వివాదంలోకి కుటుంబాన్ని లాగడం ఎందుకు?
ట్వీట్లను విశ్వవ్యాప్తం చేసేది మనమే!
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
ప్రచారం కోసం ఏదో ఒకటి అనడం… ఆపై నాలుక కరుచుకోవడం… లేదా సారీ చెప్పడం.. ఎందుకిదంతా హుందాగా ఉంటే పోలా…
సర్లే హుందాతనం అంటే అర్థమే తెలియని వారికి ఏం చెబుతామంటూ నెటిజన్ల సన్నాయి నొక్కులు. ఇదంతా ట్విటర్‌లో పాప్యులర్ అయిన వారి గురించే. తాజాగా రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ మహిళలకు ఆగ్రహాన్ని కలిగించింది. తెలకపల్లి రవిలాంటి మేధావులు ఇది తప్పని ఖండించారు. అందుకు సహేతుక కారణాలనూ వివరించారు. రామ్‌గోపాల్ వర్మ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిని ఉద్దేశించి చేసిన ట్వీట్‌పై రేగిన వ్యతిరేకత అంతాఇంతా కాదు. ఆ ట్వీట్‌ను తిరిగి చెప్పడమూ నా ఉద్దేశం కాదు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థి అని తెలియగానే వర్మ తనదైన శైలిలో ట్వీట్ వదిలారు. చాలాసేపటి వరకూ అది ఆయన సర్కిల్‌లోనూ చక్కర్లు కొట్టింది. కొంతమంది దానికి విపరీతార్థం తీయడానికి ప్రయత్నించారు. అది విమర్శలు, కువిమర్శల స్థాయికి చేరిపోయింది.
ఎక్కడ మొదలెట్టాలో కాదు… ఎక్కడ ఆపాలో తెలిసుండాలనేది నానుడి. ఇది వర్మకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. ఒక నెటిజన్ అయితే… వర్మ కుటుంబ సభ్యులను కూడా ఈ వివాదంలోకి లాగారు. ట్వీట్ చేసి వివాదం సృష్టించింది వర్మ కానీ ఆయన కుటుంబ సభ్యులు కాదు కదా? ఇప్పటికే ఆయనపై ఓ బీజేపీ నేత పోలీసు కేసు కూడా పెట్టారు కదా. అలాంటప్పుడు ఇది సబబా? ఈ దేశంలో ఏదైనా సబబే. మనకి కావాలనుకుంటే ఏమైనా చేస్తాం.. లేదంటే మాట్లాడకుండా ఊరుకుంటాం. దీన్నంతా గమనించిన రాము తన ట్వీట్‌లో ఏ దురుద్దేశమూ లేదంటూ మరో ట్వీట్ చేశారు. ఆమె పేరుకున్న ప్రాముఖ్యత దృష్ట్యా అలా ట్వీట్ చేశానన్నారు. మహిళలంటే తనకు అపారమైన గౌరవమూ ఉందని అందులో పేర్కొన్నారు.
ఇదే మొదటిసారా?
ఆర్జీవీ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. సినిమా దర్శకుడిగా ఆయన తనకున్న ప్రాచుర్యాన్ని మరింత పెంచుకుంటారు. నిత్యం వార్తల్లో నిలవాలని చూస్తారు. అప్పుడప్పుడు ఇలా ఎదురుతిరుగుతుంటాయి. అలాంటి సందర్భాలలో ఆయన తన ట్వీట్‌కు వివరణ ఇస్తారు. టీచర్స్ డే నాడు టీచర్స్ బ్రాండ్ లిక్కర్ బాటిల్ పెట్టి ట్వీట్ చేసిన ఘనత కూడా ఆయనదే. ఇలా చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. సాధారణంగా ఆయన తన సినిమాలు విడుదలైనప్పుడో… ఎవరైనా రాజకీయ నాయకులు నోరు జారినప్పుడో తన ట్విటర్ పిట్టకు పని చెబుతాడు. పవన్ కల్యాణ్ విషయంలో ఆయన ఎన్నో విమర్శనాత్మక ట్వీట్లు చేసిన విషయం మనకు తెలిసిందే.
శోభా డే సంగతి మరిచారా?
ఒక పోలీసు కానిస్టేబుల్ స్థూలకాయంపై శోభా డే చేసిన ట్వీట్‌ను అప్పట్లో యావద్దేశం గర్హించింది. పోలీసు శాఖ కూడా ఆ ట్వీట్‌ను ఖండించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం ప్రధాని మోడీని చోర్ అంటూ ట్వీట్ చేయడం చూశాం. తరవాత వెనక్కితగ్గారు. ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ట్వీట్ లంటే ఎంతమందికి చేరతాయి. ఎంతమందికి ట్విటర్ అకౌంట్లు ఉన్నాయి. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నా ఎన్ని లైకులు వస్తాయి. కానీ, మనం మంచి ట్వీట్లను విస్మరిస్తున్నాం. చెడ్డ ట్వీట్లను మాత్రం విశ్వవ్యాప్తం చేస్తున్నాం. ఆ క్రమంలో మన పరువు మనమే తీసుకుంటున్నాం. కాదంటారా? అలాంటి ట్వీట్లు చేయడం నిస్సందేహంగా తప్పే. ట్వీటేముందు దానివల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే అంశాన్ని ఒక్కసారి ఆలోచిస్తే అందుకు తావుండదు కదా! అక్కడితో ఆపేయకుండా కుటుంబాల్నీ, కుటుంబ సభ్యుల్నీ వివాదంలోకి లాగడం తప్పు. ఇది అందరికీ వర్తిస్తుంది.