Home Breaking News డెడ్ లైన్ ముందు తప్పు బయటపడితే….

డెడ్ లైన్ ముందు తప్పు బయటపడితే….

0
డెడ్ లైన్ ముందు తప్పు బయటపడితే….

పాఠం నేర్పిన అంశం
సమయస్ఫూర్తి నేర్పిన ఘటన
నేను – ఈనాడు: 36
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)


అలా ప్రింట్ అయిన దినపత్రికలను కట్టలు కట్టి ఏ ఊరుకు వెళ్ళాలో ఆ టాక్సీకి ఎక్కించేవారు. అంతే టాక్సీలు దూసుకుంటూ గమ్యస్థానం వైపు బయలుదేరేవి. ఇప్పటి మాదిరిగా ఈనాడుకే కాదు… ఏ పత్రికకూ ఇన్ని యూనిట్లు లేవు. ఈ కారణంగా ఒక టాక్సీలో ఒక జిల్లాకు సంబంధించిన పత్రికల కట్టలు పంపేవారు. నెట్ వర్క్ వారీగా వాటిని కొన్ని సెంటర్లలో వేసేవారు. అక్కడినుంచి ఏజెంట్లు వాటిని గ్రామాలకు, ఆపై పాఠకులకూ చేర్చేవారు. అప్పట్లో అంతే. 1990 నాటికి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, కరీంనగర్ లలో మాత్రమే ఈనాడు యూనిట్లు ఉండేవి. ఆయా యూనిట్లలో వాటి పరిధికి చెందిన జిల్లా డెస్కులన్నీ పనిచేసేవి. హైద్రాబాదు నుంచి మెయిన్ పేజీ ఫేసిమిలి ద్వారా వచ్చేది. మెయిన్ మొదటి పేజీలో ఆ యూనిట్ కి సంబంధించిన ముఖ్య వార్తను మార్చి ప్రింట్ చేసి, జిల్లా అనుబంధాలను కట్టలు కట్టి పంపేవారు. ఇంత ప్రక్రియ ఉన్నప్పటికీ పత్రిక ఉషోదయానికి ముందే పాఠకుడి ఇంటికి చేరేది. ఇలా చేరడం వెనుక వందలమంది శ్రమ, కఠోర దీక్ష ఉండేవి.

సమయానికి పత్రికను ఇంటికి చేర్చడానికి చేసే కృషి చిన్న తప్పిదం వల్ల దెబ్బతింటే… అది సంస్థకే చెడ్డపేరు తెస్తుంది. ఇలాంటి సమయంలో ఆ తప్పిదాన్ని ఎంత తక్కువ సమయంలో సరిదిద్దామనేది ముఖ్యం. 1989 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎల్లవరం అసెంబ్లీ నియోజకవర్గ విశ్లేషణను ఒకరోజు నేను రాశాను. ఆ సందర్భంలో మాజీ ఎం.ఎల్.ఏ. పేరును తప్పుగా ఉదహరించాను. ఇంచార్జి పిఎస్సార్ గారు, మరొకరూ చూశారు. తప్పు దొరకలేదు. అందుకు సంబంధించిన పేజీ ప్లేట్ తయారీకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈలోగా మరోసారి ఫిల్ములో నేను రాసిన వార్తను చదువుతున్నాను. ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. కారణం నేను చేసిన తప్పిదం అప్పుడు కనిపించింది. ఉద్యోగంలో చేరి ఆరు నెలలు కూడా కాలేదు. తప్పు వస్తే శిక్ష ఎలా ఉంటుందో తలచుకుని, వణికిపోయా… తిడితే తిట్టారని అనుకుంటూ పాలుపోని స్థితిలో ఆ తప్పును పి.ఎస్.ఆర్. గారికి చూపించాను.

అప్పుడే ఆయన మొదటి పేజీ ఇచ్చేసి రిలాక్స్ అవుతున్నారు. నేను చెప్పిన విషయం విని, గబగబా ఆ టేబుల్ దగ్గరకు వచ్చారు. అప్పుడు అక్కడ ప్రాసెస్ డిపార్టుమెంటుకు చెందిన అన్నే శ్రీనివాస్ ఉన్నారు. పి.ఎస్.ఆర్. గారు ఆ తప్పు చదివి… అన్నే శ్రీనివాస్ కు ఒక సూచన చేశారు. మాజీ ఎమ్మెల్యే అని మాత్రమే ఉంచి… పేరు చెరిపెయ్యమని చెప్పారు. అతను పేరును జాగ్రత్తగా చెరిపేసాడు. అతి తక్కువ వ్యవధిలో తప్పును సరిదిద్దడానికి సమయస్ఫూర్తి కావాలనే విషయం ఈ సంఘటనతో తెలుసుకున్నాను. తరవాత పి.ఎస్.ఆర్. గారు కూడా… తప్పును గమనిస్తే కంగారు పడకూడదు… ఎలా సరిదిద్దాలో ప్రశాంతంగా ఆలోచించాలి.. ఆచరించాలి అంతే అని చెప్పడం ఇప్పటికీ, నాకు గుర్తుంది.

ఇది ఏ తరం పాత్రికేయులకైనా ఆదర్శనీయం, ఆచరణీయం. ఈ సందర్భంలో రాజమండ్రి యూనిట్లో డెస్క్ ఇంచార్జి అయిన ఏ.వి.ఎం.హెచ్.ఎస్. శర్మగారు చెప్పిన విషయం కూడా జ్ఞాపకం వస్తోంది.

ఎప్పుడైనా, ఏ వార్త గురించైనా కంగారు పడుతుంటే… ఎందుకంత ఆదుర్దా? ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి. పెద్ద నాయకుడు హత్యకు గురయ్యాడని వార్త గురించి తెలిసినా… కూల్ గా ఆహా అలాగా అని… పనిలో నిమగ్నం కావాలి తప్ప, హడావిడి పడకూడదని… అది తప్పులకి దారి తీస్తుందని చెప్పేవారాయన.

ఇలా ఎన్నో సందర్భాలలో, శర్మ గారు చాకచక్యంగా వ్యవహరించి పనిని చక్కబెట్టేవారు. ఏజెన్సీలో ఎన్కౌంటర్లు, నక్సల్స్ హత్యలకు పాల్పడిన సందర్భాలు, మందు పాతరలు పేల్చిన ఘటనలు… ఇంకా ప్రమాదాలు, కీలకమైన సభలు, సమావేశాలు… ఇలా ఎన్నెన్నో చూశాము. ఒకానొక సందర్భంలో నక్సల్స్ అడ్డతీగల మండల రిపోర్టర్ సత్యనారాయణను కూడా కిడ్నాప్ చేశారు. వచ్చే ఎపిసోడ్స్ లో ఈ వివరాలు అన్నింటినీ రాస్తాను.

ఈ ఎపిసోడ్ ముగించేముందు… యానాం – ఎదుర్లంక వంతెన పూర్తికావడానికి సలహా ఇచ్చిన పరసా సుబ్బారావు ఉదంతాన్ని చదివిన జాజిశర్మ గారనే ఒక బ్యాంకు ఉద్యోగి చేసిన వ్యాఖ్యను ఇక్కడ రాస్తున్నాను.

పరసా సుబ్బారావు గారు పద్మ అవార్డుకు అర్హులు. ఇలాంటివారిని పద్మ అవార్డులు వరించాలి అంటూ నాకు మెసేజ్ పెట్టారు. నిజమే కదూ…

ఒక పత్రిక పని విధానం ఎలా ఉంటుందంటే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here