దగ్గు మందు పేరిట పిల్లలకు తమిళనాడు విషం!

0
176

ఔషధ నియంత్రణలో వైఫల్యం
(నవీన్ పెద్దాడ)

కోల్డ్‌రిఫ్ దగ్గు మందు విషాదం భారతదేశ ఔషధ నియంత్రణ వైఫల్యాన్ని చూపించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాలలో సుమారు 20 మంది పిల్లలు ఈ మందు తాగి చనిపోయారు. ఈ ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను ప్రశ్నించింది.

తమిళనాడుకు చెందిన శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ ఈ కోల్డ్‌రిఫ్ దగ్గు మందును తయారు చేసింది. చనిపోయిన పిల్లలు ఈ మందు తీసుకునేనవారే! ప్రయోగశాల పరీక్షల్లో మందులో డైఎథిలీన్ గ్లైకాల్ (డి ఇ జి ) విష రసాయనం ఉన్నట్లు తేలింది. డి ఇ జి ఒక పారిశ్రామిక ద్రావకం. దీనిని మందులలో ఉపయోగించకూడదు. ఈ రసాయనం కిడ్నీలను దెబ్బతీస్తుంది. ఇది తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం, మరణానికి కారణమవుతుంది.

కోల్డ్‌రిఫ్ నమూనాలో 46% వరకు డి ఇ జి కనుబడింది. మందులలో కేవలం 0.1% మాత్రమే అనుమతిస్తారు. ఈ స్థాయిలో విషం ఉండడం అంటే నాణ్యతను పూర్తిగా విస్మరించడం. కొందరు తయారీదారులు చవకైన డి ఇ జి ని ఖరీదైన ప్రొపైలిన్ గ్లైకాల్ బదులు వాడతారు. ఇది ఆర్థిక నేరం.

శ్రీసన్ ఫార్మా సంస్థలో భద్రతా ప్రమాణాలు లేవు. తమిళనాడు డ్రగ్ కంట్రోల్ విభాగం తనిఖీలో 350కి పైగా లోపాలు గుర్తించారు. ఫ్యాక్టరీలో మురికి వాతావరణం ఉంది. యంత్రాలు తుప్పు పట్టాయి. నాణ్యతా హామీ (Quality Assurance) విభాగం లేదు. ముడి పదార్థాలను పరీక్షించకుండానే మందుల తయారీకి విడుదల చేశారు. యజమాని జి. రంగనాథన్‌ను అరెస్టు చేశారు.

భారత్‌లో ఔషధాల ఉత్పత్తి నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. తయారీ లైసెన్సులను రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ జారీ చేస్తారు. ఈ సంస్థ లోపాలు ఉన్నా తమిళనాడు ప్రభుత్వం లైసెన్సును రద్దు చేయలేదు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ప్రమాణాలను నిర్దేశిస్తుంది. కానీ అమలు, తనిఖీలలో రాష్ట్రాలదే కీలకం.

సరఫరా చేసిన మందుల స్వచ్ఛతను పరీక్షించడం వైద్యులకు సాధ్యం కాదు. నియంత్రణ సంస్థలే దీనికి బాధ్యత వహించాలి. ఈ సంస్థ ఇంతకుముందు కూడా విదేశాలలో భద్రతా సమస్యలు ఎదుర్కొంది. అయినప్పటికీ ఉత్పత్తి కొనసాగించడానికి అనుమతి ఇచ్చారు. ఇది వ్యవస్థాగత వైఫల్యం. ఇందులో రాజకీయ శక్తుల ప్రభావం, తప్పుడు ఉత్పత్తులు చేసేవారి పలుకుబడి ఇలాంటి వైఫల్యాలకు అసలు కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ విషాదం తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు కోల్డ్‌రిఫ్ అమ్మకాలను నిషేధించాయి. మహారాష్ట్ర కూడా బ్యాచ్ నంబర్ SR-13 అమ్మకాన్ని వెంటనే నిలిపి వేయాలని ఆదేశించింది. CDSCO అన్ని రాష్ట్రాలలో ముడి పదార్థాలను ప్రతి బ్యాచ్‌లో పరీక్షించాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రపంచ ఆరోగ్య సంస్ఝ భారత్‌ను సంప్రదించింది. ఈ విష మందులు దేశం నుంచి ఎగుమతి అయ్యాయా అని ఆరా తీసింది. ఈ సమాధానం ఆధారంగా ప్రపంచ వైద్య ఉత్పత్తుల హెచ్చరిక జారీ చేయాలా వద్దా అని నిర్ణయిస్తారు.

భారతదేశంలో ఇలాంటి ఘటనలు కొత్త కాదు. 2022లో గాంబియాలో 70 మంది పిల్లలు. ఉజ్బెకిస్థాన్‌లో 20 మంది పిల్లలు భారతీయ దగ్గు మందుల ద్వారా చనిపోయారు. ఆ ఘటనల తర్వాత ఎగుమతి చేసే మందులకు కఠిన పరీక్షలు తప్పనిసరి చేశారు.

అయితే దేశీయ మార్కెట్లో అమ్మే మందులకు ఆ కఠిన పరీక్షలు లేవు. ఈ విషాదం నియంత్రణలోని ఈ లోపాన్ని చూపించింది. ప్రజారోగ్య భద్రత కోసం దేశీయ మందుల నాణ్యత తనిఖీని బలోపేతం చేయాలి.


(వ్యాస రచయిత ప్రముఖ జర్నలిస్ట్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here