(మహాదేవ్, 9490646306)
అత్యధిక విజయోత్సవ చిత్రాల దర్శకులు – కమర్షియల్ చిత్రాల కు వ్యాకరణం రచించిన దర్శకేంద్రులు – శ్రీ కోవెలమూడి రాఘవేంద్రరావు గారి పుట్టిన రోజు ఈరోజు.
దర్శకులు గా ఆయన ప్రతిభ గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ సినిమా ప్రేక్షకుడి కి సుపరిచితమే.. కానీ,ఒక వ్యక్తిగా ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన దగ్గరగా చూసిన అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు..
రెండు సంవత్సరాలు ఆయనకు దగ్గరగా ప్రయాణించి ఆ మానవతామూర్తి గురించి తెలుసుకునే అదృష్టం నాకు దక్కింది..
ఈ వ్యాసం కేవలం ఆయన వ్యక్తిత్వం గురించి – తెలుగు ప్రజలకు తెలిపే ఒక చిన్న ప్రయత్నం.
A complete family man :
రాఘవేంద్రరావు గారి కుటుంబం చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం – వాళ్లందరికీ పెద్దాయన అంటే అపారమైన గౌరవం – భక్తి.
సాధారణంగా కుటుంబంలో ఎంత మంది చుట్టాలు ఉన్నా,అందులో కొందరే మన మనసుకి ఇష్టమైన వ్యక్తులు ఉంటారు.
కానీ గురువు గారికి మాత్రం తన కుటుంబం లో ఒకరూ,ఇద్దరు కాదు – ప్రతి ఒక్కరూ ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తులు.. అందరికీ ఒకే రకమైన ప్రేమను పంచే ప్రేమ మూర్తి ఆయన..
కేవలం కుటుంబం లోని వ్యక్తులకే కాకుండా, ఆయన RK సంస్థ లో పని చేసే ప్రతీ ఒక్కరినీ కుటుంబంలా భావించి ఆదరిస్తారు, అదే ఆయన వ్యక్తిత్వం లోని మొదటి ప్రత్యేకమైన గుణం.
కర్మ యోగి :
భగవత్ గీత లో జ్ఞాన,కర్మ,భక్తి,రాజ యోగాల లో రాఘవేంద్రరావు గారు కర్మ యోగాన్ని ఎంచుకుని తన జీవితం మొత్తాన్ని కేవలం సినిమా కి మాత్రమే అంకితం చేశారు.
84 ఏళ్ల వయస్సులో కూడా,ఇంకా యువ దర్శకులు,రచయుతల తో కలిసి,ప్రతీ రోజు కథా చర్చలు నడుపుతూ పని చేస్తునే ఉన్నారు.
రిటైర్మెంట్ అయ్యాక అందరూ హాయిగా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటారు,కానీ ఆయనకు నిజమైన విశ్రాంతి పని చెయ్యడమే అని భావిస్తారు.
ఆయన ఆరోగ్య రహస్యం లో ఈ ‘కర్మ యోగం’ కూడా ఒకటి.
అజాత శత్రువు :
ఈ ప్రపంచం లో మనం ఎంత మంచిగా ఉన్న,ఎంత ప్రయత్నంచినా ఏదో ఒక సమయం లో ఎవరో ఒకరు మనకు శత్రువు అవ్వడమో,లేదా మనం శత్రువుగా మారడమో సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది.
కానీ ఇలాంటి ప్రపంచం లో కూడా ఏ శత్రువు లేకుండా, అజాత శత్రువుగా బతకాలి అనుకోవడం అది చాలా గొప్ప ఆలోచన,ఆశయం – అదే రాఘవేంద్రరావు గారి కోరిక.
అలా కోరుకోవడమే కాదు ఆచరించి చూపిస్తారు ఆయన.
నాకు తెలిసి, ఇప్పటికీ నూటికి 99 శాతం మందికి ఆయన అజాత శత్రువు ఏ.
వ్యాపార వేత్త :
సినిమా అనే ఈ రంగు రంగుల ప్రపంచంలో రంగులు మార్చే ఊసరవెల్లులు ఎంతో మంది.,
విచిత్రం గా ఈ సినిమా వ్యాపారం,అలాంటి అనేక రకాల మనుషులతో ముడిపడి ఉంటుంది.
