ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిత్ ముదిరాజ్ నాయకత్వంలో ఆందోళన
హైదరాబాద్, మార్చి 31: పార్లమెంటులో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రజాగాయకుడు గద్దర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఖైరతాబాద్ డిసిసి నిరసన తెలిపింది. డిసిసి అధ్యక్షుడు మోతా రోహిత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మని దహనం చేశారు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి చౌరస్తా లో కాంగ్రెస్ నాయకులు ఈ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మోతా రోహిత్ మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో గద్దర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు తెలంగాణకు సంబంధించిన ఎంపీలు ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నవ్వుతూ మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ బిజెపి ఎంపీలు తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షాన బిజెపి ఎంపీలను తెలంగాణలో తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు. బిజెపి కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారికి గద్దర్ మార్గ్ అని పేరు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
అమిత్ షా క్షమాపణకు డిమాండ్
తెలంగాణకు గర్వకారణం, ప్రజాకవి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన గద్దర్ని అవమానించడం అంటే తెలంగాణ ఆత్మను అవమానించినట్టేనని హైదరాబాద్ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సినవన్నారు. ఈ అవమానంపై వెంటనే దేశానికి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ నాయకులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అరవింద్ వంటి వారు ఈ అవమానంపై స్పందించకుండా మౌనంగా ఉండటం బాధాకరమన్నారు. తమ పార్టీ పెద్దల ముందు తలవంచి, తెలంగాణ గౌరవాన్ని కాపాడలేకపోతే, ప్రజల ముందు ఎలా నిలబడతారు? వెంటనే ఈ ముగ్గురు నాయకులు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు.
ఇదే సమయంలో, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు కూడా ఈ విషయంపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. గద్దర్‌ను ఎప్పుడూ తమకు అనుకూలంగా ఉపయోగించుకున్న బీఆర్ఎస్, ఇప్పుడు మౌనం వహించడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని బహిర్గతం చేస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ మాత్రం ఈ అవమానాన్ని సహించలేదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వీధుల్లోకి వచ్చి తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈ వ్యాఖ్యలపై నవ్వుతూ మౌనంగా ఉండటాన్ని తీవ్రంగా ఖండిస్తూ, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణలో వారికి తిరగనివ్వమని హెచ్చరించారు.
తెలంగాణ గౌరవం కోసం, గద్దర్ గారి స్మృతి కోసం—ఈ అవమానానికి ప్రతి ఒక్కరూ గట్టిగా ఎదురు నిలవాల్సిన సమయం వచ్చింది. తెలంగాణ ఆత్మను తక్కువ చేసి చూడాలనుకునే వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరని నేతలు స్పష్టం చేసారు.

