ఐఏఎస్ రూల్స్ సవరణపై కేసీఆర్
అభిప్రాయాలను కుండబద్దలు కొట్టిన ముఖ్యమంత్రి
ప్రధాని నరేంద్రమోడీకి ఘాటుగా లేఖ
హైదరాబాద్, జనవరి 25: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కేంద్రంపై పోరును కొనసాగిస్తున్నారు. ధాన్యం కొనుగోలు అంశం దగ్గర నుంచి ఆయన కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తాజాగా ఆల్ ఇండియా సర్వీసెస్ (క్యాడర్) రూల్స్ (1954) సవరణపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తన అభిప్రాయాలను కుండబద్దలుకొడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేసీఆర్ లేఖ రాశారు.
అందులో ఆయన తన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఫెడరల్ స్ఫూర్తికి ఈ సవరణలు వ్యతిరేకమని ఆయన స్పష్టంచేశారు. లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
1) కేంద్రం చేపట్టిన ఆల్ ఇండియా సర్వీసెస్ (క్యాడర్) రూల్స్ 1954 ప్రతిపాదిత సవరణలు ఏ రకంగా చూసినా రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
2) ఈ సవరణలు ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్ ల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉన్నాయన్నారు.
3) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సవరణలను పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టంచేశారు.
4) ఆయా రాష్ట్రాల్లో ఏఐఎస్ అధికారులు నిర్వర్తించే క్లిష్టమైన ప్రత్యేక బాధ్యతల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు లేనిదే బదిలీపై కేంద్రం తీసుకోవడం ద్వారా రాష్ట్రాల పరిపాలనలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది రాజ్యాంగ స్వరూపానికి మరియు సహకార సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టని తెలిపారు.
5) ఈ సవరణల ద్వారా రాష్ట్రాలు గుర్తింపు లేకుండాపోయి నామమాత్రపు వ్యవస్థలుగానే మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంటుందన్నారు.
6) ఈ ప్రతిపాదిత సవరణలు రాష్ట్రాల్లో పనిచేసే అధికారులపై పరోక్ష నియంత్రణను అమలుచేసే ఎత్తుగడ. కేంద్ర ప్రభుత్వ అధికారులను తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకే ఈ సవరణ. ఇది రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో కేంద్రం జోక్యం చేసుకోవడమేనని తెలిపారు.
7) రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ఏఐఎస్ అధికారులను బాధ్యులుగా, జవాబుదారులుగా చేయాల్సిందిపోయి..వారిని మరింత నిరుత్సాహానికి గురిచేయడం, కేంద్రం చేత వేధింపుల దిశగా ఈ సవరణ ఉసిగొల్పుతుందన్నారు.
8) ఈ విధానం ఏఐఎస్ అధికారుల ముందు రాష్ట్రాలను నిస్సాహాయులుగా నిలబెడుతుంది.
9) రాజ్యాంగంలోని ఆర్టికల్ 312 లోని నిబంధనల ప్రకారం ఆల్ ఇండియా సర్వీసెస్ 1951 చట్టాన్ని పార్లమెంటు చేసిందని, దాని ప్రకారం భారత ప్రభుత్వం పలు నిబంధనలను రూపొందించిందని అంగీకరిస్తున్నానని చెప్పారు.
కాని, రాష్ట్రాల ఆకాంక్షలను కాలరాసే విధంగా దేశ సమాఖ్య రాజనీతిని పలుచన చేసే దిశగా ఏఐఎస్ క్యాడర్ రూల్స్ (1954)కు రంగులద్దుతూ ఉద్దేశపూర్వకంగా చేసిన సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
10) ఇది ఏఐఎస్ క్యాడర్ రూల్స్ 1954 సవరణ ఎంత మాత్రం కాదు. ఈ సవరణ కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు సంబంధించి భారత రాజ్యాంగాన్ని సవరించడమే తప్ప మరోటి కాదన్నారు.
11) ఏఐఎస్ సవరణను ఇట్లా దొడ్డిదారిన గాకుండా కేంద్ర ప్రభుత్వానికి ధైర్యముంటే పార్లమెంటు ప్రక్రియ ద్వారా సవరించాలని కోరారు.
12) రాష్ట్రాల ఆకాంక్షలకు విఘాతం కలుగకుండా ఉండాలంటే, రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొన్న తర్వాతే రాజ్యాంగ సవరణలు చేపట్టాలనే నిబంధనను ఆర్టికల్ 368 (2) లో రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో పొందుపరిచారని గుర్తుచేశారు.
13) ఏఐఎస్ క్యాడర్ రూల్స్ (1954) సవరణల ద్వారా కేంద్రం రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలపడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు
14) ఈ సవరణ కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండే పరిపాలన పరమైన ఏఐఎస్ ఉద్యోగుల పరస్పర సర్దుబాటుకు గొడ్డలిపెట్టని స్పష్టంచేశారు.
15) ఈ సవరణ ప్రతిపాదనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలకు మరింత విఘాతం.
16) ఏఐఎస్ అధికారులను రాష్ట్రాల్లో సామరస్యతతో, చక్కని సమతుల్యతతో వినియోగించుకోవడానికి ప్రస్తుతం అమలులో ఉన్న ఏఐఎస్ క్యాడర్ రూల్స్ సరిపోతాయి. ఈ నేపథ్యంలో పరిపాలనా పరమైన పారదర్శకతను, రాజ్యాంగ సమాఖ్య రాజనీతిని కొనసాగేంచాలని, అందుకు ప్రస్తుతం కేంద్రం చేపట్టిన ప్రతిపాదిత సవరణలను నిలిపివేయాలని నేను కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాను.