రోశయ్యకు సీఎం కేసీఆర్ శ్రద్ధాంజలి
కుటుంబ సభ్యులకు పరామర్శ
మూడు రోజుల సంతాప దినాలు
హైదరాబాద్, డిసెంబర్ 4: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (88) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మరణవార్త తెలిసిన వెంటనే హైదరాబాద్లోని రోశయ్య నివాసానికి చేరుకుని రోశయ్య పార్ధీవ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి, నివాళులర్పించారు.
శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఆర్ధిక శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య.. సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన ప్రత్యేక శైలిని హూందాతనాన్ని సిఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు – సంతాప దినాలు :
మాజీ సిఎం కొణిజేటి రోశయ్య మృతిపట్ల రాష్ట్ర ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. రోశయ్య అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది.
మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. రోశయ్య పార్దీవ దేహానికి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి, హైదారబాద్ కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.