స్వాతంత్ర సమరయోధుడు మద్దూరి
జీవిత కాలంలో ఐదో వంతు జైలులోనే…
(20.03.1899 –10.9.1954)
(శ్రీపాద శ్రీనివాస్)
మద్దూరి జయరామయ్య, రాజమ్మ దంపతులకు నలుగురు మగ సంతతి. వారిలో పెద్ద వారు కోదండరామ దీక్షితులు. రెండవ వారు బుచ్చి వెంకయ్య, మూడవ వారు అన్నపూర్ణయ్య గారు, కడగొట్టు కుమారుడు కృష్ణమూర్తి.
మద్దూరి అన్నపూర్ణయ్య గారు 1899 సం. మార్చి 20 వ తేదిన జన్మించారు.
ప్రాధమిక విద్యాభ్యాసం పిఠాపురం సమీపంలో కొమరిగిరి, పెద్దాపురంలో జరిగింది. 1911 సం.లో కాకినాడ కళాశాల హైస్కూల్ లో III ఫాం ఎ సెక్షన్ లో ప్రవేశించారు. అదే తరగతిలోని సి సెక్షన్ లో అల్లూరి సీతారామరాజుగారు విద్యార్ధి.
దేశం కోసం తన 55 సంవత్సరాల జీవితంలో ఐదో వంతు పైగా జైల్లోనే గడిపిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు అన్నపూర్ణయ్య గారు.
స్వతంత్ర పోరాట సమయంలో 1922 సం లో “కాంగ్రెస్” పత్రికతో కలానికి పదును పెట్టింది మొదలు “నవశక్తి” “జయ భారత్” “వెలుగు” పత్రికలలో స్వాతంత్రానికి పూర్వం, మరియు తరువాత కూడ నిర్భయంగా కాలాన్ని గడిపిన ప్రధమ శ్రేణి పత్రికా సంపాదకుడు, గొప్ప స్వాతంత్య సమరయోధుడు అన్నపూర్ణయ్య గారు.
స్వతంత్ర పోరాట సమయంలో అన్నపూర్ణయ్య గారు జైల్లో మగ్గుతూంటే ఈయన కుటుంబం దారిద్రాన్ని అనుభవించింది. ఈయన భార్య రమణమ్మ మహా సాధ్వి. భర్తకు ఒక కార్డుకొని ఉత్తరం రాయడానికి కూడ డబ్బులు ఉండేవి కావట. తన దీనావస్ధను సూచిస్తూ భర్తకు రాసిన రెండు పంక్తులను తలచుకుంటే ఎవరికైనా కంటతడి పెట్టక తప్పదు. “ ఏ దినం మీరు కార్డు కోసం ఎదురు చూస్తారో ఆ దినం ఈ కార్డును చూసి తృప్తి పడండి” అని ఆమె తన భర్త అన్నపూర్ణయ్యగారికి ఉత్తరం వ్రాసిందట…! (ఈ విషయాన్ని రావినూతల శ్రీరాములు గారు తాను వ్రాసిన అన్నపూర్ణయ్యగారి జీవిత చరిత్ర పుస్తకంలో వ్రాశారు).
భర్త జైల్లో ఉన్నాడు… ఫలానాప్పుడు తిరిగి వస్తాడు అన్న పూచీకత్తు లేదు. ఆడపిల్లకు పెళ్ళీడు వచ్చింది. అత్యంత నిరాడంబరంగా బిడ్డకు పెళ్ళిచేసి, భాధ్యత నెరవేరిందన్న తృప్తితో తనువు చాలించింది ఆ మహా సాధ్వి.
వాస్తవానికి వీరి కుటుంబం ఒకప్పుడు గొప్పగా బ్రతికిన కుటుంబమే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణానికి 8 మైళ్ల దూరంలో కొమరిగిరి గ్రామం ఉండేది. మద్దూరి అన్నపూర్ణయ్యగారి తాతగారైన కోదండ రామ దీక్షితులు గొప్ప సంపన్నడు. ప్రతి దినం అతిధులకు అన్నదానం చేయడమే విధిగా పెట్టుకున్నాడు ఆయన. ఏ వర్ణం వారికి ఏ సమయంలో అయినా వారి ఇంట ఆతిధ్యం లభించేది. వీరి అన్నదాన కార్యక్రమాలు నాటి పిఠాపురం రాజావారి చెవిని సోకాయి.
