్య జీవితం గడిచిపోతూ ఉంటుంది..
శాంతి మాత్రం దొరకదు.

అదే మాయని తప్పించుకోవడం కోసం లేదా మాయ అని తెలిసీ జీవితం లో ముందుకు నడవడం కోసం..
ఆ అంతర్లీన నిశ్శబ్దం కోసం…
శాంతి కోసం.. సంతృప్తి అయిన జీవితం కోసం..
శివ నామ స్మరణ ఒక్కటే అందరికి మార్గం..

పంచభక్ష్య పరమన్నాలు తినడం ఐశ్వర్యం కాదు;
తిన్నది జీర్ణం అవ్వడం ఐశ్వర్యం.

బీరువా నిండా కోట్లు ఉండడం ఐశ్వర్యం కాదు;
కోట్లు దొంగిలిస్తారేమో అనే భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడం ఐశ్వర్యం.

అందమైన భార్య ఉండడం ఐశ్వర్యం కాదు;
ఆమె మనసులో నీవే ప్రపంచమై ఉండడం ఐశ్వర్యం.

ఇంటి నిండా పనివాళ్లు ఉండడం ఐశ్వర్యం కాదు;
నీ పని నీవే చేసుకోగలగడం ఐశ్వర్యం.

డబ్బుకి పనిచేసేవాళ్లు ఉండడం ఐశ్వర్యం కాదు;
ప్రేమతో నీ పనిని వాళ్ల పని అనుకుని చేసే మనుషులు ఉండడం ఐశ్వర్యం.

కుర్చీ చూసి గౌరవం ఇవ్వడం ఐశ్వర్యం కాదు;
నీవు నేలపై కూర్చున్నా మర్యాదించే మనుషులు ఉండడం ఐశ్వర్యం.

ఈ ఐశ్వర్యాలన్నిటికీ మూలం ఒక్కరే – పరమ శివుడు..
భక్త సులభుడిగా,భోళా శంకరుడిగా అనాదిగా కొలవబడుతున్న ఏకైక దైవం..

ఎలాంటి ఆడంబరాలు,వస్తు వ్యామోహం లేనటువంటి ఆయన,ఏది అడిగినా వెంటనే ఇచ్చేసే బైరాగి తత్వం కలిగి ఉన్నాడు..

ఆయనకు కావలసింది పెద్ద పూజలు కాదు…
పట్టు వస్త్రాలు కాదు…
వెండి పాత్రలు కాదు…

నిజమైన హృదయం.

ఆ హృదయం ఉంటే –
ఆయన దగ్గరికి వెళ్లడానికి మార్గం చాలా సులభం.

నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర🙏

భక్తితో మీ భక్తుడు

(మహాదేవ్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here