తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు
చర్చ జరగాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్, ఫిబ్రవరి1: తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త చర్చకు తెరదీశారు. భారత్‌కు కొత్త రాజ్యాంగాన్ని రచించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే 87సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నామనీ, రాజ్యాంగంలో ఉన్న లోపాలను సరిచేసుకుని నూతన రాజ్యాంగాన్ని రచించుకోవాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
ఇది చర్చ జరగాల్సిన అంశమన్నారు. కేంద్ర బడ్జెట్‌పై తన అభిప్రాయాలను ఆయన కుండబద్దలు కొట్టారు. అదే సందర్భంలో బీజేపీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు బదులు ఇస్తూ ఆయన పై సూచన చేశారు. తాను ఫెడరల్ ఫ్రంట్ అని ఎప్పుడూ అనలేదన్నారు. తాను ఢిల్లీ వెళ్ళినా హైదరాబాద్‌కే తిరిగి వస్తానని కేంద్ర మంత్రిగా వెళ్ళినప్పుడు చెప్పాననీ.. ఇప్పుడూ అదే అంటున్నానని తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్ రెండు అసమర్థ పార్టీలనీ, దేశాన్ని నడిపించడానికి కొత్త దశ-దిశతో సాగాలనీ అది ఈ రెండు పార్టీల వల్లా కాదనీ కేసీఆర్ స్పష్టంచేశారు. దేశంలో 4.2లక్షల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంటే, వినియోగించుకుంటున్నది కేవలం 2 లక్షల మెగావాట్లేనన్నారు. దేశంలో 55శాతం ఇళ్ళు చీకటిలో మగ్గుతున్నాయన్నారు. ఈ కరెంటును సమర్థంగా ఉపయోగించుకోలేని స్థితిలో కేంద్రం ఉన్నదన్నారు. గుజరాత్ మోడల్ అంటూ యావద్దేశాన్నీ మభ్యపెట్టారన్నారు. ఎనిమిదేళ్ళ తరవాత మోడీ స్వభావం అర్థమైందన్నారు.
రామానుజ విగ్రహంపై బీజేపీ చేసే విమర్శలకు అర్థం లేదన్నారు. అసలు రామానుజ విగ్రహం గురించే మోడీకి తెలియదన్నారు. తొలుత రామానుజ జన్మస్థలం తమిళనాడులో విగ్రహాన్ని నెలకొల్పాలని చినజియర్ స్వామి భావించారనీ, కానీ అక్కడెవరూ కలిసి రాకపోవడం, హైదరాబాద్‌లో అవకాశం రావడం, పెట్టుబడి పెట్టడానికీ దాతలు ముందుకు రావడంతో ఇక్కడ నెలకొల్పుతున్నారన్నారు.
రామానుజ స్వామి అంటే దేవుడంటే అందరికీ సమానమే అని భావించినవాడని చెప్పారు. అందుకే విగ్రహానికి సమతామూర్తి అనే పేరు పెట్టారని కేసీఆర్ చెప్పారు. ఇదంతా తెలియని బీజేపీ వారు రామానుజ విగ్రహాన్ని మోడీ పెట్టిస్తున్నారనీ, అది కూడా ఒవైసీ ఇంటి వెనకాల పెట్టిస్తున్నారనీ అంటున్నారని ఎద్దేవా చేశారు.