భారతీయ రాష్ట్ర సమితి కావాలంటున్న ముఖ్యమంత్రి
ఎమ్మెల్యేల ఆకాంక్ష ఇదేనంటూ వ్యాఖ్య
ఆసక్తి రేపిన టీఆర్ఎస్ ప్లీనరీలో కె. చంద్రశేఖరరావు ప్రసంగం
హైదరాబాద్, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితిగా రూపొందనుందా? 21వ పార్టీ ప్లీనరీలో మంగళవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మాటల అంతరార్థం ఇదేనా? ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌ను బిఆర్ఎస్‌గా రూపుదిద్దాలని కోరుతున్నారని అనడం దీనికి సంకేతమేనా? ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గాంధీని దూషించడం, గాంధీ హంతకులను పూజించడం, పాత వివాదాలను తోడడం, తమ అవసరాల కోసం టిర్ఎస్ పార్టీకి తెలంగాణ కంచుకోట అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
నిబద్ధమైన పార్టీ టిఆర్ఎస్
నిబద్ధమైన, సువ్యవస్థితమై కొలువుదీరిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ పేర్కొన్నారు. 80 శాతం మంది పరిపాలన భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులతో, 60 లక్షల మంది సభ్యులతో, సుమారు వెయ్యి కోట్ల ఆస్తులు కలిగి ఉన్న సంస్థగా అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్ర సాధన జరిపి, సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షతంగా తీర్చిదిద్దుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ కాపలాదారు టీఆర్ఎస్
టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోట. ఎవరూ కూడా బద్దలు కొట్టలేని కంచుకోట అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ఈ పార్టీ యావత్తు తెలంగాణ ప్రజల ఆస్తి. ఇది ఒక వ్యక్తిదో, శక్తిదో కాదు. తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్ఎస్ పార్టీ. అనుక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను, ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారు టీఆర్ఎస్ పార్టీ సీఎం పేర్కొన్నారు.
తెలంగాణ దేశానికే రోల్‌మోడల్
రెండు దశాబ్దాల క్రితం ఏడుపు వస్తే కూడా ఎవర్ని పట్టుకొని ఏడ్వాలో తెలువని పరిస్థితి అని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర అస్థిత్వమే ఆగమయైపోయే పరిస్థితి. ఒక దిక్కుతోచని సందర్భంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్రజల గుండెల నుంచి ఈ గులాబీ జెండా ఎగిసిపడింది. అపజయాలు, అవమనాలు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించాం. రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ప్రజల దీవెనతో అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం. దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ నిలిచింది అని కేసీఆర్ తెలిపారు.
అవార్డులు మన పనితీరుకు మచ్చుతునక..
కేంద్ర ప్రభుత్వం అనేక పద్ధతుల్లో వెలువరిస్తున్న ఫలితాలు, అవార్డులు, రివార్డులే మన పనితీరుకు మచ్చుతునక అని కేసీఆర్ పేర్కొన్నారు. నిన్న విడుదల చేసిన ప్రకటనలో దేశంలో అతి ఉత్తమైన పది గ్రామాలు తెలంగాణవే నిలిచాయి. ఈ విషయాన్ని కేంద్రమే స్వయంగా ప్రకటించింది. మన పనితీరుకు ఇది మచ్చుతునక అని చెప్పారు. కేంద్రం నుంచి అవార్డు రానటువంటి డిపార్ట్‌మెంట్ తెలంగాణలో లేదన్నారు. ఒక నిబద్ధమైన పద్ధతిలో, అవినీతిరహితంగా, చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నాం. కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ ఇవాళ జలభాండగారంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ చానెళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి, సీతారామ పూర్తి చేసుకుంటే తెలంగాణలో కరువు ఉండనే ఉండదని స్పష్టం చేశారు.
అన్ని రంగాల్లో అద్భుత ఫలితాలు..