ఆ ఊసరవెల్లిలు కి కూడా యూనిఫార్మ్ని ఇచ్చి, ఒకే త్రాటిపైకి తీసుకొచ్చి పని చేయించుకున్న వాడే ఇక్కడ విజేత.
అలాంటి విజేతలుగా నిలబడిన అతి తక్కువ మందిలో రాఘవేంద్రరావు గారు ఒకరు
Investing in the future అంటే investing in the materials కాదు, investing in the people అనే సూత్రాన్ని నమ్మిన వ్యాపార వేత్త ఆయన.
ఆయన నమ్మి అవకాశం ఇచ్చిన వ్యక్తులు ఈరోజు, ప్రపంచం అంతా విజయ కేతనాన్ని ఎగురువేస్తూ,ఒక గురువుగా వారి కీర్తి ప్రతిష్టలుని రెట్టింపు చేస్తున్నారు.
గురువులు – మార్గదర్శకులు :
ఇండస్ట్రీలో తన ప్రతిభ ని చూపించి పైకి రావాలి అని ఎంతో మంది ఆశపడతారు..
వాళ్ళందరూ పై పైకి ఎగిరే గాలి పటాలు లాంటి వాళ్ళు.
గాలి పటానికి ఎంత శక్తి ఉన్నా,ఏదో ఒక మూల,ఎవరో ఒకరు పట్టుకుని, దిశని నిర్దేశించకపోతే – మహా వృక్షపు కొమ్మ కోరల్లో చిక్కుకుపోయి చిరిగిపోతుంది.
ఈ సినిమా పరిశ్రమ లో ఎందరికో రాఘవేంద్రరావు గారు చేయూత ని ఇచ్చి,ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దారు.
ఇన్నేళ్ల సినిమా చరిత్ర లో వెనక్కి తిరిగి చూస్తే,కొత్త వారిని ప్రోత్సహించి వెన్ను తట్టి నిలబడిన అతి తక్కువ మంది వ్యక్తులలో ఈయన ముందు వరుసలో ఉంటారు.
అలాంటి వ్యక్తి మాకు కూడా గురువులు అని చెప్పుకోవడం మాకు ఎంతో అదృష్టం.
దాతృత్వం :
రాఘవేంద్రరావు గారి దగ్గర దానాలు,గుప్త దానాలు పొందిన వ్యక్తులు కోకొల్లలు..
రాఘవేంద్రరావు గారి సినిమా షూటింగ్ అంటే పెళ్లి భోజనం తిన్నట్టు ఉంటుంది.
ఆయన ఏం తింటారో అందరికీ అదే వడ్డిస్తారు.
ఆయన RK సంస్థ లో కూడా మధ్యాహ్నం పూట,అక్కడ పని చేసే వ్యక్తులే కాదు,అప్పుడప్పుడు బయట వాళ్ళు కూడా సొంత ఇంటికి వచ్చినట్టు వచ్చి భోజనం చేసి వెళ్తుంటారు.
అలా భోజనం చేస్తూ ఎంతో మంది ఎన్నో సార్లు,పెద్దాయన వల్లనే ఇలాంటి భోజనం చేయగ్గల్గుతున్నాం, ఆయన నిజంగా నిండు నూరేళ్లు హాయిగా ఉండాలి అని దీవించడం చాలా సందర్భాల్లో నా కళ్లారా చూసాను.

చివరిగా సినిమా గురించి :
రిక్షా వాడి నుంచి కలెక్టర్ వరకు, వారి యొక్క ఆలోచనా స్థాయిలో తేడా ఉంటుంది కానీ,స్పందించే హృదయం ఒకేలా ఉంటుంది.
మనం తీసే సినిమా ఎప్పుడూ మనస్సును తాకేలా ఉండాలి అని తరుచూ చెప్తుంటారు,
అదే ఆయన సినిమాల లో కూడా ఆచరించి చూపించారు.
అందుకే రాఘవేంద్రరావు గారి సినిమా ప్రేక్షకులకు ఒక కన్నుల పండుగ.
ఎన్ని సార్లు అయినా చూడాలనిపించే ఒక అద్భుత దృశ్యకావ్యం.
ఇన్ని విశిష్ట గుణాలు,విశేషాలు కల మా వెండి తెర బంగారు కొండకి,మా గురువు గారికి ప్రణమిల్లుతూ జన్మ దిన శుభాకాంక్షలు.

(Author is a Tollywood actor)