రాజావారు మారువేషాలలో వేళకాని వేళ నూరు మంది పరివారంతో యాత్రికులుగా వేషాలు ధరించి తాము వ్యవసాయ పనుల మీద పొరుగురు నుండి వచ్చాయమని అన్నం పెట్టించమని అడిగారు. దీక్షితులు వారు ఏ మాత్రం నిరుత్సారం పడక సాదరంగా అందరీని అహ్వానించారు. అప్పటికప్పుడు పనివాళ్ళను పంపి నాలుగు బస్తాలను తెప్పించి అతిధులందరీకీ విందు భోజనాలు పెట్టించారంట…!
అన్నపూర్ణయ్య గారు అల్లూరి సీతారామ రాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి విప్లవ సేనానిలతో, గాంధీజీ, జయ ప్రకాశ్ నారాయణ లాంటి జాతీయ నాయకులతో భుజం భుజం కలిపి దేశం కోసం పోరాడిన ఆగ్రశ్రేణి నాయకుడు.
పుచ్చలిపల్లి సుందరయ్య గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఆచార్య రంగ గారు, పివిజీ రాజు గారు వీరందరికి అన్నపూర్ణయ్యగారిమీద గౌరవ భావం ఉండేది. ఐతేనేమి స్వాతంత్రం అనంతరం భారత రాజకీయాలలో అన్నపూర్ణయ్య గారికి స్ధానం లేకుండా పోయింది. ఆసెంబ్లీ ఎన్నికలలో రాజమండ్రి నుండి పోటిచేస్తే ఓటమిని చవిచూడల్సి వచ్చంది.
రావి నూతల శ్రీరాములు గారు వ్రాసిన మద్దూరి అన్నపూర్ణయ్య గారి జీవిత చరిత్ర పుస్తకంలో ఆయన త్యాగమయ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి.
అన్నపూర్ణయ్య గారి పేరిట రాజమండ్రిలోని మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి వారు గత రెండు దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం స్మారం అవార్డును ఇవ్వడం ద్వారా అన్నపూర్ణయ్యగారి దేశభక్తిని, నిరాడంబరతను మననం చేసుకుంటుంటారు..
గతం లో ఈ అవార్డును వావిలాల గోపాల కృష్ణయ్య.. సీనియర్ జర్నలిస్ట్ రాఘవకి ప్రదానం చేశారు.
2023 సం.లో రచయిత మరియు రేడియో కళాకారుడు అయిన శ్రీపాద శ్రీనివాసు కి ఇవ్వగా 2024 సంవత్సరానికి గాను అన్నపూర్ణయ్య స్మారక అవార్డును ప్రముఖవిద్యావేత్త, రిటైర్ హెడ్మస్టార్ ఆర్.వి.చలపతి రావుకు ప్రకటించారు…
…. అదే విధంగా మద్దూరి అన్నపూర్ణయ్య స్మారక పురస్కారాలను ద్రాక్షరామంకి చెందిన ఆధ్యాత్మిక, సామాజికసేవాపరుడు అంబటి భీమ శంకర సాయిబాబా, ప్రముఖ్య జర్నలిస్ట్ తటవర్తి రాంనారాయణ, అరవ నాగేంద్ర కుమార్, పి.వీరభద్రరావు, కోటిపల్లి నాగ సురేష్, గడి అన్నపూర్ణ రాజు, నూనెరామ్ గణేష్ శ్యాంసింగ్ కె.ఎల్. నరసింహరెడ్డి, మట్టి హరినాధ్ బాబు, కమ్మంపెట్టు వీర వెంకట సత్యనారాయణ తదితర సంఘ ప్రముఖులకు మార్చి 20 వ తేదిన అన్నపూర్ణయ్య గారి 125 వ జయంతి సందర్భంగా రాజమండ్రిలో అందచేయనున్నారు.
తెలుగు ప్రజలకు ప్రాతః స్మరణీయుడు
Date: