ఇక జాతీయ రాజకీయాలపై దృష్టి
నూతన వ్యవసాయ చట్టాల రద్దుతో ఉత్సాహం
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా కొత్త మలుపు తిరగబోతున్నాయా? ఇప్పటి దాకా తీసుకున్న నిర్ణయాలపై కఠినంగా వ్యవహరించి, వెనుదిరిగి చూడని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హఠాత్తుగా వెనక్కితీసుకున్న తొలి నిర్ణయం పరిణామాలు ఇందుకు తావిచ్చాయా? ఎడతెగని రాజకీయాలతో మునిగి తేలే మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, మాయావతి వంటి బీజేపీ వ్యతిరేక నేతలలో మోడీ నిర్ణయం ఉత్సాహాన్ని నింపింది. సరే కేరళలోని ఎల్డీఎఫ్ ఎప్పుడూ బీజేపీకి వ్యతిరేకమే. తాజాగా ఆ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చేరారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకుంటే చాలా వరకూ ఆయన మోడీ ప్రభుత్వానికి అండగానే నిలిచారు. తీసుకున్న నిర్ణయాలకు మద్దతు పలికారు. అదే సమయంలో మనం ప్రధాని నిర్ణయానికి మద్దతుగా నిలవాలి. కొంత సమయం ఇవ్వాలి. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇది అవసరమని డీ మానిటైజేషన్ నిర్ణయ సమయంలో బహిరంగంగానే మద్దతు పలికారు. చూద్దాం.. నిర్ణయం మంచిది కాదనుకుంటే వ్యతిరేకిద్దాం అంటూ సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. ఇలా కేంద్రానికి అనేక సందర్భాలలో బాసటగా నిలిచారు. ఈ వైఖరి చూసి, మోడీకీ, కేసీఆర్‌కూ లోపాయకారీ ఒప్పందం ఏదో ఉందని చెవులు కొరుక్కున్న వారూ లేకపోలేదు. ఎన్నికల సమయంలో మాత్రం కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగానే గొంతు వినిపించారు. జాతీయ నాయకులను కలిశారు. తృతీయ ప్రత్యామ్నాయానికి ప్రయత్నించారు. ప్రతిపక్ష నేతలలో అనైక్యత కారణంగా ఇది సఫలం కాలేదు.
మనసు మార్చిన ధాన్యం కొనుగోలు అంశం
తెలంగాణలో ఈ ఏడాది ధాన్యాన్ని కొనలేమని కేంద్రం చెప్పిన అంశాన్ని రాజకీయం చేయాలని బీజేపీ ప్రయత్నించింది. రాష్ట్రంలో వరి ధాన్యాన్ని సాగు చేసి తీరాల్సిందేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేయడమే కాకుండా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, ధర్నాలు దిగడం చేశారు. ఇది కేసీఆర్‌ను డిఫెన్స్‌లోకి నెడుతుందని బండి సంజయ్ ఊహించారు. ఇక్కడే కేసీఆర్ చురుగ్గా వ్యవహరించి, తన ఉద్యమ అస్త్రాన్ని బయటికి తీశారు. తమ పంథాను విస్షష్టంచేశారు. ధాన్యం కొంటామనే కేంద్రం చెబితే, తమకే అభ్యంతరం లేదనీ, 70లక్షల ఎకరాల్లో వరి పండించగలమని కేసీఆర్ స్పష్టంచేశారు. ఇందుకు కేంద్రానికి డెడ్ లైన్‌పెట్టారు. దానికి ముందు ఈ నెల 18న ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో తమ ప్రజాప్రతినిధులతో ధర్నాకు దిగారు. వరి కొంటారో కొనరో స్పష్టంచేయాలనీ, రణం చేయడం తమకు కొత్త కాదనీ, ఇందులో దేశంలోని ఏ పార్టీ టీఆర్ఎస్‌కు సాటి రావనీ స్పష్టంచేశారు.
ప్రధాని ప్రకటనతో వ్యూహం మార్పు
వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఏడాది పాటు రైతులు చేసిన ఆందోళనలను అర్థం చేసుకున్నాననీ అంటూ తొలిసారి క్షమాపణ కూడా చెప్పారు. ప్రధాని ప్రకటనలో వరి ధాన్యాన్ని కొంటామనే అంశం ప్రస్తావన లేనప్పటికీ, చట్టాల రద్దు కేసీఆర్‌లో ఉత్సాహం నింపింది. తదుపరి కార్యాచరణ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనతో పాటు మంత్రులు, అధికారులు కూడా వెడుతున్నారు. వివిధ అంశాలపై అమీతుమీకి కేసీఆర్ సిద్ధమవుతున్నారు.
తృతీయ ప్రత్యామ్నాయానికి సిద్ధమా!
కిందటి సాధారణ ఎన్నికల్లో కేసీఆర్ తృతీయ ప్రత్యామ్నాయానికి చేసిన యత్నం ఫలించకపోవడంతో, అంతా ఆయన సైలెంట్ అయిపోయారనుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆ అస్త్రాన్ని బయటకు తీశారు. ప్రజా ప్రయోజనాలు ముఖ్యంగా రైతులపై రాజీ పడే ప్రసక్తే లేదనీ మూడు రోజుల వ్యవధిలో నిర్వహించిన రెండు విలేకరుల సమావేశాల్లో సుస్పష్టం చేశారు. ఇక్కడే కేసీఆర్ సమయస్ఫూర్తి వెల్లడైంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన వ్యూహాలను రచిస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. అది సఫలమైనట్లే కనిపిస్తోంది. వరిని కొంటారా లేదా అని అడిగితే దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనకు కారణమైన వ్యవసాయ చట్టాలు మూడింటినీ రద్దు చేస్తున్నట్లు మోడీ ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తారు. వాస్తవానికి ఈ సమస్యనుంచి బయటపడడానికి మోడీ ఎప్పటి నుంచో దారులు వెతుకుతున్నారు. కేసీఆర్ రూపంలో వచ్చిన డిమాండ్ దీనికి ఆలంబనగా నిలిచింది. కేసీఆర్ ఆశిస్తున్నట్లు ఇప్పుడు కనుక అఖిలేశ్, మమత, కేజ్రీవాల్ వంటి నేతలు ఒకటైతే తృతీయ ఫ్రంట్ ఎంతో దూరంలో లేనట్లే.