విద్యుత్ రంగంలో దేశమంతా కారు చీకట్లు కమ్ముకున్న వేళలో వెలుగు జిలుగుల తెలంగాణను ఏర్పాటు చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఇది మన అంకిత భావానికి మంచి ఉదాహరణ. ఏ రంగంలో అయినా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాం. ఎందరో మహానుభావులు, గొప్పవాళ్లు, పార్టీకి అంకితమై పని చేసే నాయకుల సమాహారమే ఈ ఫలితాలకు కారణం అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలే ఇతివృత్తంగా పని చేస్తున్నాం. గొప్పలు చెప్పుకొని పొంగిపోవడం లేదు.. వాస్తవాలు మాట్లాడుకుంటున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.
భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కరెంట్ కోతలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ పొరుగున ఉన్న రాష్ట్రాల్లో కూడా కరెంట్ కోతలున్నాయి. చుట్టూ అంధకారమే ఉన్నప్పటికీ.. మణిద్వీపంలా తెలంగాణ వెలుగుతున్నది అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో దేశంలో విపరీతమైన జాడ్యాలు, అనారోగ్యకరమైన, అవసరం లేని పెడ ధోరణులు ప్రబలుతున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. భారత సమాజానికి ఇది శ్రేయస్కరం కాదు.
సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదరించాలి. అద్భుతమైన ఈ దేశంలో దుర్మార్గమైన విధానాలు దేశ ఉనికినే ప్రశ్నించే స్థాయికి పోతున్నాయి. ఈ సందర్భంలో ఒక రాజకీయ పార్టీగా మనం ఏం చేయాలి. మన ఆలోచన ధోరణి విధంగా ఉండాలన్నారు కేసీఆర్. ఈ దేశ అభ్యున్నతి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఉన్న విద్యుత్తును వినియోగించుకోలేని దేశమిది
ఇవాళ దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం.. 4,01,035 మెగావాట్ల అందుబాటులో ఉందని సీఎం తెలిపారు. అందుబాటులో ఉన్న వినియోగించలేని పరిస్థితిలో ఈ దేశం ఉంది. 4 లక్షల మెగావాట్ల విద్యుత్ శక్తి ఉన్నప్పటికీ.. 2 లక్షలకు మించి వాడటం లేదు. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా కరెంట్ కోతలు ఉన్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. మన చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో కూడా కరెంట్ కోతలు ఉన్నాయి.
చుట్టూ అంధకారం ఉంటే ఒక మణిద్వీపంలా తెలంగాణ వెలుగుతున్నది. ఏడేండ్ల క్రితం మనకు కూడా కరెంట్ కోతలే. కానీ మనం ఆ సమస్యను అధిగమించాం. వెలుగు జిలుగుల తెలంగాణగా తీర్చిదిద్దుకున్నాం. తెలంగాణలా దేశం పని చేసి ఉంటే.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముంబై నుంచి కోల్‌కతా వరకు 24 గంటలకరెంట్ ఉండేది. దేశంలో ఉన్న సీఎంల సమక్షంలో, ప్రధాని అధ్యక్షతన వహించే నీతి ఆయోగ్‌లోనూ ఈ విషయాన్ని కుండబద్ధలు కొట్టి చెప్పాను. కానీ లాభం లేదని కేసీఆర్ పేర్కొన్నారు.
పరుష విమర్శలు
ఈ సందర్భంగా ఎవర్నీ ఉద్దేశించకుండా కేసీఆర్ పరుష విమర్శలు చేశారు. దేశానికి కావాల్సింది ఫ్రంట్లు కాదనీ, రాజకీయ ప్రత్యామ్నాయమనీ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ చేయాలని కోరినట్లు తెలిపారు. ఆయన తన ప్రసంగంలో కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని కూడా ప్రస్తావించారు. ఇది ఇప్పుడు అవసరమా అని ప్రశ్నించారు. మానిన గాయాలను ఎందుకు రేపుతున్నారని కాశ్మీరీ పండిట్లు ప్రశ్నిస్తున్నారని కూడా కేసీఆర్ చెప్పారు. దేశం అన్ని విధాలా వెనుకంజ వేస్తోందన్నారు. అనవసరమైన విషయాలను రేపుతూ రాజకీయ ప్రయోజనం పొందాలనే ఆలోచనలు ప్రబలుతున్నాయని చెప్పారు.